సంతానం కోసం వెళితే దారుణం..

27 Sep, 2016 15:11 IST|Sakshi
వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న సాయిజ్యోతి. (ఇన్ సెట్‌) ఆమె పాతచిత్రం (ఫైల్‌)

చైతన్యపురి: వైద్యుల నిర్లక్ష్యం.. మహిళ ప్రాణంపైకి తెచ్చింది... సంతానం కోసం శస్త్ర చికిత్స చేసిన వైద్యుల పుణ్యమా అని ఆమె వెంటిలేటర్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. చైతన్యపురి ఠాణా పరిధిలో ఈ ఘటన జరి గింది.  భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి భర్త కథనం ప్రకారం...  నల్ల గొండ జిల్లా చౌటుప్పల్‌లో సాయిజ్యోతి ఆసుపత్రి డాక్టర్‌ సుమన్ కల్యాణ్‌కు 2007లో సాయిజ్యోతి (36) తో పెళ్లైంది.

ఆసుపత్రి నిర్వహణ బాధ్యతలు సాయిజ్యోతి చూసుకుంటోంది. వీరికి సంతానం కలగకపోవడంతో నాగోలు చౌరస్తాలోని సృజన సంతాన సాఫల్య కేంద్రం వైద్యులు సౌజన్య, రాణి, శ్రీశైలేష్‌ విఠల్‌లను సంప్రదించారు. చిన్నపాటి శస్త్ర చికిత్స చేస్తే సంతానం కలుగుతుందని డాక్టర్లు చెప్పారు. దీంతో ఈనెల 12వ తేదీ సాయంత్రం సాయిజ్యోతి, సుమన్్ దంపతులు సృజన ఆసుపత్రికి వెళ్లారు.

ఆపరేషన్ కు ముందు వైద్యు లు స్వప్న, శ్రీకాంత్‌లు సాయిజ్యోతికి అనస్థీషియా (మత్తు) ఇచ్చారు. శస్త్ర చికిత్స ప్రారంభించిన వైద్యులు సాయిజ్యోతి పరిస్థితి విషమించినట్టు గుర్తించారు. అదే రోజు రాత్రి ఓమ్నీ ఆసుపత్రికి తరలించగా.. అక్కడి డాక్టర్లు తమ వల్ల కాదని చెప్పడంతో 13వ తేదీన ఎల్బీనగర్‌లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. ఫిట్స్‌ రావడంతో సాయిజ్యోతి పరిస్థితి విషమంగా మారడం తో వెంటిలేటర్‌ అమర్చారు.

రెండు వారాలుగా చికిత్స చేస్తున్నా.. ఆమె ఆరోగ్య పరిస్థితిలో మార్పు రాకపోవడంతో భర్త సుమన్ కల్యాణ్‌ చైతన్యపురి పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఆసుపత్రి వైద్యులు సృజన, శ్రీ శైలేష్‌ విఠల్, రాణి, అనస్థీషియా వైద్యులు స్వప్న, శ్రీకాంత్‌ల నిర్లక్ష్యం వల్లే తన భార్య ఆరోగ్య పరిస్థితి విషమించి ప్రాణంపైకి వచ్చిందని సుమన్‌ కల్యాన్‌ సోమవారం విలేకరుల సమావేశంలో తెలిపారు.

నడుచుకుంటూ వెళ్లిన తన భార్యను స్పృహలేని స్థితిలో మరో ఆసుపత్రికి తరలించాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరొకరికి ఇలాంటి దుస్థితి రాకుండా ఉండాలంటే నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులను చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నామన్నారు. కాగా దీనిపై ఆసుపత్రి వైద్యులను వివరణ కోరేందుకు ప్రయ త్నించగా వారు అందుబాటులోకి రాలేదు.


 

>
మరిన్ని వార్తలు