ఖేడ్ ను దౌడ్ తీయిస్తా

19 Feb, 2016 04:52 IST|Sakshi
ఖేడ్ ను దౌడ్ తీయిస్తా

అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తా
పాఠశాలలు ఏర్పాటు చేయిస్తా
మంత్రి హరీశ్‌రావు వెల్లడి
సిద్దిపేటలో ‘ఖేడ్’ విద్యార్థుల
విద్యాభ్యాసంపై విస్మయం
గత పాలకుల వైఫల్యమే కారణమని వ్యాఖ్య

సిద్దిపేట జోన్: ‘బాబు దినేష్.. పదో తరగతి చదువు కోసం నారాయణఖేడ్ నుంచి సిద్దిపేటకు రావడం బాధాకరంగా ఉంది. ఇటీవల ఖేడ్ ఉప ఎన్నికల్లో కొన్ని రోజులు అక్కడే ఉన్నా. అక్కడి పరిస్థితి చూస్తే బాధ వేసింది. విద్య, తాగు, సాగు నీరు, మౌలిక వసతులు లేక ఖేడ్ ప్రజలు పడుతున్న బాధలు నన్ను కలచి వేశాయి. నారాయణఖేడ్‌ను అభివృద్ధి వైపు పరుగులు పెట్టించి దశ మారుస్తా’నంటూ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు.   గురువారం స్థానిక హైస్కూల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి ఆకస్మికంగా పదో తరగతిని పరిశీలించారు. తరగతి గదిలో అత్యధికంగా తండాకు చెందిన పిల్లలను గుర్తించిన మంత్రి.. నారాయణఖేడ్‌కు చెందిన వారు ఎందరున్నారని ప్రశ్నించారు.

14 మంది విద్యార్థులు లేచి తమతమ ఊర్ల పేర్లను వినిపించారు. ఒక్కసారిగా 14 మంది ఒకే తరగతి గదిలో ఖేడ్ పిల్లలు విద్యాభ్యాసం చేస్తున్న విషయం తెలుసుకుని మంత్రి విస్మయం చెందారు. వెంటనే ఆయన ఆ విద్యార్థులతో యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడుతూ విద్యా బోధన, వసతి గృహాల్లో సౌకర్యాల గూర్చి ఆరా తీశారు. అక్కడే ఉన్న అధికారులు, నాయకులు, ఉపాధ్యాయులచే ఖేడ్ పరిస్థితిపై చర్చించారు. నారాయణ్‌ఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండలంలో కేవలం మూడు పాఠశాలలే ఉండటం ఆ ప్రాంత దారుణ స్థితిని తెలుపుతున్నాయన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే ఖేడ్‌లో విద్యారంగం అభివృద్ధి చెందలేదన్నారు. ఖేడ్ లాంటి ప్రాంతం లో ఆశించిన స్థాయిలో పాఠశాలలు లేక అక్కడి తండా విద్యార్థులు వందలాది మంది సిద్దిపేట, మెదక్ లాంటి వసతి గృహాల్లో విద్యాభ్యాసానికి వస్తున్నారన్నారు. అన్ని రంగాల్లో వెనుకబడిన ఖేడ్‌ను సిద్దిపేట తరహాలో అభివృద్ధి చేస్తానన్నారు. ఖేడ్‌లో పాఠశాలల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తానన్నారు.  కార్యక్రమంలో ఆర్డీఓ ముత్యంరెడ్డి, నాయకులు రాజనర్సు  తదితరులు పాల్గొన్నారు.

 విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దు
విద్యార్థులను ఇబ్బంది పెట్టడం మంచిది కాదని మంత్రి హరీష్‌రావు విద్యాశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఉన్నత పాఠశాలలో అరబిందో సహకారంతో నిర్మిం చిన మరుగుదొడ్ల బ్లాక్, అదనపు తరగతి గదులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రారంభోత్సవ కార్యక్రమానికి విద్యార్థులను తరగతి గదుల నుంచి బయటకు వదిలిన విషయాన్ని గ్రహించి మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు