మొరం అక్రమ దందా

25 Jan, 2017 22:14 IST|Sakshi
మొరం అక్రమ దందా

ప్రభుత్వ పనుల పేరిట తరలింపు
ప్రైవేటు వ్యక్తులకూ విక్రయిస్తున్న వైనం
పట్టించుకోని అధికారులు


కోటగిరి (బాన్సువాడ): ప్రభుత్వ పనుల పేరిట మొరం అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు.. అలాగే ప్రైవేటు వ్యక్తులకూ విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అయినా సంబంధిత అధికారులు మాత్రం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు.. కోటగిరి మండల కేంద్రంలోని బీసీ కాలనీ గుట్ట ప్రాంతం నుంచి 15 రోజులుగా అక్రమంగా మొరం తరలిస్తుండడమే ఇందుకు నిదర్శనం. నిబంధనలకు విరుద్ధంగా జేసీబీ సహాయంతో టిప్పర్లు, ట్రాక్టర్లతో మొరాన్ని తరలిస్తున్నారు. ఇటీవల మండలంలో ఓ రోడ్డు నిర్మాణ పనులకు రూ. 2 కోట్ల మంజూరు చేస్తూ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ పనుల కోసం మొరం తరలిస్తున్నారు. అలాగే రాంపూర్‌ శివారులో నుంచి మొరం తవ్వి ఓ ప్రైవేటు గ్యాస్‌ ఏజెన్సీ నిర్మాణానికి తరలిస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు రుద్రూర్‌ మండలం సులేమాన్‌ఫారం గుట్టప్రాం తం నుంచి మొరం తోడేస్తూ ప్రైవేటు వ్యక్తుల ఇళ్ల నిర్మాణాలకు ఒక్కో టిప్పర్‌కు సుమారుగా రూ. 2200–2500ల వరకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఇలా మొరం తవ్వుతూ అక్రమంగా తరలిస్తున్నా అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

రాజకీయ నాయకులే బినామీ కాంట్రాక్టర్లు !
కొందరు రాజకీయ నాయకులే బినామీ కాంట్రాక్టర్లుగా మారడంతో ప్రజలు ఏమాత్రం అడ్డుకోలేని పరిస్థితులున్నాయి. ఇదేమిటని ప్రశ్నించే వారిని బెదిరించడం తంతుగా మారింది. సంబంధిత అధికారికి సమాచారం ఇస్తే ఆ వ్యక్తి పేరును నాయకులకు చెబుతుండడంతో ప్రశ్నించేందుకు పలువురు జంకుతున్నారు.

పట్టించుకోని అధికారులు
అక్రమాలను అడ్డుకొని ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాల్సిన స్థానిక అధికారులు తమ ప్రాంతంలో అడ్డగోలుగా నిబంధనలకు విరుద్ధంగా మొరం తవ్వకాలు జరుపుతున్నా తమకేమి పట్టనట్లుగా వ్యవహారించడం పలు అనుమానాలకు తావిస్తోంది. సమాచారం ఇచ్చినప్పటికీ స్పందించాల్సిన అధికారులు చూసీచూడనట్లుగా వదిలేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి మొరం అక్రమ రవాణాను నిలిపివేయించాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు