గోల్డు స్మగ్లింగ్ పై కస్టమ్స్ కన్ను!

3 Jan, 2016 17:29 IST|Sakshi
ఇటీవల కస్టమ్స్ అధికారులు పట్టుకున్న బంగారం

యువతపై ఏజెంట్ల ప్రలోభాల వల
విదేశాల నుంచి బంగారం అక్రమంగా రాష్ట్రానికి చేరవేత
కస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండా ఎత్తుగడ
ఈ ఏడాది ఏడున్నర కిలోలు పట్టివేత

 
సాక్షి, విజయవాడ బ్యూరో: విజయవాడ కేంద్రంగా కొనసాగుతున్న బంగారం అక్రమ రవాణాపై కస్టమ్స్ అధికారుల నిఘా పెరిగింది. కస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండా విదేశాల నుంచి అక్రమంగా తీసుకొస్తున్న బంగారం బిస్కెట్లు, చేతి కడియాల వంటి ఆభరణాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అంతర్జాతీయ ఎయిర్పోర్టుల నుంచి డొమెస్టిక్ ఫ్లైట్ల ద్వారా విశాఖపట్నం, గన్నవరం చేరుకుంటున్న ప్రయాణికులను చాకచక్యంగా గుర్తించి వారి ద్వారా రవాణా అవుతున్న విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ ఏడాది మొత్తం 7.7 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని అక్రమంగా తరలిలించే వారిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు.

కిలోకు రూ.5 లక్షలకుపైగా లాభం
విజయవాడ మార్కెట్లో ఇటీవలి కాలంలో బంగారం కొనుగోళ్లు గణనీయంగా పెరిగాయి. నూతన రాజధాని నేపథ్యంలో విపణి వీధి కళకళలాడుతోంది. ఇదే అదనుగా కొందరు బంగారం వర్తకులు ఫైనాన్సియర్లుగా మారి ప్రత్యేక ఏజెంట్ల ద్వారా విదేశీ బంగారం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఏజెంట్ల ప్రలోభాలకు లొంగుతున్న యువతీయువకులు దుబాయి, సింగపూర్, మలేషియా వంటి దేశాలకు వెళ్లి అక్కడ బంగారం కొనుగోలు చేసి కస్టమ్స్ కళ్లు గప్పి రాష్ట్రానికి చేరవేస్తున్నారు. బంగారంతో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో దిగుతున్న స్మగ్లర్లు అక్కడి నుంచి దేశీయ విమానాల్లో విశాఖపట్నం, గన్నవరం ఎయిర్పోర్టులకు చేరుతున్నారు. ఈ బంగారం ఫైనాన్సియర్లకు... అక్కడి నుంచి జువెల్లరీ షాపులకూ చేరుతోంది. అక్రమ రవాణా ద్వారా కిలో బంగారంపై రూ.5 లక్షలకు పైగా లాభాన్ని గడిస్తున్నారు.
 
నిఘాను పటిష్టం చేశాం
విజయవాడ కేంద్రంగా సాగుతున్న విదేశీ బంగారం, సిగరెట్ల రవాణాపై గట్టి నిఘా పెట్టాం. విమానాశ్రయాలతోపాటు మిగతా ప్రాంతాల్లోనూ నిఘాను ముమ్మరం చేశాం. కస్టమ్స్ డ్యూటీ 12.5 శాతం చెల్లించకుండా దుబాయి వంటి దేశాల నుంచి వస్తున్న  బంగారాన్నిగుర్తిస్తున్నాం. ఈ ఏడాది సుమారు రూ.1.69 కోట్ల బంగారాన్ని సీజ్ చేశాం
 - ఎస్కే రెహమాన్, ఏపీ కస్టమ్స్ కమిషనర్

మరిన్ని వార్తలు