‘ఒంటరి మహిళల భృతి’పై కొలిక్కిరాని కసరత్తు

3 Feb, 2017 03:21 IST|Sakshi

వయోపరిమితి నిర్ధారణపై సర్కారు తర్జన భర్జన
సాక్షి, హైదరాబాద్‌: ఒంటరి మహిళలకు ఆర్థికభృతి పథకం మార్గదర్శకాలపై కసరత్తు ఇంకా కొలిక్కి రాలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఒంటరి మహిళలకు ఆసరా పథకం ద్వారా నెలకు రూ.1,000 చొప్పున ఆర్థిక భృతిని అందిస్తామని సర్కారు గత శాసనసభ సమావేశాల్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ 1 నుంచి ఈ పథకం అమలులోకి రావాల్సి ఉన్నందున లబ్ధిదారుల ఎంపికకు అనుసరించాల్సిన మార్గదర్శకాలపై గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) గత పక్షం రోజులుగా కసరత్తు చేస్తోంది. వివాహం చేసుకోని మహిళలు, వివాహమైనప్పటికీ నాలుగేళ్లుగా విడిగా ఉంటున్నవారు, విడాకు లు తీసుకున్న మహిళలు, జోగినులను ఒంటరి మహిళలుగా పరిగణించాలని అధికా రులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆయా కేటగిరీల మహిళలకు కనీస వయసును 35గా నిర్ణయిస్తే మేలని ప్రభుత్వానికి సూచించారు. అయితే.. తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో జరిగిన సమావేశంలో మరో రెండు కేటగిరీల మహిళలను ఒంటరి మహిళలుగా పరిగణించాలనే అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. అత్యాచారం, యాసిడ్‌దాడులకు గురైన మహిళలను కూడా దీనికింద పరిగణించాలని ఉన్నతాధికారులు ప్రతిపాదించారు.

తదుపరి సమావేశంలో తుది నిర్ణయం
సెర్ప్‌ ప్రతిపాదించిన విధంగా కనీస వయ సు 35గా నిర్ణయిస్తే, అంతకన్నా తక్కువ వయసున్న మహిళల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో కనీస వయో పరిమితిని 21, 30, 35 ఏళ్లుగా నిర్ణయిస్తే, ఎంతమందికి లబ్ధి చేకూర్చవచ్చనే విషయమై అంచనాలు సిద్ధం చేయాలని సెర్ప్‌ అధికారులకు ప్రభుత్వం సూచించినట్లు తెలిసింది. ప్రతిపాదనలలో మార్పులు చేసి, తదుపరి సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవాలని సెర్ప్‌ అధికా రులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు