ఆగని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు

12 Dec, 2016 14:55 IST|Sakshi
ఆగని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు

ప్యాసెంజర్‌ రైల్లు ప్రయాణికులతో ఫుల్‌
– అవస్థలు పడుతున్న ప్రయాణికులు
– రైల్వేస్టేషన్‌ను ఉన్నా ఫలితం లేదంటున్న జనం


ముదిగుబ్బ : ముదిగుబ్బ మండల కేంద్రంలో రైల్వేస్టేషన్‌ ఉంది.. కానీ రైలు ఎక్కలేని పరిస్థితి. నియోజకవర్గంలో ముదిగుబ్బ అతిపెద్ద మండలం. దాదాపుగా 60వేల జనాభా ఉంది. ముదిగుబ్బ రైల్వేస్టేషన్‌ నుంచి ప్రయాణించడానికి నియోజకవర్గంలోని బత్తలపల్లి, తాడిమర్రి మండలాల నుండే కాక పొరుగు జిల్లా అయిన వైఎస్సార్‌ జిల్లాలోని పలు మండలాలు, జిల్లాలోని బుక్కపట్నం మండలంలోని శివారు ప్రాంత గ్రామాల నుంచి ప్రయాణించడానికి వస్తుంటారు. అయితే ముదిగుబ్బ రైల్వేస్టేషన్‌ మీదుగా రోజుకు రెండు ప్యాసింజర్‌ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. వందలాది మంది ప్రయాణికులు ముదిగుబ్బ రైల్వేస్టేషన్‌లో వేచి ఉంటున్నారు. తీరా రైలు రావడమే ప్రయాణికులతో రద్దీగా వస్తుండటంతో నిలబడటానికి చోటు లేకుండాపోతోంది.

    గుంతకల్‌ ప్యాసెంజర్‌ రైలుకు కేవలం 9 బోగీలు మాత్రమే ఉండగా వాటిలో రెండు బోగీలు రిజర్వేషన్‌ సౌకర్యం ఉంటాయి. అవి గుంతకల్‌ అనంతపురం, ధర్మవరం స్టేషన్‌లకు రాగానే ప్రయాణికులతో బోగీలన్నీ నిండిపోతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎంత వరకు ప్రయాణిస్తే అంత వరకు   ప్రయాణికులు నిలబడే ప్రయాణించాల్సి వస్తోంది.  మరికొంత మంది రైలు డోర్‌ వద్ద వేలాడుతూ వెళ్లాల్సిన పరిస్థితి. ప్యాసింజర్‌ రైళ్ల పరిస్థితి ఇలా ఉంటే  వారానికి 4ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు  ముదిగుబ్బ మీదుగా వెళ్తుంటాయి. అయితే రైల్వేస్టేషన్‌లో స్టాపింగ్‌ పాయింట్‌ లేక పోవడంతో ప్రయాణికులకు ఏమాత్రం ఉపయోగం లేకుండా ఉంది. కనీసం ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు పద్మావతి, సెవెన్‌హిల్స్, అమరావతి రైళ్లనైనా  ముదిగుబ్బలో నిలబడేలా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు.   

సర్కస్‌ ఫీట్లు తప్పడం లేదు
    గుంతకల్‌ ప్యాసింజర్‌ రైలు ముదిగుబ్బ చేరుకునే సరికి బోగీలన్నీ పూర్తిగా నిండిపోతున్నాయి.  5 బోగీలు మాత్రమే సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండటంతో రైలులో వెళ్లాలంటే సర్కస్‌ఫీట్లు చేయక తప్పలేదు.
– వెంకటనాయుడు, ముదిగుబ్బ

బోగీల సంఖ్యను పెంచాలి
    గుంతకల్‌ ప్యాసెంజర్‌ రైలులో బోగీల సంఖ్య తక్కువగా ఉండటంతో ముదిగుబ్బ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు పిల్లలతో వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. అధికారులు స్పందించి బోగీల సంఖ్యను పెంచి ప్యాసింజర్‌ రైళ్లను ఆపేలా చర్యలు తీసుకోవాలి.
– శివానంద, పొడ్రాళ్లపల్లి

మరిన్ని వార్తలు