నెలకు ఒక్క రోజు సేవలందించండి

29 Jul, 2016 01:24 IST|Sakshi
  • ప్రయివేటు వైద్యులకు కలెక్టర్‌ వినతి
కోటగుమ్మం (రాజమహేంద్రవరం) :
పేద గర్భిణిలకు నెలకు ఒక్కసారి వైద్య సేవలందించాలని ప్రయివేటు గైనకాలజిస్టులకు జిల్లా కలెక్టర్‌ హెచ్‌ అరుణ్‌కుమార్‌ విజ్ఞప్తి చేశారు. ప్రధాన మంత్రి మాతృత్వ అభియాన్‌ పథకం అమలులో భాగంగా స్థానిక సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ప్రయివేటు గైనకాలజిస్టులు, రేడియాలజిస్టులతో కలెక్టర్‌ గురువారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. తల్లి – పిల్లల మరణాలు సంభవించకూడదని ప్రధాన మంత్రి మాతృత్వ అభియాన్‌ పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయన్నారు. దేశంలోని ఏ ఒక్క గర్భిణీ కూడా ఎలాంటి ముందస్తు పరీక్షలు లేకుండా ప్రసవానికి వెళ్లకూడదనేది ఈ పథకం ఉద్దేశమన్నారు. జిల్లాలో 38 ప్రభుత్వ వైద్యశాలల్లో స్కానింగ్‌ యంత్రాలున్నాయని, చాలాచోట్ల గైనకాలజిస్టుల సహకారం కోరుతున్నామన్నారు. ప్రతి నెలా 9వ తేదీన జిల్లాలోని ప్రభుత్వ వైద్య శాలలోగర్భిణీలకు వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టు వివరించారు. ఆ రోజులో వీలు కల్పించుకుని ఎంపిక చేసుకున్న ప్రభుత్వ వైద్యశాలకు వెళ్ళి వైద్య సేవలందించాలని కోరారు. పేద గర్భిణిలకు సేవలందించేందుకు రాజమహేంద్రవరం పరిసరాల్లోని గైనకాలజిస్టులు, రేడియాలజిస్టులు ముందుకురావాలని పిలుపునిచ్చారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ చంద్రయ్య మాట్లాడుతూ గత నెలలో జిల్లా ప్రభుత్వాసుపత్రిలో 4 వేలకు పైగా స్కానింగ్‌లు నిర్వహించినట్టు తెలిపారు. డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ రమేష్‌కిషోర్, అప్మా అద్యక్షుడు డాక్టర్‌ శాంతారామ్, ఐఎంఎ అధ్యక్షుడు డాక్టర్‌ శ్రీరామ్, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్‌ పవన్‌కుమార్, గైనకాలజిస్టులు ప్రమీళ, ఎస్‌ పద్మ, కె దుర్గ, అన్నపూర్ణ, సుస్మిత, సునీత తదితరులు సమావేశానికి హాజరయ్యారు.

 

మరిన్ని వార్తలు