డిగ్రీ విద్యార్థులకు న్యాయం చేయాలి

16 Aug, 2016 18:04 IST|Sakshi
డిగ్రీ విద్యార్థులకు న్యాయం చేయాలి

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ) జిల్లా కన్వీనర్‌ కరుణాకర్‌రెడ్డి

చేవెళ్ల: డిగ్రీలో ఇప్పటివరకు ప్రవేశం పొందని సుమారు రెండు లక్షల మందికి ప్రభుత్వం న్యాయం చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ) జిల్లా కన్వీనర్‌ జే.కరుణాకర్‌రెడ్డి తెలిపారు.  ఈ విషయంపై  ఆయన మంగళవారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. డిగ్రీలో ప్రవేశంకోసం ప్రభుత్వం 2016-17  ఈ విద్యాసంవత్సరం నుంచి  మొట్టమొదటిసారిగా ఆన్‌లైన్‌లో ప్రవేశాలను ప్రవేశపెట్టిందని తెలిపారు. విద్యాసంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడిచినా ఇప్పటివరకు ఫేజ్-1, ఫేజ్‌-2  కౌన్సెలింగ్‌ నిర్వహించినా ఇప్పటికీ రెండు లక్షల మందికి ప్రవేశాలు లభించలేదని ఆవేదన వ్యక్తంచేశారు.

        ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల్లో ఇంకా చాలావరకు సీట్లు ఖాళీగానే ఉన్నాయని తెలిపారు. ఇటు సీట్లు భర్తీకాక, అటు విద్యార్థులకు ప్రవేశంలేక డిగ్రీ విద్యా విధానం ఆగమ్యగోచరంగా తయారైందని చెప్పారు. డిగ్రీ ప్రవేశాలకు ఆన్‌లైన్‌ భర్తీ విధానం ప్రవేశపెట్టిన ప్రభుత్వం దానిపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించలేదన్నారు. ఆన్‌లైన్‌ విధానంలో తమపేర్లు నమోదు చేసుకునే విధానం తెలియక 2లక్షల మంది ఇంకా ప్రవేశాలకోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించకుంటే విద్యార్థులు ఈ విద్యాసంవత్సరం కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డిగ్రీలో ప్రవేశంకోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తిచేశారు. అంతేకాకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు, ప్రవేశాలు, తదితర అంశాల్లో అవగాహన కోసం ప్రభుత్వం సహాయ కేంద్రాన్ని ఏర్పాటుచేసి విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు.

మరిన్ని వార్తలు