గూడు.. గోడు

3 Jan, 2017 22:33 IST|Sakshi
గూడు.. గోడు

దశాబ్దాల కాలంగా గోసపడుతున్న ఖాకీలు
ఉమ్మడి జిల్లాలో రక్షక భటులకు నివాస  గృహాలు కరువు
కొన్ని చోట్ల ఉన్నా.. శిథిలావస్థలో భవనాలు
బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్న వైనం
80 శాతం పోలీసుల ఆరుబయటే..


మంచిర్యాల క్రైం : శాంతిభద్రతలు కాపాడు తూ.. నిత్యం ప్రజలకు రక్షణగా నిలుస్తున్న రక్షక భటులకు గూడు గోడు తప్పడం లేదు. పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో నివాస గృహాలు లేక నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడో ఒక చోట క్వార్టర్స్‌ ఉన్నా అవి పూర్తిస్థాయి శిథిలావస్థకు చేరాయి. మండలం పరిధిలోని స్టేషన్‌కు దూరంగా ఎక్కడో గృహాలు కిరాయికి తీసుకోవడం.. డ్యూటీ అ యిపోయాక వెళ్లడం.. మళ్లీ ఏదైనా పనిపడితే స్టేషన్‌కు రావడం అంటే నరకం కనిపిస్తోందని పలువురు పోలీస్‌ సిబ్బంది వాపోతున్నారు.

గూడు మరిచిన ప్రభుత్వం..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత పోలీస్‌ శాఖకు పెద్దపీట వేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సింగాపూర్‌ పర్యటన అనంతరం అక్కడి పోలీసింగ్‌ విధానాన్ని ఇక్కడ అమలు చేసే దిశలో పోలీస్‌ శాఖలో భారీగా మార్పులు చేర్పులు చేశారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌కు కొత్త బొలేరో వాహనాం, జిల్లా స్థాయి పోలీస్‌ అధికారికి ఇన్నోవా, స్కార్పి యో వంటి టాప్‌మోడల్‌ వాహనాలను ప్రభుత్వం అందజేసింది. కానీ.. పోలీసు ఉద్యోగులకు ఇళ్ల ని ర్మాణంపై ప్రభుత్వంలో నేటికీ స్పం దన కానరావడంలేదు. ఉమ్మడి జిల్లాలోని పోలీస్‌ స్టేషన్లలో ఎక్కడా నివాస గృహాలు లేవు. చిన్నస్థాయి వారు కొందరు బయట అద్దె చెల్లించే స్థోమత లేక శిథిలావస్థలో ఉన్న క్వార్టర్లలోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో పోలీసుల పరిస్థితి ఇది..
ఉమ్మడి జిల్లాలో 82 పోలీస్‌స్టేషన్లు, రెండు మహిళా పోలీస్‌ స్టేషన్లు, రెండు ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్లు, ముగ్గురు ఎస్పీలు, ఒక డీసీపీ, ముగ్గురు ఏసీపీలు, 4,304 మంది పోలీçస్‌ సిబ్బంది, 866 మంది హోమ్‌ గార్డ్స్‌ ఉన్నారు. వీరిలో ఎస్పీల నుంచి ఎస్సై స్థాయి అధికారులకు కొంత మందికి అరకొర వసతుల నడుమ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో క్వార్టర్స్‌ కేటాయించారు. మరి కొంతమంది ఆరు బయటనే అద్దెకు ఉంటున్నారు. ఉమ్మడి జిల్లాలో 55 మంది సీఐలు ఉన్నారు. వీరికి 16 క్వార్టర్స్‌ మాత్రమే ఉన్నాయి. 39 మంది సీఐలు బయటనే అద్దెకు ఉంటున్నారు. 150 మంది ఎస్సైలు ఉన్నారు. వీరికి 55 క్వార్టర్స్‌ ఉన్నాయి. 95 మంది ఎస్సైలు బయ ట నుంచే విధులు నిర్వహిస్తున్నారు. ఏఎస్సైలు 236 మంది ఉన్నారు. ముగ్గురికే క్వార్టర్స్‌ ఉన్నాయి. హెడ్‌కానిస్టేబుళ్లు 1296 మంది ఉండగా.. 22 మందికి మాత్ర మే క్వార్టర్స్‌ ఉన్నాయి. పోలీస్‌ కానిస్టేబుళ్లు 2,560  మంది ఉన్నారు. 1,331 మందికి క్వార్టర్స్‌ ఉన్నాయి.

ఇబ్బందుల్లో పోలీసులు..
విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉంటున్న పోలీసులకు స్టేషన్‌ అవరణలో సొంత భవనాలు లేక తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. డ్యూటీ ముగిసిన వెంటనే ఇంటికి వెళ్లడంతో.. మళ్లీ ఏదైనా అర్జంట్‌ పని ఉంటే వెళ్లాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు. పైగా బయట పోలీసులకు ఇల్లు అద్దెకు ఇచ్చేందుకు ముందుకు రావడంలేదని అంటున్నారు.

హెచ్‌ఆర్‌ఏపై వివక్ష..
నిబంధనల ప్రకారం ప్రతి ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు 14 శాతం హెచ్‌ఆర్‌ఏ (హౌజ్‌ రెంట్‌ అలవెన్స్‌)  ప్రభుత్వం నెలసరి వేతనంతో పాటు కలిపి ఇస్తోంది. అయితే.. జిల్లా కేంద్రంలోనూ కమిషనరేట్‌ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు 20 శాతం హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తోంది. కానీ.. పోలీస్‌ శాఖలో మాత్రం  ఈ నిబంధన వర్తించడం లేదని పలువురు పోలీస్‌ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విపరీతంగా అద్దె ఉండటంతో తీవ్ర ఇబ్బందిగా ఉందని వాపోతున్నారు.

>
మరిన్ని వార్తలు