డీపీఓ కావలెను

18 Jun, 2017 23:17 IST|Sakshi
డీపీఓ కావలెను
- రెండేళ్లుగా ఇన్‌చార్జిలతోనే సరి
- గుట్టలుగా పేరుకుపోతున్న ఫైళ్లు
- ఏ అనుమతి కావాలన్నా కలెక్టరేట్‌కే..
- 3 నెలలుగా జీతాలు రాక అవస్థలు పడుతున్న కార్మికులు
బోట్‌క్లబ్‌ (కాకినాడ) : పూర్తిస్థాయి జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) లేకపోవడంతో జిల్లాలో గ్రామ పరిపాలన గాడి తప్పుతోంది. ఇక్కడ డీపీఓ పని చేసిన ఆనంద్‌ 2015 జూలైలో బదిలీ అయ్యారు. అప్పటి నుంచీ ఈ స్థానాన్ని ఇన్‌చార్జిలతోనే నెట్టుకొస్తున్నారు. వారు కూడా కార్యాలయానికి సక్రమంగా రాకపోవడంతో ఫైల్స్‌ పెండింగ్‌లో ఉంటున్నాయి   ఇన్‌చార్జిలను సహితం మారుస్తున్నప్పటికీ పాలన గాడిలో పడడం లేదు. ఆనంద్‌ బదిలీ తరువాత నుంచి ఇప్పటివరకూ నలుగురు ఇన్‌చార్జ్‌ డీపీఓలుగా పని చేశారు. ఆనంద్‌ బదిలీ అయిన వెంటనే జిల్లా సహకార అధికారి ప్రవీణకు ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించారు. సుమారు ఆరు నెలల కాలంలో ఆమె ఒక్కసారి కూడా డీపీఓ కార్యాలయంలో అడుగు పెట్టలేదు. దీంతో ఫైల్స్‌ గుట్టలు గుట్టలుగా పేరుకుపోయాయి. దీనిపై అప్పట్లో ‘ఇన్‌చార్జి పాలనతో అవస్థలు’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలో ఆమెను ఆ బాధ్యతల నుంచి తప్పించి, అమలాపురం డీఎల్‌పీఓ శర్మను ఇన్‌చార్జ్‌గా నియమించారు. ఆయన సక్రమంగా విధులు నిర్వహించకపోవడంతో ఆరు నెలల తరువాత జెడ్‌పీ సీఈఓ పద్మకు ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించారు. జిల్లా పరిషత్‌లో పని భారం ఎక్కువగా ఉండడంతో ఆమె కూడా డీపీఓ కార్యాలయంపై దృష్టి సారించలేకపోయారు. దీంతో ఆమెను కూడా ఆ బాధ్యతల నుంచి తప్పించి రంపచోడవరం గిరిజన సంక్షేమ స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌గా పని చేస్తున్న టీవీఎస్‌జీ కుమార్‌ను ఇన్‌చార్జిగా నియమించారు. ఆరు నెలలుగా ఆయన ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు.
పెండింగ్‌ ఫైళ్లకు మోక్షమెప్పుడో!
జిల్లాలోని మేజర్‌ పంచాయతీలు మినహా మైనర్‌ పంచాయతీల్లో రెగ్యులర్‌ సిబ్బంది ఉండరు. దీంతో అక్కడ కాంట్రాక్టు సిబ్బందితో పారిశుద్ధ్యం, ట్యాంకు వాచర్లు, బిల్లు కలెక్టర్ల వంటి పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో నియమిస్తారు. వారికి జీతభత్యాలు చెల్లించేందుకు అనుమతి కోరుతూ డీపీఓకు పంచాయతీ కార్యదర్శులు ప్రతి నెలా ఫైల్‌ పెడతారు. డీపీఓ అనుమతి లేనిదే వారికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇన్‌చార్జ్‌ డీపీఓ కావడంతో ప్ర ఫైలునూ కలెక్టర్‌ అనుమతి కోసం పంపుతున్నారు. కలెక్టర్‌ కార్యాలయంలో కూడా ఆ ఫైళ్లు పెండింగ్‌లో ఉండిపోతున్నాయి. ఫలితంగా జిల్లాలోని వివిధ పంచాయతీల్లో పని చేస్తున్న 500 మందికి పైగా కాంట్రాక్టు సిబ్బంది మూడు నెలలుగా జీతాలు లేక ఇబ్బంది పడుతున్నారు. వీరికి ఒక్కొక్కరికి ప్రతి నెలా రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకూ జీతం చెల్లించాలి. తమకు జీతాలు చెల్లించాలని పంచాయతీ అధికారులపై కాంట్రాక్టు సిబ్బంది ఒత్తిడి తీసుకు వస్తున్నారు. దీంతో ఆయా పంచాయతీల కార్యదర్శులు డీపీఓ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయినప్పటికీ ఫలితం ఉండడంలేదు.
వేరే శాఖ అధికారి వల్ల ఇబ్బందులు
జిల్లాలో ఐదుగురు డివిజనల్‌ పంచాయతీ అధికారులుండగా వారికి కాకుండా వేరే శాఖకు చెందిన వారికి ఇన్‌చార్జి డీపీఓ బాధ్యతలు అప్పగిస్తున్నారు. వారికి గ్రామ పరిపాలనపై సరైన అవగాహన లేనందువల్లనే ఈ ఇబ్బందులు తలెత్తున్నాయన్నది సిబ్బంది వాదన. రెగ్యులర్‌ డీపీఓను నియమిస్తే తప్ప తమ ఇబ్బందులు తొలగవని వారంటున్నారు. ప్రస్తుతం కడప డీపీఓగా పని చేస్తున్న సుబ్రహ్మణ్యం జిల్లాకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అయితే దీనికి జిల్లాకు చెందిన ఓ మంత్రి, కొందరు ప్రజాప్రతినిధులు మోకాలడ్డుతున్నట్టు సమాచారం.
మరిన్ని వార్తలు