రాష్ట్రంలో నియంత పాలన

17 Jul, 2017 01:52 IST|Sakshi
రాష్ట్రంలో నియంత పాలన

∙    దళితులకు అండగా   ఉంటామంటే అరెస్టులా?
∙    దేవరపల్లికి తప్పక వెళ్తాను
∙    దామచర్లకి అభద్రతాభావం ఎక్కువైంది
∙    ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియడం లేదు   ప్రజల అవసరాలకు కావాల్సిన పనులు మేం చేశాం
∙    పేదలకు 8 వేల పట్టాలిచ్చాను  పర్సంటేజిల కోసం పాకులాడే చరిత్ర నీది
∙    ఏమీ చేయకుంటే నాలుగు సార్లు  ప్రజలు గెలిపిస్తారా..?
∙    విలేకర్ల సమావేశంలో వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు బాలినేని


ఒంగోలు అర్బన్‌: రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వ పాలన నియంత పాలనలా సాగుతోందని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు ఆయన నివాసంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పర్చూరు నియోజకవర్గం దేవరపల్లిలో దళితులకు జరుగుతున్న అన్యాయంపై వారికి అండగా ఉండేందుకు, ధైర్యం చెప్పేందుకు వెళ్తున్న సమాచారం తెలుసుకొని ఒక రోజు ముందుగానే అర్ధరాత్రి తనని హౌస్‌ అరెస్టు చేయడం అన్యాయమన్నారు. అధికార పార్టీ    తీరు చూస్తుంటే ఎమర్జెన్సీని తలపిస్తోందన్నారు. ఎన్ని రోజులు దేవరపల్లికి వెళ్లకుండా ఆపగలరో చూస్తానన్నారు. తప్పకుండా గ్రామానికి వెళ్లి దళితులకు అండగా నిలుస్తానని స్పష్టం చేశారు. దళితుల భూములు లాక్కున్న టీడీపీ నేతలని విడిచి వైఎస్సార్‌ సీపీ నేతలని దిగ్బంధించడం సిగ్గుచేటన్నారు.

స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌కి వస్తున్న వ్యతిరేకత చూసి అభద్రతాభావం ఎక్కువైందన్నారు. మతి చలించిన ఆయన ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. నియోజకవర్గానికి తాను ఏం చేశానని దామచర్ల ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఏమీ చేయకుండా నాలుగు సార్లు ప్రజలు గెలిపిస్తారా అని ప్రశ్నించారు.  ఉలిచి చెక్‌డ్యాం, మెడికల్‌ కాలేజి, రిమ్స్, ఓవర్‌హెడ్‌ ట్యాంకులు, ఫిల్టర్‌బెడ్లు, గుండ్లకమ్మ ప్రాజెక్టు ఎవరి హయాంలో వచ్చాయో తెలుసుకోవాలని సూచించారు.

పర్సంటేజీల కోసం పనులు చేయలేదు..
పేదలకి 8 వేల నివేశన స్థల పట్టాలిచ్చానని గుర్తు చేశారు. ఒక్క పేదవాడికైనా ఒక్క పట్టా అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పనులు చేశామే తప్పా పర్సంటేజిల కోసం పని చేయలేదన్నారు. గుండ్లకమ్మ పైపులైన్‌ పనుల్లో పర్సంటేజిలు తీసుకొని ఇళ్లు నిర్మించుకోవడం లేదా అని ప్రశ్నించారు. ఈ విషయం సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ నాయకులే అంటున్నారని విమర్శించారు. చివరికి గడపగడపకు వైఎస్సార్‌ కార్యక్రమానికి ప్రజలు అభిమానంతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుంటే చూసి ఓర్వలేకపోవడం సిగ్గు చేట న్నారు. దాంతో ఫ్లెక్సీల వాడకం రద్దు చేశామని చెప్పి టీడీపీ కార్యక్రమాలకి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటూ చిన్న పిల్లాడిలా వ్యవహరించడం దామచర్లకే చెల్లిందన్నారు. ఒంగోలు దామచర్ల జాగీరు కాదని అహ ంకారంతో ప్రవర్తిస్తున్న తీరు ప్రజలతో పాటు టీడీపీ నాయకుల్లోనూ అసహనం కలిగిస్తోందన్నారు.

దామచర్లకి బుద్ధి చెప్పే సమయం కోసం ప్రజలు ఆయనతో ఉంటున్న నాయకులు సిద్ధంగా ఉన్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి స్థలం ఇవ్వకపోవడంతో అధికారులను బదిలీ చేస్తూ ఒకే సమాజిక వర్గానికి చెందిన వారికి ప్రాధాన్య ఇవ్వడం సిగ్గుచేటన్నారు. తన హయాంలో కుల, మత, పార్టీలకు అతీతంగా పనిచేసిన చరిత్ర ఉందన్నారు. దామచర్ల ఆంజనేయులు విగ్రహం ఏర్పాటు చేయాలని జనార్దన్‌ స్వయంగా కోరి తే సహకరించి ఏర్పా టు చేశామన్నారు. జనార్దన్‌ తాత ఆంజనేయులు మంత్రిగా ఉన్న సమయంలో ఒంగోలుకి ఏం చేశారో ఆయన చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. దివంగత నేత వైఎస్‌ హయాంలో జిల్లాలో కనిగిరి ఫ్లోరైడ్‌ సమస్యకి రూ.70 కోట్లు కేటాయించామన్నారు. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభించినా దాన్ని టీడీపీ పట్టించుకుందా అని ప్రశ్నించారు. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌ స్థాయి కల్పించింది వైఎస్‌ హయాంలోనే అని గుర్తుచేశారు.

హామీలు నెరవేర్చకపోగా విమర్శలా..
నగర అధ్యక్షుడు శింగరాజు వెంకట్రావు మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ధర్నా చేశారని, దానికి హాజరైన బాలినేని ప్రభుత్వ డొల్లతనాన్ని బయటపెట్టారని అన్నారు. హామీలు నెరవేర్చకపోగా స్థానిక నేతలు బాలినేని విమర్శించడం సిగ్గుచేటన్నారు. సమావేశంలో పార్టీ వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు డీఎస్‌ క్రాంతికుమార్‌ ఉన్నారు.

Election 2024

మరిన్ని వార్తలు