దోచుకోడానికే ఈ పాస్‌బుక్ విధానం

3 Jul, 2016 20:07 IST|Sakshi

 రైతు ఇంటి యాజమాన్య హక్కుగా పిలిచే పట్టాదారు, టైటిల్ డీడ్ పుస్తకాలను రద్దుచేసి ఎలక్ట్రానిక్ పాస్‌బుక్ విధానం ప్రవేశపెట్టడంలో ప్రభుత్వ కుట్ర దాగిఉందని రైతు సంఘాల నాయకులు మండిపడ్డారు. రైతాంగ సమాఖ్య అధ్యక్షుడు యెర్నేని నాగేంద్రనాథ్ స్వగ్రామం కృష్ణాజిల్లా కలిదిండి మండలం కొండూరు పంచాయతీ కార్యాలయం వద్ద రైతు సంఘాల నిజనిర్ధారణ కమిటీ ఆదివారం రైతులతో ముఖాముఖి చర్చను ఏర్పాటు చేసింది. గ్రామంలో మొత్తం 536 రైతుల పట్టాదారు పుస్తకాలను పరిశీలించగా ఈ-పాస్ బుక్ 1బీలో 125 మంది రైతుల పేర్లు, భూమి విస్తీర్ణం తప్పులు ఉన్నట్లు గుర్తించారు.


రైతులు తమకు వెబ్‌ల్యాండ్, ఆన్‌లైన్ అంటే ఏమిటో కూడా తెలియదని కమిటీ ముందు చెప్పారు. తమ భూములకు శిస్తులు కడుతున్నప్పటికీ ఎవరి పేర్లో ఆన్‌లైన్‌లో నమోదైన ట్లు పుస్తకాలు చూపించారు. వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి మాట్లాడుతూ ఈ-పాస్‌బుక్ విధానం ఎంత గందరగోళంగా ఉందనేదానికి తానే ఓ ఉదాహరణ అన్నారు. తన పేరుతో ఉన్న బుక్‌లో తండ్రి పేరు మరొకరిది ఉందన్నారు. ఈ-పాస్ విధానాన్ని వినియోగించే స్థాయికి రైతు కుటుంబాలు రాలేదన్నారు. నాగేంద్రనాథ్ మాట్లాడుతూ 42 ఏళ్ల కిందట మరణించినవారి పేర్లు 1బీలో చేర్చారని, రిజిస్ట్రేషన్‌కు వారిని తీసుకురాలేము కదా అని ప్రశ్నించారు. ఏపీ రైతు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పి.రామచంద్రయ్య మాట్లాడుతూ కోట్లు దండుకునే దుర్బుద్ధి ఈ విధానంలో ఉందన్నారు.


మంత్రి కృష్ణమూర్తి రాజీనామా చేయాలి..
రైతులు నకిలీ పాసుపుస్తకాలను అరికట్టడమంటే వాటిని నియంత్రించలేక ఈ-పాస్ తీసుకొచ్చిన మంత్రి కృష్ణమూర్తి రాజీనామా చేయాలని డెల్టా పరిరక్షణ సమితి నాయకుడు కొలనుకొండ శివాజీ డిమాండ్ చేశారు. భూ వివాదాలపై కోనేరు రంగారావు, జయదేవ్‌ఘోష్ కమిటీల మాదిరిగా ఎందుకు కమిటీని వేయలేదన్నారు. భారతీయ కిసాన్‌మోర్చా జాతీయ కార్యదర్శి జె.కుమారస్వామి మాట్లాడుతూ జీవో నంబరు 255ను వెంటనే రద్దుచేయాలన్నారు. లేదంటే కిసాన్ మోర్చా అధ్వర్యంలో జీవో ప్రతులను తగలబెడతామన్నారు.


11న జిల్లా కేంద్రాల్లో నిరసన...
పాసుపుస్తకాల రద్దు ఆదేశాలు నిలిపివేయాలనే డిమాండ్‌తో ఈ నెల 11న రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన చేపడుతున్నట్లు రైతుసంఘ నాయకులు చెప్పారు. పార్టీలకు అతీతంగా రైతులు హాజరుకావాలని కోరారు. కొండూరులో జరిగిన చ ర్చలో వివిధ జిల్లాల రైతు సంఘ నాయకులు రాజమోహన్‌రావు, రామచంద్రరాజు, నాగబాబు, కృష్ణమూర్తి, పాండురంగరాజు, తమ్మినేని నాగేశ్వరరావు, మధుసూదనరావు, వేణు, యలమందారావులు పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు