విదేశీ పెట్టుబడులతో ఒరిగింది శూన్యం

22 Sep, 2016 22:06 IST|Sakshi
విదేశీ పెట్టుబడులతో ఒరిగింది శూన్యం
ఏఎన్‌యూ: రెండున్నర దశాబ్దాల్లో భారతదేశంలో విదేశీ పెట్టుబడుల వల్ల నిజమైన పారిశ్రామికాభివృద్ధి జరగలేదని జేఎన్‌యూ (న్యూఢిల్లీ) ఆర్థికశాస్త్ర అధ్యాపకుడు ఆచార్య సి.పి.చంద్రశేఖర్‌ చెప్పారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో గురువారం ఏఎన్‌యూ రీసెర్చ్‌ ఫోరం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆచార్య చంద్రశేఖర్‌ దేశంలో 1991 తర్వాత జరిగిన ‘ఆర్థికాభివృద్ధి– విశ్లేషణ’ అంశంపై ప్రసంగించారు. 1950–80 మధ్య కాలంలో  కేంద్ర ప్రభుత్వమే పరిశ్రమలు స్థాపించి వాటి అభివృద్ధికి చర్యలు తీసుకునేదని చెప్పారు. 1980–90 మధ్య ఆర్థిక వృద్ధి పెరిగినప్పటికీ  ఆదాయం కంటే రుణాలు అధికమయ్యాయన్నారు.   1990 అనంతరం స్వదేశీ పెట్టుబడి తగ్గి విదేశీ పెట్టుబడి పెరిగిందన్నారు. కానీ వాటి వల్ల ఎలాంటి వృద్ధి జరగలేదన్నారు. 2013 తర్వాత బ్యాంకింగ్‌ వ్యవస్థ సంక్షోభంలోకి వెళ్లిపోయిందని చెప్పారు. పాతికేళ్లుగా నిజమైన అభివృద్ధి జరగలేదని, భవిష్యత్‌లో కూడా ఆర్థిక వృద్ధి జరిగే పరిస్థితి లేదని అభిప్రాయపడ్డారు. వీసీ ఆచార్య ఎ.రాజేంద్రప్రసాద్‌ అధ్యక్షత వహించిన సభలో సెంటర్‌ ఫర్‌ సైంటిఫిక్‌ సోషలిజం విభాగాధిపతి ఆచార్య అంజయ్య, పొలిటికల్‌ సైన్స్‌ అధ్యాపకుడు డాక్టర్‌ అంజిరెడ్డి  పాల్గొన్నారు.
>
మరిన్ని వార్తలు