వాళ్లకో రకం.. వీళ్లకో రకమా

14 Jul, 2016 02:37 IST|Sakshi

 సాక్షి ప్రతినిధి, ఏలూరు :‘ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల విషయంలో పక్షపాతం ప్రదర్శిస్తోంది. ఒక్కో ప్రాజెక్టు పరిధిలో ఒక్కో రకంగా రైతులకు పరిహారం ప్యాకేజీ అమలు చేస్తోంది. ఇది ఎంతవరకూ సమంజసం. ప్రాజెక్టు ఏదైనా.. నష్టపోయేది నిర్వాసితులే. అందరికీ సమపరిహారం ఇవ్వాలి’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తాను అధికారం చేపట్టాక రైతులకు, నిర్వాసితులందరికీ న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. బుధవారం బుట్టాయగూడెం, జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, కుక్కునూరు మండలాల్లో ఆయన పర్యటించారు.
 
 ఈ సందర్భంగా చింతలపూడి ఎత్తిపోతల పథకం, పోలవరం ప్రాజెక్ట్ బాధితులు తమ సమస్యలను వైఎస్ జగన్‌మోహనరెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. జీలుగుమిల్లిలో జల్లేరు రిజర్వాయర్ ముంపు నిర్వాసితులకు అన్నివిధాలా అండగా ఉంటామని జననేత హామీ ఇచ్చారు. జల్లేరు ముంపు గ్రామాలైన తాటిరామన్నగూడెం, జిల్లెళ్లగూడెం, లంకాలపల్లి, బొత్తప్పగూడెం నిర్వాసిత గిరిజనులు వైఎస్ జగన్‌నుక లిసి ప్రభుత్వం తమకు ఎటువంటి పునరావాసం కల్పించడం లేదని, భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం కొత్త భూసేకరణ చట్టం ప్రకారం ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
 
  చింతలపూడి ఎత్తిపోతల వల్ల నష్టపోతున్న తమకు రూ.9 లక్షలు కూడా ఇవ్వలేదని వివరించారు. స్పందించిన జగన్‌మోహన్‌రెడ్డి అన్నివిధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం కుక్కునూరులో ముంపు మండలాల ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘పోలవరం ప్రాజెక్టు రావాలి. దీనివల్ల రాష్ట్రంలో రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకూ బాగుపడతాయి.
 
 అయితే ఈ ప్రాజెక్టు కోసం త్యాగం చేసిన నిర్వాసితులకూ కూడా న్యాయం జరగాలి. దీని కోసం పోరాడదాం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టులో  భూములు కోల్పోయిన వారందరి ముఖాల్లో  చిరునవ్వులు కనిపించేలా చేసే బాధ్యత నాది’ అని ఆయన స్పష్టం చేశారు. అనంతరం ఆయన  కుక్కునూరులో నిర్వాసితుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జేఏసీ చేస్తున్న నిరాహార దీక్షా శిబిరాన్ని సందర్శించారు. జేఏసీ నేతలతో మాట్లాడారు. వారి డిమాండ్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడితే జగన్‌మోహన్‌రెడ్డి ప్రాజెక్టులకు వ్యతిరేకం అంటూ ప్రచారం చేస్తున్నారని, తాను పోలవరం కోసం వంద కిలోమీటర్ల పాదయాత్ర చేశానని గుర్తు చేశారు.
 
  పక్కన పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన రైతులకు ఎక్కువ పరిహారం ఇస్తున్నారని, పక్కనే ఉన్న పోలవరం ముంపు బాధితుల గురించి పట్టించుకోకపోవడం ఎంతవరకూ సబబని ప్రశ్నించారు. ‘జిల్లాలో చింతలపూడి, పట్టిసీమ నుంచి పోలవరం వరకూ అన్నీ పక్కపక్కనే ఉన్నాయి. పట్టిసీమలో ఇస్తున్న ప్యాకేజీని అందరికీ వర్తింపచేయండి’ అని కోరారు. ‘తొమ్మిదేళ్ల క్రితం రూ.లక్షా 15 వేలు ఇచ్చి భూములు తీసుకున్నారు. ఇదే రూ.లక్షా 15 వేలు రూ. 20 లక్షలకు మారాయి. ఎక్కడైనా ఒక ఎకరా భూమి కొనాలంటే రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది.
 
  ముందువరసలో నిలబడి భూములు ఇచ్చిన వారికి అన్యాయం చేయడం సరి కాదు. 2013 భూసేకరణ చట్టంలో 20 నుంచి 30 సెక్షన్ల వరకూ చూస్తే ఐదేళ్లపాటు ఎటువంటి వినియోగం చేయకపోతే ఆ భూమిని వెనక్కి ఇవ్వాలని ఉంది. పట్టిసీమ మాదిరి రూ.20 లక్షలు ఇవ్వాలని అడగడం లేదు. కనీసం రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కోరుతున్నారు. వీరి డిమాండ్లు సమంజసంగా ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి న్యాయం చేయాలి. వారికి న్యాయం జరిగేవరకూ వైఎస్సార్ సీపీ అండగా ఉంటుంది’ అని స్పష్టం చేశారు.
 

మరిన్ని వార్తలు