పసిడి పారుల్‌ అన్ను బంగారం

4 Oct, 2023 04:36 IST|Sakshi

5000 మీటర్లలో, జావెలిన్‌ త్రోలో భారత్‌కు తొలిసారి స్వర్ణ పతకాలు అందించిన మహిళా అథ్లెట్లు

పదో రోజు భారత్‌ ఖాతాలో రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, ఐదు కాంస్యాలు  

చైనా గడ్డపై భారత మహిళా అథ్లెట్లు పారుల్‌ చౌధరీ, అన్ను రాణి అద్భుతం చేశారు. ఆసియా క్రీడల చరిత్రలో తొలిసారి భారత్‌కు 5000 మీటర్ల విభాగంలో పారుల్‌... జావెలిన్‌ త్రోలో అన్ను రాణి పసిడి పతకాలు అందించారు. ఈ ఇద్దరితోపాటు మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో విత్యా రామ్‌రాజ్‌ కాంస్యం... పురుషుల ట్రిపుల్‌ జంప్‌లో ప్రవీణ్‌ చిత్రావెల్‌ కాంస్యం... పురుషుల 800 మీటర్ల విభాగంలో మొహమ్మద్‌ అఫ్జల్‌ రజతం... పది క్రీడాంశాల సమాహారమైన డెకాథ్లాన్‌లో తేజస్విన్‌ శంకర్‌ రజతం గెల్చుకున్నారు.

అథ్లెటిక్స్‌ కాకుండా బాక్సింగ్‌లో రెండు కాంస్యాలు... కనోయింగ్‌లో ఒక కాంస్యం లభించాయి. ఓవరాల్‌గా ఆసియా క్రీడల పదో రోజు భారత్‌ ఖాతాలో తొమ్మిది పతకాలు చేరాయి. మరో ఐదు రోజులపాటు కొనసాగే ఈ క్రీడల్లో ప్రస్తుతం భారత్‌ 69 పతకాలతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఆర్చరీలో మూడు పతకాలు... బాక్సింగ్‌లో మరో పతకం... క్రికెట్‌లో ఒక పతకం కూడా ఖరారయ్యాయి. ఫలితంగా ఆసియా క్రీడల చరిత్రలోనే భారత్‌ తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేయడం లాంఛనం కానుంది. 2018 జకార్తా ఆసియా క్రీడల్లో భారత్‌ అత్యధికంగా 70 పతకాలు సాధించింది.   

హాంగ్జౌ: బరిలోకి దిగితే పతకం సాధించాలనే లక్ష్యంతో తమ ఈవెంట్లలో పోటీపడుతున్న భారత అథ్లెట్లు ఈ ఆసియా క్రీడల్లో మెరిపిస్తున్నారు. నిలకడగా రాణిస్తూ... తమపై పెట్టుకున్న అంచనాలకు మించి ప్రతిభ కనబరుస్తూ... 1951 తర్వాత ఈ క్రీడల చరిత్రలో పతకాలపరంగా తమ అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేశారు. పోటీల పదోరోజు భారత్‌కు తొమ్మిది పతకాలు రాగా... అందులో ఆరు అథ్లెటిక్స్‌ ఈవెంట్ల నుంచి వచ్చాయి. ప్రస్తుతం ఈ ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు ఇప్పటికే 22 పతకాలు (4 స్వర్ణాలు, 10 రజతాలు, 8 కాంస్యాలు) గెలిచారు. తద్వారా 2018లో 20 పతకాల ప్రదర్శనను సవరించారు. 1951లో న్యూఢిల్లీ వేదికగా జరిగిన తొలి ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు అత్యధికంగా 34 పతకాలు గెలిచారు. 

మంగళవారం భారత మహిళా అథ్లెట్లు పారుల్‌ చౌధరీ, అన్ను రాణి పసిడి కాంతులు విరజిమ్మారు. 5000 మీటర్ల రేసులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన పారుల్‌ విజేతగా అవతరించింది. ఆమె అందరికంటే వేగంగా 15 నిమిషాల 14.75 సెకన్లలో గమ్యానికి చేరి స్వర్ణ పతకాన్ని గెలిచింది. తద్వారా ఈ క్రీడల చరిత్రలో 5000 మీటర్లలో బంగారు పతకం గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా పారుల్‌ గుర్తింపు పొందింది. తాజా క్రీడల్లో పారుల్‌కిది రెండో పతకం. ఆమె 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో రజతం గెలిచింది.

గతంలో మహిళల 5000 మీటర్ల విభాగంలో భారత్‌ తరఫున సునీతా రాణి (1998–రజతం; 2002–కాంస్యం), ఓపీ జైషా (2006–కాంస్యం), ప్రీజా శ్రీధరన్‌ (2010–రజతం), కవితా రౌత్‌ (2010–కాంస్యం) పతకాలు నెగ్గారు. తాజా స్వర్ణ పతకంతో ఉత్తరప్రదేశ్‌ పోలీసు విభాగంలో తనను డీఎస్పీగా నియమిస్తారని పారుల్‌ ఆశిస్తోంది. యూపీ ప్రభుత్వ క్రీడా పాలసీ ప్రకారం ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన వారికి డీఎస్పీ ఉద్యోగం ఇస్తారు.  

మూడో ప్రయత్నంలో... 
వరుసగా మూడోసారి ఆసియా క్రీడల్లో పోటీపడ్డ జావెలిన్‌ త్రోయర్‌ అన్ను రాణి తొలిసారి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. 2014 ఇంచియోన్‌ ఏషియాడ్‌లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన అన్ను రాణి కాంస్యం సాధించింది. 2018 జకార్తా క్రీడల్లో ఆరో స్థానంతో నిరాశపరిచింది. మూడో ప్రయత్నంలో 31 ఏళ్ల అన్ను రాణి ఏకంగా బంగారు పతకాన్ని మెడలో వేసుకుంది. 11 మంది పోటీపడ్డ ఫైనల్లో అన్ను రాణి జావెలిన్‌ను తన నాలుగో ప్రయత్నంలో గరిష్టంగా 62.92 మీటర్ల దూరం విసిరి పసిడి పతకాన్ని ఖరారు చేసుకుంది. నదీషా దిల్హాన్‌ (శ్రీలంక; 61.57 మీటర్లు) రజతం, హుయ్‌హుయ్‌ లియు (చైనా; 61.29 మీటర్లు) కాంస్యం గెలిచారు.

‘ఏడాది మొత్తం ఎంతో ప్రయత్నించినా నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వలేకపోయా. ప్రభుత్వం నాపై ఎంతో డబ్బు వెచి్చంచి విదేశాల్లో శిక్షణకు పంపించింది. ఫలితాలు రాకపోవడంతో కాస్త నిరాశకు గురయ్యా. అయితే ఆసియా క్రీడల్లో ఈ సీజన్‌లోనే ఉత్తమ ప్రదర్శనతో స్వర్ణం సాధించడంతో చాలా ఆనందంగా ఉంది’ అని అన్ను రాణి వ్యాఖ్యానించింది.

ఆసియా క్రీడల మహిళల జావెలిన్‌ త్రోలో గతంలో బార్బరా వెబ్‌స్టర్‌ (1951; కాంస్యం), ఎలిజబెత్‌ డావెన్‌పోర్ట్‌ (1958; రజతం... 1962; కాంస్యం), గుర్మిత్‌ కౌర్‌ (1998; కాంస్యం) పతకాలు గెలిచారు.  మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో విత్యా రామ్‌రాజ్‌ కాంస్య పతకాన్ని సాధించింది. హీట్స్‌లో 55.42 సెకన్ల సమయం నమోదు చేసి పీటీ ఉష జాతీయ రికార్డును సమం చేసిన విత్యా ఫైనల్లో దానిని పునరావృతం చేయలేకపోయింది. తమిళనాడుకు చెందిన 25 ఏళ్ల విత్యా 55.68 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచింది. 

పురుషుల 800 మీటర్ల విభాగంలో మొహమ్మద్‌ అఫ్జల్‌ రజత పతకం గెలిచాడు. తొలిసారి ఆసియా క్రీడల్లో పోటీపడ్డ ఈ కేరళ అథ్లెట్‌ ఒక నిమిషం 48.43 సెకన్లలో రేసును ముగించి రెండో స్థానంలో నిలిచాడు. పురుషుల ట్రిపుల్‌ జంప్‌లో ప్రవీణ్‌ చిత్రావెల్‌ భారత్‌కు కాంస్య పతకాన్ని అందించాడు. తమిళనాడుకు చెందిన 22 ఏళ్ల ప్రవీణ్‌ 16.68 మీటర్ల దూరం దూకి మూడో స్థానంలో నిలిచాడు. 

49 ఏళ్ల తర్వాత... 
పది క్రీడాంశాల (100 మీటర్లు, లాంగ్‌జంప్, షాట్‌పుట్, హైజంప్, 400 మీటర్లు, 110 మీటర్ల హర్డిల్స్, డిస్కస్‌ త్రో, పోల్‌వాల్ట్, జావెలిన్‌ త్రో, 1500 మీటర్లు) సమాహారమైన డెకాథ్లాన్‌లో 49 ఏళ్ల తర్వాత భారత్‌కు పతకం లభించింది. ఢిల్లీకి చెందిన తేజస్విన్‌ శంకర్‌ 7666 పాయింట్లతో కొత్త జాతీయ రికార్డు నెలకొల్పడంతోపాటు రజత పతకాన్ని సాధించాడు. 2011 నుంచి భారతీందర్‌ సింగ్‌ (7658 పాయింట్లు) పేరిట ఉన్న డెకాథ్లాన్‌ జాతీయ రికార్డును తేజస్విన్‌ సవరించాడు. 1974 టెహ్రాన్‌ ఆసియా క్రీడల్లో విజయ్‌ సింగ్‌ చౌహాన్‌ స్వర్ణం, సురేశ్‌ బాబు కాంస్యం గెలిచాక ఈ క్రీడల్లో మళ్లీ భారత్‌కు పతకం అందించిన డెకాథ్లెట్‌గా తేజస్విన్‌ గుర్తింపు పొందాడు.

మరిన్ని వార్తలు