నీటి తరలింపుపై ఆందోళన

4 Sep, 2016 22:01 IST|Sakshi
రైతులతో మాట్లాడుతున్న డిప్యూటీ కలెక్టర్‌ తిప్పేనాయక్‌
– అడ్డుకునే ప్రయత్నం చేసిన వెంగళాయిదొడ్డి రైతులు  
– సర్ధి చెప్పిన డిప్యూటీ కలెక్టర్‌ తిప్పేనాయక్‌  
 
ఆస్పరి: వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎండిపోయిన పంటలకు రెయిన్‌గన్‌ల ద్వారా తడులందించేందుకు అవసరమైన నీటిని మండల పరిధిలోని వెంగలాయిదొడ్డి చెరువు నుంచి ట్యాంకర్లతో తరలిస్తుండడంపై ఆయకట్టు రైతులు ఆందోళనకు దిగారు. ఉన్న నీటినంతా ఊడ్చుకెళ్తే తమ పరిస్థితి ఏంటని ఆదివారం అడ్డుకునే ప్రయత్నం చేశారు. వెంగళాయిదొడ్డి చెరువు కింద కైరుప్పల, చెన్నంపల్లి, కారుమంచి, వెంగళాయిదొద్ది గ్రామాలకు చెందిన రైతులకు సుమారు 12వందల ఎకరాల భూములున్నాయి. చెరువు నీటి ఆధారంగా ఆయా భూముల్లో వరి, పత్తి, వేరుశెనగ సాగు చేశారు. అయితే వారంరోజులగా ఆ ప్రాంతానికి చెందిన 40 మంది మెట్ట ప్రాంత రైతులు రాత్రింబవళ్లు తేడా లేకుండా ట్యాంకర్లతో నీటిని తీసుకెళ్లి రెయిన్‌గన్‌ల ద్వారా పంటలు తడుపుకొంటున్నారు. ఈ కారణంగా చెరువునీరు రోజురోజుకు తగ్గుముఖం పడుతుండడంతో ఆయకట్టు రైతులు ఆదివారం అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ కలెక్టర్‌ తిప్పేనాయక్‌ చెరువు దగ్గరకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఈరన్న, రంగన్న, వీరభద్రి, రామాంజిని, వడ్డే వీరభద్రి, తిక్కయ్య, వీరేష్, హనుమంతు, బసప్ప, పరమేష్, మరికొందరు రైతులు డిప్యూటీ కలెక్టర్‌తో వాగ్వాదానికి దిగారు. చెరువు కింద సాగు చేసిన వరికి ఇంకా మూడు నెలలపాటు నీరు అవసరమని, ఉన్న నీటినంతా తోడుకెళ్తే తమ పంటలు ఏం కావాలని ప్రశ్నించారు. నీటి తరలింపు ఆపకపోతే ఆదోని ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగుతామని చెరువు ఆయకట్టు చైర్మన్‌ మల్లికార్జునరెడ్డి హెచ్చరించారు. అయితే మెట్ట ప్రాంత పంటల పరిస్థితి బాగా లేదని, వర్షం వస్తే మళ్లీ చెరువు నిండుతుందంటూ తిప్పేనాయక్‌ సర్ధిచెప్పి అంగీకరింపజేశారు.  
 
మరిన్ని వార్తలు