ఈ ‘తూర్పు’నకు ఏమైంది?

29 Aug, 2016 21:23 IST|Sakshi
ఈ ‘తూర్పు’నకు ఏమైంది?
  • పట్టిపీడిస్తున్న డెంగీ, మలేరియా 
  • విజృంభిస్తున్న ప్రాణాంతక వ్యాధులు
  • మృత్యువాత పడుతున్న రోగులు 
  • ప్రత్యేక దృష్టి సారించని జిల్లా యంత్రాంగం
  •  
    ఒకవైపు డెంగీ.. మరోవైపు మలేరియా.. ఇంకోవైపు విషజ్వరాలు.. ఇలా జిల్లాను ప్రాణాంతక వ్యాధులు కుదిపేస్తున్నాయి. ఏజెన్సీ, మారుమూల గ్రామాలతో పాటు పట్టణ ప్రాంతాలనూ ఈ వ్యాధులు పట్టిపీడిస్తున్నాయి. అనేక గ్రామాల్లో పరిస్థితులు చేజారుతున్నప్పటికీ.. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తూతూమంత్రంగా చర్యలు తీసుకుంటున్నారు. జ్వరాలు ప్రబలిన గ్రామాల్లో బ్లీచింగ్‌ చల్లించి చేతులు దులుపుకొంటున్నారు. వందలాది మంది రోజుల తరబడి జ్వరాలతో బాధపడుతున్నా.. అనేక మంది అంతుచిక్కని రోగాలకు బలవుతున్నా.. జిల్లా యంత్రాంగం సరైన స్థాయిలో స్పందించడం లేదన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అసాధారణ వాతావరణ పరిస్థితులతో నానాటికీ ప్రాణాంతక వ్యాధులు విస్తరిస్తున్న నేపథ్యంలో జిల్లాలో ‘హెల్త్‌ ఎమర్జెన్సీ’ ప్రకటించాల్సిన ఆవశ్యకతపై ప్రభుత్వం దృష్టి సారించాలన్న వాదనలూ వినిపిస్తున్నాయి. 
     
    ఎం.కొత్తూరు (రౌతులపూడి) :
    వారం రోజులుగా ఎం.కొత్తూరు ప్రజలు వ్యాధులతో మంచానపడ్డారు. సుమారు 30 మంది మలేరియా, టైఫాయిడ్, విషజ్వరాల వంటి ప్రాణాంతక వ్యాధులకు గురై, ఆస్పత్రుల బాటపట్టారు. ఆరోగ్య సిబ్బంది ఇస్తున్న కొద్దిపాటి మందుబిళ్లలతో వ్యాధులు తగ్గుముఖం పట్టడంలేదని గ్రామస్తులు ఆరోపించారు. గ్రామంలో గత ఆరు మాసాలుగా ఎలాంటి పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టకపోవడంతో క్రిమి కీటకాలు వ్యాపించి, ప్రజలు అస్వస్థతకు గురైనట్టు చెబుతున్నారు. వారం రోజులుగా గ్రామానికి చెందిన గిరిజనులు యరగడ చక్రమ్మ, యరగడ దేవి, వంతు దాలియ్యదొర, వంతు చినబుల్లి, గంటిమళ్ల దేవుడమ్మ, వంతు మాతయ్యదొర, గంటిమళ్ల గంగరాజు, యరగడ రాంబాబు తదితరులు జ్వరాలతో బాధపడుతున్నారు. కూలీ పనులు చేసుకునే తాము జ్వరాలతో ఆస్పత్రులకు తిరుగుతూ, పూటగడవక నానా అవస్థలు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
    మలేరియా లక్షణాలతో యువతి మృతి
    ఇదే గ్రామానికి చెందిన ఎం.ప్రియ(21) అనే యువతి మలేరియా లక్షణాలతో ఆదివారం రాత్రి మరణించింది. రాఖీ పండగ మరుసుటి రోజు తలనొప్పి, జ్వరం, వాంతులు, కడుపునొప్పితో బాధపడుతున్న ఆమెను రౌతులపూడిలో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం తుని, అక్కడి నుంచి విశాఖపట్నంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మరణించిందని ఆమె తండ్రి ఎం.రాజు విలపించాడు. 
     
    వివాహితను బలిగొన్న డెంగీ
    మలికిపురం : మలికిపురానికి చెందిన పూసి అనిల్‌కుమారి(35) అనే వివాహిత డెంగీ జ్వరంతో బాధపడుతూ ఆదివారం రాత్రి మరణించింది. రెండు రోజులుగా జ్వరంతో ఉన్న ఆమెను బంధువులు స్థానికంగా ఉన్న ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఆమెకు డెంగీ జ్వరమని వైద్యులు తేల్చినట్టు బంధువులు సోమవారం తెలిపారు. కాగా రామరాజులంక, దిండి గ్రామాల్లో కూడా అనేక మంది డెంగీ లక్షణాలతో ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నట్టు తెలిసింది. సఖినేటిపల్లి మండలం గొంది గ్రామానికి చెందిన కొప్పాడి సిరి(7) వారం రోజుల క్రితం ప్లేట్‌లెట్లు గణనీయంగా తగ్గి మరణించిన సంగతి విదితమే.
     
    బాలికను కాటేసిన డెంగీ?
    ర్యాలి(ఆత్రేయపురం) : డెంగీ లక్షణాలతో బాధపడుతూ విద్యార్థిని మరణించిన ఉదంతమిది. వివరాల్లోకి వెళితే.. ర్యాలి గ్రామానికి చెందిన కత్తుల సుందరరావు మనవరాలు కుసుమే కీర్తి (15) పదో తరగతి చదువుతోంది. తల్లిదండ్రులకు దూరంగా ఆమె కొన్నేళ్లుగా ర్యాలి గ్రామంలో తాతయ్య వద్ద ఉంటూ చదువుకుంటోంది. మూడు నెలల క్రితం ఆమెకు జ్వరం సోకడంతో, పలుచోట్ల చికిత్స చేయించారు. జ్వరం తీవ్రం కావడంతో పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో వైద్యం అందించారు. అప్పటీకీ జ్వరం తగ్గకపోవడంతో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమె రక్తంలో ప్లేట్‌లెట్లు పూర్తి స్థాయిలో తగ్గిపోవడంతో సోమవారం చనిపోయింది. తమ పాపకు డెంగీ సోకడంతోనే మరణించిందని ఆమె బంధువులు చెబుతున్నారు. మూడు నెలల నుంచి విపరీతమైన జ్వరం, ఇతరత్రా శారీరక వ్యాధులు తలెత్తడంతో తమకు దక్కకుండా పోయిందని  కన్నీటిపర్యంతమయ్యారు.
     
    డెంగీ అని చెప్పలేం..
    ఇటీవల కాలంలో వాతావారణంలో మార్పుల కారణంగా అనేక మంది జ్వరాలు బారిన పడుతున్నారు. నిత్యం జ్వర పీడితులు వైద్యశాలకు వస్తున్నారు. ఎవరికీ డెంగీ లక్షణాలు కనిపించలేదు. కొన్ని విషజ్వరాల వల్ల ప్లేట్‌లెట్లు తగ్గిపోతాయి. 
    అంతమాత్రాన డెంగీగా నిర్ధారించలేం. మా వైద్యశాలకు డెంగీ కేసులు రాలేదు.
    – ఝాన్సీలక్ష్మి,  వైద్యాధికారి, ర్యాలి
     
మరిన్ని వార్తలు