‘దేశం’లో దెబ్బలాట

29 Aug, 2016 23:42 IST|Sakshi
వాగ్వాదం చేసుకుంటున్న టీడీపీ నాయకులు

హిరమండలం: హిరమండలంలో తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. సోమవారం మండల పరిషత్‌ కార్యాలయం వేదికగా నేతలు వాగ్వాదానికి దిగారు. మండలంలో డిప్యుటేషన్‌పై విధులు నిర్వహిస్తున్న మండల ఇంజినీర్‌ బి.కూర్మనాథరావుపై విచారణ నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. పంచాయతీ రాజ్‌ ఏఈ సీసీ రహదారులు అంచనా వేసే సమయంలోనూ, బిల్లుల చెల్లింపుల్లో అవినీతికి పాల్పడుతున్నాడని కొంతమంది టీడీపీ నాయకులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై సోమవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో పాతపట్నం సబ్‌ డివిజన్‌ డీఈ జి.ప్రదీప్‌కుమార్‌ విచారణ చేపట్టారు. ఫిర్యాదుదారుల నుంచి వివరాలు సేకరించారు. ఈ సమయంలో టీడీపీలోని రెండు వర్గాల నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. వైస్‌ ఎంపీపీ నక్క వెంకటరావు, అక్కరాపల్లి సర్పంచ్‌ గోళ్ల సింహాచలంతో పాటు మరికొంతమంది ప్రజా ప్రతినిధులు మరో వర్గానికి చెందిన రుగడ సర్పంచ్‌ లోలుగు లక్ష్మణరావు, అంబావల్లి నీటిసంఘం అధ్యక్షుడు సీహెచ్‌ శ్రీరామూర్తితోపాటు మరికొందరితో వాగ్వాదానికి దిగారు. కొందరు ఏఈని బదిలీ చేయాలని కోరగా, మరికొందరు ఇక్కడే ఉంచాలని పట్టుబట్టారు. ఈ సందర్భంగా డీఈ మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏఈపై వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టామని, నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ గార రమణమ్మ, సూపరింటెండెంట్‌ కాశీ విశ్వనాధం తదితరులు ఉన్నారు.
 

>
మరిన్ని వార్తలు