జగడం

14 Mar, 2017 23:12 IST|Sakshi
జగడం

మేయర్‌ x డీసీఆర్‌

- లెక్కలేనితనంపై మేయర్‌ గుర్రు
- పాలనాపరమైన విషయాలు చెప్పనవసరం లేదంటున్న డీసీఆర్‌


బకాయిలు చెల్లించేందుకు నెలాఖరు వరకు గడువు ఉంది. వెబ్‌సైట్‌లో మొండి బకాయిదారుల జాబితా పెట్టేప్పుడు కనీసం నాకు మాట మాత్రమైనా చెప్పలేదు. ఇది మంచిపద్ధతి కాదు. ఆంధ్ర రత్నభవన్‌ (కాంగ్రెస్‌ పార్టీ కార్యాల యం) ఏళ్ల తరబడి పన్ను చెల్లించడం లేదు. జాబితాలో పేరు ఎందుకు చేర్చలేదు. ఏమైనా అంటే సారీ అంటున్నారు. డీసీఆర్‌ వ్యవహారశైలి ఏమాత్రం బాగోలేదు. కమిషనర్‌తోనే తేల్చుకుంటా.  
  – కోనేరు శ్రీధర్,మేయర్, విజయవాడ.

డిఫాల్టర్స్‌ లిస్ట్‌లో పొరపాట్లు జరిగిన మాట వాస్తవమే. అందుకే సరిచేస్తున్నాం. సర్కిళ్ల వారీగా వచ్చిన నివేదికల ఆధారంగానే జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచాం. అప్‌డేట్‌ చేయకపోవడం పొరపాటే. అయినంత మాత్రాన ఎవరిపై చర్యలు తీసుకోలేం. పరిపాలనాపరమైన అంశాలకు సంబంధించి మేయర్‌తో చర్చించాల్సినఅవసరం లేదు. అందుకే ఆయనకు చెప్పలేదు.
– సుబ్బారావు,డెప్యూటీ కమిషనర్‌ (రెవెన్యూ)                                                                    

విజయవాడ సెంట్రల్‌ : నగర పాలక సంస్థలో హద్దుమీరిన రెవెన్యూ అధికారుల అత్యుత్సాహం వివాదాస్పదమైంది. నెలాఖరు వరకు గడువు ఉన్నప్పటికీ డిఫాల్టర్స్‌ లిస్ట్‌ను వెబ్‌సైట్‌లో పెట్టడం, అందులో టీడీపీ ప్రజాప్రతినిధుల పేర్లు ప్రముఖంగా ఉండటంతో కథ అడ్డం తిరిగింది. మంత్రి దేవినేని ఉమా డీసీఆర్‌ సుబ్బారావుకు ఓ రేంజ్‌లో వార్నింగ్‌ ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు అడ్డగోలుగా అధికారులు పనిచేస్తుంటే ఏం చేస్తున్నావంటూ మేయర్‌కూ క్లాస్‌ తీసుకున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే  మేయర్, డెప్యూటీ కమిషనర్‌ (రెవెన్యూ)ను టార్గెట్‌ చేశారని భోగట్టా. మొండి బకాయిదారుల జాబితాను బహిర్గతం చేసేటప్పుడు కనీసం తన దృష్టికి తేకపోవడాన్ని తప్పుపడుతున్నారు. మేయర్‌ అంటే లెక్కలేదా అంటూ మండిపడుతున్నారు.  రెవెన్యూ అధికారుల వ్యవహార శైలి తరుచూ వివాదాస్పదం కావడంపై  ఆయన  తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. డీసీఆర్‌ వ్యవహార శైలిపై కమిషనర్‌తో చర్చించాలన్న నిర్ణయానికి వచ్చారు.

తప్పుల తడక ...: డిఫాల్టర్స్‌ లిస్ట్‌ను తప్పుల తడకగా రూపొందించిన రెవెన్యూ అధికారులు అడ్డంగా బుక్కయ్యారు. మూడు సర్కిళ్ల అసిస్టెంట్‌ కమిషనర్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు రూపొందించిన జాబితాను పరిశీలించి డీసీఆర్‌కు అందజేస్తారు. కమిషనర్‌ అనుమతితో వెబ్‌సైట్‌లో ఉంచాలి. ఈ ప్రక్రియలో కిందిస్థాయి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి జాబితాను అప్‌డేట్‌ చేయలేదని తెలుస్తోంది. గతంలో ఆరు నెలలకోసారి ఆస్తిపన్నును చెల్లించాలంటూ డిమాండ్‌ నోటీసులు జారీ చేసేవారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏడాదికి ఒకసారే డిమాండ్‌ నోటీసు ఇచ్చేశారు. దీన్ని సైతం పరిగణనలోకి తీసుకోకుండా డిఫాల్టర్స్‌ లిస్ట్‌లో కొన్ని పేర్లను చేర్చడం వివాదాస్పదమైంది. డిఫాల్టర్స్‌ లిస్ట్‌ వెబ్‌సైట్‌లో పెట్టి మొండి బకాయిదారుల్ని అల్లరి చేయాలన్న ఎత్తుగడ బెడిసికొట్టింది. కమిషనర్‌ ఆదేశాలతోనే జాబితాను వెబ్‌సైట్‌లో పెట్టాం కాబట్టి తమకేం ఇబ్బంది ఉండదనే ధోరణిని రెవెన్యూ అధికారులు ప్రదర్శిస్తున్నారు. మొత్తం మీద మొండిబకాయిలు మేయర్, డీసీఆర్‌ మధ్య జగడం సృష్టించాయి.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా