‘గణ’ వైభవం

6 Sep, 2016 23:19 IST|Sakshi
‘గణ’ వైభవం
  • ఘనంగా గణనాథునికి స్వాగతం
  • నవరాత్రోత్సవాల్లో సుమారు రూ.30 కోట్ల ఖర్చు
  • అంబరాన్నంటిన పండుగ సంబరాలు 
  •  
    ఆదిలాబాద్‌ : గణనాథునికి జిల్లా ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. సోమవారం వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వేలాది గణపతి మండపాలు వెలిశాయి. నవరాత్రులు వైభవంగా ప్రారంభమయ్యాయి. చవితి వైభవం జిల్లా అంతటా కనిపిస్తోంది. పండుగకు సుమారు రూ.30 కోట్లకు పైగా జిల్లా ప్రజలు వెచ్చించినట్లు అంచనా. మండపాల ఏర్పాటు, గణనాథుల కొనుగోళ్లు, మిఠాయిలు, బ్యాండ్‌మేళాలు, పూజసామగ్రి, వాహనాల్లో తరలింపు.. ఇలా పండుగను ఖర్చుకు వెనుకాడకుండా జిల్లా ప్రజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. నవరాత్రోత్సవాలు కాంతులీననున్నాయి. 
     
    పోటాపోటీగా మండపాల ఏర్పాట్లు
    జిల్లా వ్యాప్తంగా సుమారు వెయ్యికిపైగా భారీ గణనాథులు, గ్రామాల్లో, పట్టణాల్లో మరో వెయ్యి చిన్న గణపతులు మండపాల్లో కొలువుదీరాయి. ఆదిలాబాద్‌ పట్టణంలోని కుమార్‌పేట్‌ ప్రతీ ఏడాది నూతి(బావి)పై ఏర్పాటు చేసే గణనాథుడిని అదే స్థలంలో తయారు చేశారు. ఎదురుగా విష్ణుమూర్తి భారీ సెట్టింగ్‌తో, లోపల గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీని తయారు కోసం రూ.4 లక్షలు వెచ్చించారంటే మండపాల ఏర్పాటులో నిర్వాహకులు ఖర్చుకు వెనుకాడడం లేదని స్పష్టమవుతోంది.
     
    ఇలా జిల్లా వ్యాప్తంగా సుమారు వెయ్యి భారీ గణపతి విగ్రహాలు ఏర్పాటు చేశారు. మామూలు మండపం నవరాత్రుల ఖర్చు రూ.లక్షకు పైగా ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ లెక్కన చిన్న, పెద్ద మండపాలన్ని కలిపి వినాయక చవితి కోసం రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు వెచ్చించారని స్పష్టమవుతోంది. ప్రధానంగా ఆదిలాబాద్, నిర్మల్, భైంసా పట్టణాల్లో వినాయక విగ్రహాల ఏర్పాటు పోటాపోటీ వాతావరణం కనిపిస్తోంది. మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్, మందమర్రి ప్రాంతాల్లోనూ ఒకరకమైన ఉత్సాహం ఉంటుంది. 
     
    పండుగ సందడి..
    జిల్లా అంతటా సోమవారం వినాయక చవితి సందడి కనిపించింది. ఉదయం నుంచే పట్టణాల్లో ప్రధాన మార్కెట్‌ ప్రాంతాల్లో వినాయక విగ్రహాల కొనుగోళ్లు, పూజసామాగ్రి, మిఠాయిల కొనుగోళ్లతో సందడి నెలకొంది. ఆదిలాబాద్‌ పట్టణంలో సుమారు రెండు టన్నుల మిఠాయిల విక్రయాలు జరిగినట్లు మిఠాయి దుకాణాలు యజమానులు తెలుపుతున్నారు. ఇలా లక్షల రూపాయలు మిఠాయిల కోసమే వెచ్చించారు. పూజసామగ్రి కోసం రూ.2 కోట్ల వరకు వెచ్చించారు. మండపాల ఏర్పాటు, అలంకరణ, గణనాథుని తరలించేందుకు వాహనాల కిరాయి, బ్యాండ్‌ మేళాల కోసం కోట్లలో నిర్వాహకులు ఖర్చు చేశారు. మండపాలను అందంగా తీర్చిదిద్దారు. వివిధ ఆకృతుల్లో కొలువుదీరిన గణనాథులను చూసేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నవరాత్రోత్సవాలు ప్రజలకు సుఖఃసంతోషాలు కలుగాలని కోరుకుంటున్నారు.  
మరిన్ని వార్తలు