పైసా నిల్‌ !

14 Sep, 2017 22:22 IST|Sakshi
పైసా నిల్‌ !

- నిధుల్లేకుండా ‘పశుశాఖ’ పయనం
– చెత్త బుట్టలోకి రూ.కోట్ల ప్రతిపాదనలు
– ప్రత్యామ్నాయం కరువై అన్నదాతల అవస్థలు


అనంతపురం అగ్రికల్చర్‌: పేరు గొప్ప... ఊరు దిబ్బ అన్న చందంగా... పైసా బడ్జెట్‌ లేకుండా పశుసంవర్ధకశాఖ పయనం సాగిస్తోంది.పశుగ్రాసం పథకం మినహా మిగతావన్నీ పూర్తిగా పడకేశాయి. పశుక్రాంతి, జీవక్రాంతి లాంటి ప్రయోజనం కల్పించే పథకాలకు ఎప్పుడో మంగళం పాడేశారు. జిల్లా అధికారులు కసరత్తు చేసి రూ.కోట్ల బడ్జెట్‌తో తయారు చేసి పంపుతున్న ప్రతిపాదనలు, నివేదికలను చంద్రబాబు సర్కారు చెత్తబుట్టలో పడేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో వ్యవసాయానికి ప్రధాన ప్రత్యామ్నాయంగా భావిస్తున్న పాడిపరిశ్రమ చతికిలపడింది.

కలగానే ప్రత్యామ్నాయం
జిల్లాలో 9.80 లక్షల సంఖ్యలో పశుసంపద, 45 లక్షల సంఖ్యలో గొర్రెలు, మేకలు, 18 లక్షలు కోళ్లు, మరో 50 వేలు ఇతరత్రా జంతువులు ఉన్నాయి. పాడిని నమ్ముకుని 2.50 లక్షల కుటుంబాలు, జీవాలపై 48 వేల కుటుంబాలు ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఏటా కేంద్ర బృందాలు జిల్లాకు వచ్చి కరువును కళ్లారా చూసి చలించడం మినహా అభివృద్ధి బాట పట్టించే కార్యక్రమాలు చేపట్టని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా పాడి పరిశ్రమను ప్రోత్సహించాల్సిన పాలకులు పట్టించుకోవడం మానేయడంతో మరింత ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రత్యామ్నాయం అనేది పగటి కలగానే మిగిలిపోయింది.

పడకేసిన పాడి
వ్యవసాయ, అనుబంధ రంగాలు, రైతులు, మహిళలకు పెద్ద పీట వేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించినా పశుసంవర్ధకశాఖకు కేటాయిస్తున్న బడ్జెట్, అమలు చేస్తున్న పథకాలు చూస్తే అందుకు విరుద్ధంగా ఉండటం విశేషం. చెప్పుకునేందుకు ఒక్క పథకం కూడా లేదంటే ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతుంది. పశుక్రాంతి లాంటి ప్రతిష్టాత్మకమైన పథకానికి ఫుల్‌స్టాప్‌ పెట్టగా.... మినీడెయిరీ లాంటి పథకానికి మంగళం పాడేశారు. జీవక్రాంతి ఊసేలేకపోగా... పశుబీమా అసలేలేదు. పెరటికోళ్లు, పెయ్యదూడలు లేవు. జీవరక్షనిధి, భేడ్‌పాలక్‌ లాంటి బీమా పథకాలు ఆపేశారు. పశువైద్యానికి చాలినంత మందులు లేవు. వైద్యం చేయడానికి పూర్తీ స్థాయిలో డాక్టర్లు, కాంపౌండర్లు కరువయ్యారు. ఉన్నవారు కూడా అనవసరమైన నివేదికల తయారీ, మీటింగ్‌లు, వీడియో కాన్ఫరెన్స్‌లు, ఊరూరా పశుగ్రాస క్షేత్రం అంటూ అసలైన విధులను పాక్షికంగా నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది.

జేడీ నుంచి డీడీ, ఏడీ లాంటి పైస్థాయి నుంచి దిగువ స్థాయి వరకు సుమారు 500 మందితో కూడిన పశుశాఖ వ్యవస్థకు ప్రతిపాదనలు తయారు చేయడం, నివేదికలు రూపొందించడం, వారంలో రెండు మూడు రోజులు మీటింగ్, టెలీకాన్ఫరెన్స్, వీడియోకాన్ఫరెన్స్, ఇతరత్రా సమీక్షలకు హాజరవడం లాంటి వృథా ప్రయాస తప్ప చేతినిండా అసలైన పనిలేకుండా పోయింది. ప్రయోజనం లేని క్షీరసాగర, అజొల్లా, హైడ్రోఫోనిక్‌ లాంటి పేరు తెలియని చిన్నపాటి పథకాలను అమలులోకి తెచ్చారు. సైలేజ్‌బేల్స్, దాణా పంపిణీ, ట్యాంక్‌బెడ్‌ కల్టివేషన్, ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు అనే గడ్డి పథకాలు మినహా మరేవీలేవంటే ఆశ్చర్యమేస్తుంది. మూడు నెలలకోసారి జిల్లా అధికారులు కష్టపడి తయారు చేసిన రూ.కోట్ల ప్రతిపాదనలు, నివేదికలు ప్రభుత్వానికి పంపడం, అవి బుట్టదాఖలు అవుతుండటంతో పశుశాఖ పథకాలు మొక్కుబడిగా సాగుతున్నాయనే విమర్శలున్నాయి.

మరిన్ని వార్తలు