ఆర్థిక సంక్షోభంలో మున్సిపాలిటీ

1 Sep, 2016 19:08 IST|Sakshi
సెల్‌ఫోన్‌ వెలుగులో పనిచేస్తున్న మున్సిపల్‌ సిబ్బంది
  • సంగారెడ్డి మున్సిపాలిటీలో అన్నీ సమస్యలే!
  • కార్మికులకు వేతనాలు చెల్లించలేని దుస్థితి
  • సంగారెడ్డి మున్సిపాలిటీ: పురపాలక సంఘం రోజు రోజుకు ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఒక వైపు కార్మికులకు వేతనాలు చెలించలేని పరిస్థితి. మరోవైపు కనీసం విద్యుత్‌ బకాయిలు సైతం అధికారులు చెల్లించలేక సతమతమవుతున్నారు. మున్సిపల్‌ ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా ఎక్కడా కూడా పురోగతి కనిపించడం లేదు.

    ఇందుకు గత పక్షం రోజుల్లోనే మూడుమార్లు ట్రాన్స్‌కో అ«ధికారులు బిల్లులు చెల్లించడం లేదని విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. అలాగే ప్రతి రోజు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ఉపయోగించే ట్రాక్టర్‌లు, అటోలు మరుమ్మతులకు నోచుకోలేకపోతున్నాయి. ఫలితంగా కార్మికులు వాటితో నిత్యం కష్టపడాల్సివస్తోంది.  వైకుంఠ రథానికి కనీసం రూ.25 వేలు పెట్టి మరమ్మతులు చేయించలేని పరిస్థితి ఉంది.

    ముఖ్యoగా చెత్తను తీసుకెళ్లే  ట్రాక్టర్లకు  చిన్నపాటి మరుమ్మతులు చేస్తే మరింత విస్తృతంగా పారిశుద్ధ్య పనులు చేసే అవకాశం ఉంది. కాని ఆ వాహనాలు ఎక్కడ  మొరాయిస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ఉదయం విధులకు హాజరైన  కార్మికులు ఇంటికి  ఎప్పుడు వచ్చేది చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇందుకు ట్రాక్టర్లు మరమ్మతులు  నోచుకోలేకపోవడమే  కారణమనిచెప్పవచ్చు.

    మరో వైపు మున్సిపల్‌లో ఉన్న ఆటోల పరిస్థితి మారి దారుణంగా ఉంది. తోస్తే కాని ఆటోలు కదలని పరిస్థితి. ఇటీవల మరమ్మతుల కోసం మున్సిపల్‌ పాలకవర్గ సమావేశంలో పలుమార్లు తీర్మానం చేసి ఆమోదించినా ఇంత వరకు అమలుకు నోచుకోలేకపోయింది. ఫలితంగా నెలల తరబడి ట్రాక్టర్‌లు మరుమ్మతులకు నోచుకోలేక రోడ్డుపై దిష్టి బొమ్మలా ఉన్నాయి.

    కాగా ప్రతి సమావేశంలో సభ్యులు మున్సిపల్‌కు వచ్చేఆదాయం కంటే ఖర్చు పద్దులు అధికంగా ఉన్నాయని అందుకు అస్తి పన్నులు పెంచడంతో పాటు వాణిజ్య సంస్థల ట్యాక్స్‌లను పెంచాలని నిర్ణయించారు. మున్సిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ అద్దెలు సైతం చాలా తక్కువగా వస్తున్నాయి.

    ఫలితంగా మున్సిపల్‌కు వచ్చే అన్ని ఆదాయాలు కూడా అతంతంగానే కావడంతో కార్మికులకు సరైన సమయంలో వేతనాలు చెల్లించలేని పరిస్థితి. దీంతో పాటు కనీసం విద్యుత్‌ బకాయిలు చెల్లించలేని ఆర్థిక లోటుతో  మున్సిపాల్టీ నడుస్తోంది. పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాల నుంచి రావాల్సిన కోట్ల రూపాయల ఆస్తిపన్ను బకాయిలపై ఏశాఖకు నోటీసులు ఇవ్వలేక పోయారు.

    మున్సిపల్‌ కార్యాలయానికి కరెంట్‌ కట్‌ చేసిన ట్రాన్స్‌కోకు చెందిన భవనాలు. ఇతర స్థిరాస్తుల ద్వారా రావాల్సిన బకాయిలపై మాత్రం మున్సిపల్‌ అధికారులు దృష్టి సారించాలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటి వరకు పట్టణంలో ఎన్ని ట్రాన్స్‌కోకు చెందిన విద్యుత్‌ స్తంభాలు ఉన్నాయి. ఎన్ని భవనాలు ఉన్నాయి.

    వాటి నుంచి  ఏడాదికి  ఎంత ఆదాయం రావాల్సి ఉంది. ఎంత వసూలు చేశారు అనే ప్రాథమిక సమాచారం ఇంత వరకు మున్సిపల్‌లో లేదు. గతంలో ప్రత్యేక అధికారిగా పనిచేసిన జాయింట్‌ కలెక్టర్‌ శరత్‌ ట్రాన్స్‌కో మున్సిపల్‌ పట్ల కఠినంగా వ్యహరించినప్పుడు మనమెందుకు ఊరుకోవాలని వారి నుంచి ఎంత పన్నులు రావాలో లేక్కలు వేయాలని అదేశించారు.

    అప్పట్లోనే పట్టణం మొత్తం 5,721 విద్యుత్‌ స్తంభాలు ఉన్నాయని, ట్రాన్స్‌కో కార్యాలయ ఆవరణలో అతిథి గృహానికి అనుమతి లేదని నిర్ధారించారు. వాటితో పాటు  క్వార్టలకు సైతం అనుమతి లేదని, పన్నులు సైతం నిర్మాణం పూర్తి అయినప్పటి నుంచి ఇంత వరకు చెల్లించలేదని గుర్తించారు.

    ట్రాన్స్‌కో ద్వారానే మున్సిపల్‌కు కనీసం ఏడాదికి రూ.12 నుంచి 15 లక్షల వరకు వివిధ పన్నుల రూపంలో చెల్లించాల్సి ఉంది. కాని ట్రాన్స్‌కో  దృష్టి పెట్టినట్లుగా మున్సిపల్‌ అధికారులు వారి బకాయిలపై దృష్టి పెట్టాలేకపోతున్నారన్న కౌన్సిల్‌ సభ్యులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు ట్రాన్స్‌ కోనుంచి పన్నులు, భవనాల అనుమతులకు డబ్బులు వసూలు చేస్తే కరెంటు బకాయిలు చెల్లించేందుకు వీలుంటుంది.

మరిన్ని వార్తలు