రాత్రి 7.30 గంటలకే శ్రీవారి గరుడ సేవ

12 Sep, 2016 19:24 IST|Sakshi

- అక్టోబరు 3 నుండి 11 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు
- హారతుల ద్వారా ఎక్కువ మందికి ఉత్సవమూర్తి దర్శనం
- భక్తుల కోసం నిర్ణయం : టీటీడీ ఈవో సాంబశిరావు


తిరుమల: భక్తుల దర్శనార్థం నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఉత్కృష్టమైన గరుడ వాహనం ఊరేగింపులో టీటీడీ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏడాది రాత్రి 8 గంటలకు నిర్వహించే వాహన ఊరేగింపు కార్యక్రమాన్ని ఈసారి రాత్రి 7.30 గంటలకే ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది.

రాత్రి 7.30 నుండి 12.30 గంటల వరకు ఊరేగింపు
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రతి వాహనం ఉదయం 9 నుండి 11 గంటలు, తిరిగి రాత్రి 9 నుండి 11 గంటల వరకు నిర్వహిస్తారు. భక్తుల రద్దీ, బ్రహ్మోత్సవ వైభవ ప్రాశస్త్యం నేపథ్యంలో దశాబ్దకాలంగా రద్దీ అనూహ్యంగా పెరిగింది. అందులోనూ గరుడ వాహన సేవ దర్శనం కోసం భక్తులు లక్షలాదిగా పోటెత్తారు. దీన్ని గుర్తించిన టీటీడీ దశాబ్దకాలం గరుడ వాహనం మాత్రం రాత్రి 8 గంటలకు ప్రారంభించి రాత్రి 12 గంటల వరకు నిర్వహిస్తోంది. అయినా భక్తుల రద్దీ మాత్రం ఏటేటా అంతకంతకు పెరుగుతోంది.
దీన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు గరుడ సేవ ఊరేగింపు కార్యక్రమాన్ని అర్థగంటపాటు ముందుగా ప్రారంభించాలని నిర్ణయించారు. దీనికి ఆగమ పండితులు, జీయర్లు, అర్చకులతో చర్చించి వారి అనుమతి కూడా పొందారు. ఈ మేరకు నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అక్టోబరు 7వ తేది రాత్రి 7.30 గంటలకే వాహనం ఊరేగించాలని నిర్ణయించారు. తరలివచ్చే భక్తులందరికీ ఉత్సవమూర్తి దర్శనం కల్పించాలని భావిస్తున్నారు. ఆ మేరకు ఆ రోజు రద్దీని బట్టి రాత్రి 12 నుండి 12.30 గంటల వరకు పొడిగించాలని నిర్ణయించారు.

హారతుల ద్వారా ఎక్కువ మందికి ఉత్సవమూర్తి దర్శనం
గరుడ వాహనంలో హారతులు తీసుకొచ్చే భక్తుల సంఖ్యను ఈసారి పెంచాలని నిర్ణయించారు. దీనివల్ల ఎక్కువ మందికి శ్రీవారి దర్శనం కల్పించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆలయ నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీల్లో కేవలం 2.2 లక్షల మంది మాత్రమే వేచి ఉండి ఉత్సవమూర్తిని దర్శించే అవకాశం ఉంది. అంతకంటే రెట్టింపు స్థాయిలో భక్తులు ఆలయ నాలుగు మాడ వీధుల వెలుపల వేచి ఉంటారు. అలాంటి భక్తుల్లో ఎక్కువ మందిని ఉత్సవమూర్తి దర్శనానికి అనుమతించి వారికి సంతృప్తి దర్శనం కల్పించాలని ఈవో భావిస్తున్నారు. అందుకునుగుణంగా రద్దీని క్రమబద్దీరించాలని అన్ని విభాగాలకు ఆదేశాలిచ్చారు.

రాత్రి 7.30 గంటలకే గరుడవాహనం: ఈవో సాంబశివరావు
'ప్రతిసారి రాత్రి 8 గంటలకే గరుడవాహనం ప్రారంభిస్తారు. దీనివల్ల ఎక్కువ మంది భక్తులు ఉత్సవమూర్తిని దర్శించుకోలేక ఆవేదనతో వెనుతిరుగుతున్నారు. వారందకీ దేవదేవుని దర్శనం కల్పించాలంటే అర్థగంట ముందే వాహనాన్ని ప్రారంభిస్తాం. అవసరమైతే రాత్రి అర్థగంట ఆలస్యమైనా భక్తులకు సంతృప్తి దర్శనం కల్పిస్తాం. ఉత్సవమూర్తిని భక్తులు దర్శించుకునే అవసరమైన చర్యలు చేపడతాం. దాంతోపాటు ఆగమ నిబంధణలు, ఆలయ సంప్రదాయాలు పాటిస్తాం'

- దొండపాటి సాంబశివరావు, టీటీడీ ఈవో

మరిన్ని వార్తలు