పరిపాలన సౌలభ్యానికే జనాభా ప్రాతిపదికన ఏర్పాటు

11 Jun, 2016 08:22 IST|Sakshi
పరిపాలన సౌలభ్యానికే జనాభా ప్రాతిపదికన ఏర్పాటు

అధికారుల సమీక్షలో కలెక్టర్ లోకేష్‌కుమార్

ఖమ్మం జెడ్పీసెంటర్: పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త మండలాల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని కలెక్టర్ డీఎస్.లోకేష్‌కుమార్ తెలిపారు. శుక్రవారం టీటీడీసీ సమావేశ మందిరంలో ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో కొత్త మండలాల ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలాల ఏర్పాటు ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు సంయుక్తంగా పరిశీలన చేసి నివేదికలు పంపాలన్నారు. జనాభా ప్రాతిపదికను దృష్టిలో పెట్టుకుని నివేదికలు రూపొందించాలని చెప్పారు.

మండలానికి దూరంగా ఉన్న గ్రామ పంచాయతీలను దగ్గరగా ఉన్న మండలాలకు బదలాయించడానికి పంచాయతీ తీర్మానం చేయాలన్నారు. మండలాల ఏర్పాటుకు సంబంధించి రూపొందించిన నివేదికల్లో మౌలిక వసతుల కల్పనకు అనువుగా ఉండాలన్నారు. రహదారి అంశాలను పరిగణనలోనికి తీసుకోవాలని చెప్పారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా బడిబయట ఉన్న పిల్లలందరిని బడిలో చేర్పించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరిగేలా చూడాలన్నారు. మరుగుదొడ్లు లేని పాఠశాలలో 45 రోజుల్లో మరుగుదొడ్లు నిర్మించాలన్నారు. మంచినీటి సౌకర్యం, పారిశుద్ధ్య కార్యక్రమాలను పంచాయతీల ద్వారా నిర్వహించాలని ఎంపీడీఓలను ఆదేశించారు.

మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యాలు సక్రమంగా ఉన్నాయో లేదో తహసీల్దార్లు, ఎంపీడీఓలు తనిఖీ చేయాలన్నారు. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా  చర్యలు తీసుకోవాలన్నారు. దోమలు వ్యాప్తి చెందకుండా మురుగు నిల్వలను లేకుండా చూడాలన్నారు. నీరు నిలిచి ఉండే ప్రాంతాల్లో ఇంకుడు గుంతలను నిర్మిస్తే నీరు నిల్వ ఉండదని చెప్పారు. రహదారుల పక్కన వ్యర్థాలను వేయకుండా గ్రామపంచాయతీల ద్వారా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. హరితహారం పథకం కింద మండలాల్లో నిర్దేశించిన లక్ష్యాల కంటే అధికంగా మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలన్నారు. సాదా బైనామాలపై మీసేవ కేంద్రాలకు వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాలని చెప్పారు. 

 భూ కొనుగోలుపై తహసీల్దార్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. జిల్లాకు కొత్తగా మంజూరు చేసిన 17 పాఠశాలల నిర్మాణాలకు భూమి సేకరించి నివేదికలు పంపాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్, జిల్లా పరిషత్ సీఈఓ మారుపాక నాగేశ్, సీపీఓ రాందాస్, ఖమ్మం, కొత్తగూడెం ఆర్డీఓలు వినయ్‌కృష్ణారెడ్డి, రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు