రిక‘వర్రీ’

30 Jun, 2017 04:31 IST|Sakshi
రిక‘వర్రీ’

ఉపాధి నిధులకు ఎసరు
సామాజిక తనిఖీల్లో బహిర్గతం
రాబట్టేందుకు ఆపసోపాలు
రూ.10కోట్లలో వసూలైంది పదిశాతమే


తంబళ్లపల్లెకు చెందిన టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఒకరు  మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు పాల్పడ్డారు. సామాజిక తనిఖీలో రూ.12.65లక్షల నిధులు దుర్వినియోగమైనట్లు తేలింది. ఏడేళ్ల కిందట షోకాజ్‌ నోటీసు కూడా జారీ చేసినా ఒక్క పైసా రికవరీ కాలేదు.  ఎర్రావారిపాళెం మండలంలో టెక్నికల్‌ అసిస్టెంట్‌ రూ.7.44లక్షల మేర దుర్వినియోగం చేశారు. సామాజిక తనిఖీ అధికారులు రూ.20 వేలు కడితే చాలని తేల్చారు. మిగతా రూ.4.39 లక్షల స్వాహాపై చర్యలు తీసుకోవడంలో నీటియాజమాన్య సంస్థ అధికారులు నీళ్లు నములుతున్నారు.ఎర్రావారిపాళెం మండలంలో క్షేత్ర స్థాయి సిబ్బంది ఒకరు రూ.1.39లక్షలు అక్రమాలకు పాల్పడితే పూర్తి స్థాయిలో రికవరీ చేయడంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. సామాజిక తనిఖీలో మాత్రం కేవలం రూ.22వేలు దుర్వినియోగం జరిగినట్లు తేల్చారు. ఆ ఉద్యోగి నుంచి రూ.102 రికవరీ చేశారు.         

చిత్తూరు, సాక్షి : జిల్లాలో ఉపాధి హామీ పనుల్లో నిధులు దుర్వినియోగమవుతున్నాయి.2006లో ఈ పథకం ప్రారంభమైంది. అప్పట్లో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అయ్యాయి. కొందరు పనులు ప్రాంభించకుండానే బిల్లులు చేసుకుని సొమ్ము కాజేశారు. దీన్ని సామాజిక తనిఖీ బృం దాలు గుర్తించాయి. అక్రమాలకు పాల్పడిన ఉద్యోగులు ఎవరెవరు ఎంత దుర్వినియోగం చేశారనే విషయాలు డ్వామా అధికారులకు అప్పట్లోనే తెలిపారు. రికవరీ చేయాలని నిర్ణయించి ఏళ్లు గడుస్తున్నా నేటికీ వసూలు చేయలేదు. జిల్లాలోని 66 మండలాల్లోనూ నిధులు దుర్వినియోగమయ్యాయి.

  ఇప్పటివరకు రూ.10.22 కోట్ల దుర్వినియోగమైనట్లు లెక్కలు చెబుతున్నాయి. రూ.1.58కోట్లు మాత్రమే రికవరీ చేశారు. పది లక్షల రూపాయలకు పైగా సొమ్ము దుర్వినియోగమైన మండలాలు దాదాపు పది ఉన్నాయి. వీటిలో ఏ ఒక్క ఉద్యోగి నుంచి కూడా పూర్తి స్థాయిలో రికవరీ కాకపోవడం గమనార్హం. తంబళ్లపల్లె, ఎర్రావారిపాళెంలోనే సుమారు రూ. 20 లక్షల వరకు దుర్వినియోగమయ్యాయి. కానీ ఈ మొత్తం రూ.10 కోట్ల వరకు ఉంటుంది. కాంట్రాక్టు సిబ్బందిని రెన్యువల్‌ చేసే క్రమంలో వారు చెల్లించాల్సిన సొమ్ము చెల్లిస్తేనే ఉద్యోగ కాంట్రాక్టు పునరుద్ధరిస్తున్నారు. అప్పట్లో ఉపాధి హామీలో వివిధ విభాగాల్లో కాంట్రాక్టు , అవుట్‌ సోర్సింగ్‌ కింద పని చేసి ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వారిని గుర్తించే పనిలో అధికారులు పడ్డారు.

మరిన్ని వార్తలు