అంతా దైన్యం.. అభివృద్ధి శూన్యం

4 Oct, 2016 16:57 IST|Sakshi
అంతా దైన్యం.. అభివృద్ధి శూన్యం
* అస్తవ్యస్తంగా రోడ్లు.. డ్రైనేజీ వ్యవస్థ
సక్రమంగా అందని సాగునీరు
అడుగడుగునా ట్రాఫిక్‌ కష్టాలు
సమస్యల వలయంలో గుంటూరు నగరం
పాలకవర్గం లేకపోవడంతో టీడీపీ నేతల ఇష్టారాజ్యం
 
సాక్షి, గుంటూరు: తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఆధిపత్య రాజకీయాల కోసం నగర ప్రజల జీవితాలను ఫణంగా పెడుతున్నారు.  ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలనే రాజకీయ వ్యూహంలో భాగంగా ఐదు నెలలకో కమిషనర్‌ను బదిలీ చేయిస్తూ వచ్చారు. కొత్త కమిషనర్‌కు నగరంపై పూర్తి అవగాహన రావాలంటే కనీసం నాలుగైదు నెలలైనా పడుతుంది.   అవగాహన వచ్చేలోపు వారిని ఇక్కడి నుంచి బదిలీ చేసి పంపివేస్తుండడం నగర ప్రజలకు శాపంగా మారింది. గతంలో ఇక్కడ పనిచేసిన కన్నబాబు, అనురాధలు నగరాభివృద్ధిపై దృష్టి సారించి పాలనను గాడిలో పెడుతున్నారన్న సమయంలో బదిలీ కావడం ఎక్కడి ప్రతిపాదనలు అక్కడ నిలిచిపోయాయి. ప్రస్తుత కమిషనర్‌ నాగలక్ష్మి కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులు, పుష్కరనగర్‌ ఏర్పాటు బాధ్యతల్లో మునిగి తేలుతున్నారు. దీంతో  రెండు, మూడు నెలల సమయం వృథాగా పోయింది. ఆమె పాలనపై పట్టుసాధిస్తున్న తరుణంలో కార్పొరేషన్‌ ఎన్నికల వేడి మొదలవడంతో మళ్లీ అధికార పార్టీ నేతల జోక్యం పెరిగిపోయింది.
 
ఇబ్బడిముబ్బడిగా సమస్యలు..
నగరంలోని అనేక ప్రాంతాల్లో ప్రజలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారు. సక్రమంగా లేని రోడ్లు.. అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజీ వ్యవస్థ.. పారిశుద్ధ్య సమస్య.. తాగునీరందక ఇక్కట్లు. ఇలా చెప్పుకొంటూపోతే జాబితా చాంతాడంత ఉంటుంది.  ఈ సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి పది రోజుల కిందట టెండర్లు పిలిచారు. నిర్మాణ పనులు మూడేళ్లలో పూర్తిచేయాలనే నిబంధన పెట్టారు. ఇది మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. అంతేకాకుండా విలీన గ్రామాల్లో భూగర్భ డ్రైనేజీ నిర్మాణం చేపట్టకపోవడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చే ప్రమాదం ఉందని నగర ప్రజలు భావిస్తున్నారు. రాజధాని నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్‌ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించేందుకు పోలీస్‌ అధికారులు గత కమిషనర్‌ల నుంచి ఇప్పటివరకూ అందరితో చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఇది కార్యరూపం దాల్చకపోవడంతో నగర ప్రజలు ట్రాఫిక్‌ చక్రబంధంలో నిత్యం అల్లాడుతున్నారు. 
 
ఎన్నికల కోసం తమ్ముళ్ల రాజకీయ డ్రామా.. 
టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నగరాభివృద్ధి ఏమాత్రం జరగకపోవడం, సంక్షేమ పథకాల అమల్లోనూ నిర్లక్ష్యం వహించడంతో నగర ప్రజలు అధికార పార్టీపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. దీన్ని గుర్తించిన ఆ నేతలు ఎన్నికల నేపథ్యంలో నగరంలో ఏవో అద్భుతాలు  జరగబోతున్నట్లు ప్రజలను నమ్మించి ఓట్ల కోసం వెళ్లాలనే వ్యూహరచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా నగరంలో నాలుగు ఓవర్, అండర్‌ బ్రిడ్జిల నిర్మాణం, అనేక ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ పనులకు ప్రతిపాదనలు సిద్ధంచేస్తున్నారు. ఎన్నికలు దగ్గరపడ్డ సమయంలో ఒకట్రెండు పనులకు శంకుస్థాపన చేసి ప్రజలను మభ్యపెట్టే కుట్రకు తెరతీయనున్నారు.
మరిన్ని వార్తలు