చర్లపల్లి గ్యాస్‌ గోడౌన్‌లో అగ్నిప్రమాదం | Sakshi
Sakshi News home page

చర్లపల్లి గ్యాస్‌ గోడౌన్‌లో అగ్నిప్రమాదం

Published Fri, Sep 15 2017 2:11 AM

చర్లపల్లి గ్యాస్‌ గోడౌన్‌లో అగ్నిప్రమాదం - Sakshi

సిలిండర్లలో గ్యాస్‌ నింపుతుండగా ఎగసిపడిన మంటలు
భారీ శబ్దాలతో పేలిపోయిన సిలిండర్లు


సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని చర్లపల్లి పారిశ్రామికవాడలో ఉన్న హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (హెచ్‌పీసీఎల్‌) ప్లాంటులో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సిలిండర్లలో ఎల్‌పీజీ గ్యాస్‌ నింపుతున్న సమయంలో చిన్న నిప్పురవ్వతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. భారీ శబ్దంతో గ్యాస్‌ సిలిండర్లు పేలాయి. అయితే వెంటనే అందులో పనిచేసే కార్మికులు, కంపెనీ చుట్టుపక్కల నివసించే ప్రజలు దూరంగా పరుగులు తీశారు. దీంతో ప్రాణనష్టం ఏమీ జరగలేదని రాచకొండ పోలీసులు వెల్లడించారు.

నీటిని వదిలేయడంతో తప్పిన ముప్పు
హెచ్‌పీసీఎల్‌ ప్లాంటులో షిఫ్టు పద్ధతిలో 24 గంటల పాటు సిలిండర్లలో గ్యాస్‌ ఫిల్లింగ్‌ పని నడుస్తుంటుంది. అయితే వారం రోజుల నుంచి సిలిండర్లలో గ్యాస్‌ నింపుతున్న సమయంలో పైపులు పగిలి నిప్పురవ్వలు వస్తున్నట్లు కార్మికులు గుర్తించారు. అలా పగిలిన పైపులైన్ల మరమ్మతు పని కొనసాగిస్తున్నారు. అయితే గురువారం రాత్రి యథావిధిగా సిలిండర్లు నింపుతున్న సమయంలో నిప్పురవ్వలు వచ్చి, మంటలు చెలరేగాయి. చిన్న మంటగా ఉన్నప్పుడే కార్మికులు గుర్తించి బయటికి పరుగులు పెట్టారు. ఈ సమయంలోనే వరుసగా సిలిండర్లు పేలడం మొదలైంది. కొందరు కార్మికులు అగ్ని ప్రమాద హెచ్చరిక (ఫైర్‌ అలారం)ను మోగించారు. దీంతో ప్లాంటులో ఉన్న ఇతర సిబ్బంది.. 45 వేల క్యూసెక్కుల సామర్థ్యం కలిగిన రెండు వాటర్‌ ట్యాంకుల్లోని నీటిని ప్లాంటులోకి వదిలారు. దాంతో ప్లాంట్‌లో మొత్తం నీరు వ్యాపించి మంటలు తగ్గాయి. ప్రమాద సమయంలో ప్లాంటులో 200 మందికిపైగా ఉన్నట్టు తెలిసింది. వారిలో గ్యాస్‌ నింపే కార్మికులతో పాటు సిలిండర్ల లోడ్‌లు తీసుకెళ్లే లారీ డ్రైవర్లు కూడా ఉన్నట్టు సమాచారం. ప్రమాదం విషయం తెలిసిన రాచకొండ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని.. ప్లాంటు గేట్లు మూసివేశారు. రెండు అంబులెన్సులను మాత్రమే లోపలికి అనుమతించారు. ఘటనలో ప్రాణ నష్టమేమీ జరగలేదని పోలీసులు చెప్పారు.

పరుగులు పెట్టిన ప్రజలు
హెచ్‌పీసీఎల్‌ ప్లాంటులో భారీ శబ్దంతో గ్యాస్‌ సిలిండర్లు పేలుతుండటంతో సమీపంలోని జనం భయకంపితులయ్యారు. సమీపంలోని ఇళ్లలోని వారు తమ సామగ్రి తీసుకుని ఇతర ప్రాంతాలకు పరుగులు పెట్టారు. చర్లపల్లి, భరత్‌నగర్, బీఎన్‌ రెడ్డి నగర్, పెద్ద చర్లపల్లి సమీపంలోని ప్రజలు కుషాయిగూడ, నాగారం వైపు వెళ్లారు. ఇక ప్లాంటులో పనిచేసే కొందరు కార్మికుల కుటుంబ సభ్యులు, మహిళలు ప్లాంటు గేటు వద్దకు వచ్చి తమవారికి ఏమైందోనన్న ఆందోళనతో ఏడవడం కనిపించింది.

Advertisement
Advertisement