శివార్లలో ఎన్నికల నగారా!

14 Jul, 2016 02:36 IST|Sakshi
శివార్లలో ఎన్నికల నగారా!

11 పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు సీఈసీ ఆదేశం
హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో చర్యలు తీసుకోవాలని సూచన
15వ తేదీలోపు నిర్ణయం ప్రకటించాలని ఆదేశం

 సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : శివారు పంచాయతీల్లో త్వరలో ఎన్నికల నగారా మోగనుంది. రాజధాని సమీపంలోని 11 పంచాయతీలను కొత్తగా ఐదు మున్సిపాలిటీలుగా ప్రకటిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో.. వీటి ఎన్నికల నిర్వహణకు చర్యలు  తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని ఆదేశించింది. నాలుగేళ్లుగా గ్రామాలకు పాలకవర్గాల్లేకపోవడంతో సమస్యలు పరిష్కారం కావడంలేదని, తక్షణమే పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ స్థానికులు కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రరుుంచారు.

ఈ పిటిషన్ ను విచారించిన ధర్మాసనం ఈ గ్రామాల ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. దీంతో సంకటంలో పడిన సర్కారు.. ఎన్నికలు నిర్వహించకపోతే కోర్టు ధిక్కారం పరిధిలోకి వస్తుందని ఆగమేఘాల మీద గత ఏప్రిల్‌లో ఈ పంచాయతీలను పురపాలకశాఖ పరిధిలో విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీల తీర్మానాలు, ప్రజల అభ్యంతరాలు స్వీకరించకుండా.. ప్రభుత్వం ఏకపక్షంగా 11 గ్రామాలను జల్‌పల్లి, బోడుప్పల్, మీర్‌పేట, ఫీర్జాదిగూడ, జిల్లెలగూడ పురపాలికల్లో కలుపుతూ ఉత్తర్వులివ్వడాన్ని తప్పుబడుతూ హైకోర్టుకెక్కారు. ఈ పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా ప్రకటించడంలో ప్రభుత్వం శాస్తీయ్రత పాటించలేదని జీఓను సస్పెండ్ చేసింది.

రేపటిలోగా నోటిఫికేషన్ !
శివార్లలోని 11 గ్రామ పంచాయతీలకు ఈ నెల 15వ తేదీలోగా నోటిఫికేషన్  జారీ చేయాలని హైకోర్టు స్పష్టం చేసినందున.. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్ కుమార్ పంచాయతీరాజ్‌శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ సింగ్‌కు లేఖ రాశారు. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈ పంచాయతీలకు ఎన్నికల నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో నాలుగేళ్లుగా సర్పంచుల్లేని సరూర్‌నగర్ మండలంలోని జల్‌పల్లి, కొత్తపేట్, పహాడీషరీఫ్, బాలాపూర్, మీర్‌పేట్, జిల్లెలగూడ, ఘట్‌కేసర్ మండలంలోని బోడుప్పల్, చెంగిచర్ల, ఫీర్జాదిగూడ, మేడిపల్లి, పర్వతాపూర్ పంచాయతీలకు ఎన్నికలు  నిర్వహించే సూచనలు కనిపిస్తున్నారుు. ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరపలేమని ప్రభుత్వం హైకోర్టును మరింత సమయం కోరితే మాత్రమే ఈ ప్రక్రియ కొన్నాళ్లు వారుుదా పడే అవకాశముంది. 

మరిన్ని వార్తలు