ఆగడాలకు అడ్డేదీ?

7 Jul, 2016 09:31 IST|Sakshi

 మంత్రి ఇలాకాలో పేట్రేగుతున్న తమ్ముళ్లు
  రోడ్డు నిర్మాణం పేరుతో పంట పొలాలు ధ్వంసం
  అధికార పార్టీ నేతల ఆగడాలతో ఠారెత్తుతున్న గ్రామీణులు
 ఆత్మకూరు :

 రాష్ట్ర మంత్రి పరిటాల సునీత సొంత నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు పేట్రేగిపోతున్నారు. వారి దౌర్జన్యాలకు అడ్డు లేకుండా పోతోంది. టీడీపీ నేతల ఆగడాలతో గ్రామీణులు ఠారెత్తిపోతున్నారు. ప్రశాంత గ్రామాల్లో రాజకీయం చిచ్చు రేపుతోంది. ఇంతకాలం అభివృద్ధి పేరుతో విపక్ష పార్టీలకు చెందిన వారిని నష్టాలకు గురిచేస్తూ వచ్చిన టీడీపీ నాయకులు, ప్రస్తుతం సాధారణ రైతులను సైతం వదలడం లేదు. రోడ్డు నిర్మాణం పేరుతో పంట పొలాలను ధ్వంసం చేయసాగారు. వారి ఆగడాలతో విసుగెత్తి పోయిన రైతులు పనులు అడ్డుకున్నారు.

 

వివరాల్లోకి వెళితే... ఆత్మకూరు మండలం సిద్ధరాంపురం గ్రామానికి తారు రోడ్డు నిర్మాణ పనులను టీడీపీ నేత కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. పనుల్లో భాగంగా రోడ్డు పక్కన రైతు కె.కొండారెడ్డి పట్టా భూముల్లో సాగు చేసిన వేరుశనగ పంటను ఆయన బుధవారం జేసీబీతో పెకలించసాగాడు. ఇదేమంటూ నిలదీసిన రైతులకు నాబార్డు నిబంధనల ప్రకారం ఇలానే చేయాలని ఉందని బుకాయించాడు. దీంతో రైతులు ఆందోళనకు దిగారు. పనులు అడ్డుకున్నారు. పట్టాభూముల్లో రోడ్డు వేయాలని ఎలా ఆదేశాలిచ్చారంటూ మండిపడ్డారు. భార్యాపిల్లల బంగారు నగలు తాకట్టు పెట్టి, అప్పు చేసి పంట సాగు చేపడితే కనీస సమాచారమైనా ఇవ్వకుండా పట్టాభూములను ఎలా పెకలించారంటూ వాగ్వాదానికి దిగారు. అధికారం ఉందనే దౌర్జన్యంతో రైతుల కడుపు కొట్టేందుకు చూస్తే సహించబోమని హెచ్చరించారు. ఈ విషయంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

 

>
మరిన్ని వార్తలు