పదోతరగతి విద్యార్థినిపై టీచర్ అత్యాచారం

26 Nov, 2015 14:37 IST|Sakshi
పదోతరగతి విద్యార్థినిపై టీచర్ అత్యాచారం

ప్రేమ పేరుతో వలవేసి.. పదో తరగతి చదివే విద్యార్థినిని లోబర్చుకుని ఆమెపై అత్యాచారం చేశాడో కీచక ఉపాధ్యాయుడు. ఈ దారుణం నల్లగొండ జిల్లా సూర్యాపేటలో జరిగింది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నేలపల్లి గ్రామంలోని జడ్పీ హైస్కూల్లో ఇంగ్లిషు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నెల్లూరు నాగేశ్వర రావు అదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని(15)తో ప్రేమయాణం సాగిస్తున్నాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు ఆమెను పలుమార్లు హెచ్చరించినా ఆమె మారలేదు. రెండు రోజుల క్రితం పాఠశాలకు వెళ్లిన ఆమె.. తిరిగి ఇంటికి రాలేదు. దాంతో కంగారు పడిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

ఈలోపు నల్లగొండ జిల్లా సూర్యాపేటలోని ఒక లాడ్జిపై పోలీసులు దాడి చేయగా, ఉపాధ్యాయుడు నాగేశ్వరరావు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. అయితే, అతడితో పాటు మైనర్ అమ్మాయి ఉండటంతో పోలీసులు విచారించగా అసలు విషయం తెలిసింది. వీళ్లిద్దరూ గతంలో కూడా ఇదే లాడ్జికి వచ్చారని పోలీసుల విచారణలో తేలింది. ఆమెకు మాయమాటలు చెప్పి, ప్రేమ పేరుతో లోబర్చుకున్న నాగేశ్వరరావు.. ఈ దారుణానికి పాల్పడినట్లు తేలింది. పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకొని బాలికను వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. మాయమాటలు చెప్పి తన కూతురును లొంగదీసుకున్నాడంటూ విద్యార్థిని తల్లి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సూర్యాపేట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. నెల్లూరు నాగేశ్వరరావుకు గతంలోనే పెళ్లయింది, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

మరిన్ని వార్తలు