పెళ్లికి బాజా మోగింది

8 Aug, 2017 23:08 IST|Sakshi
  •  జిల్లా అంతటా శుభకార్యాల సందడి
  • ఆర్నెళ్ల ముందే రిజర్వయిన కల్యాణమంటపాలు
  • పేరున్న పురోహితులకు అడ్వాన్స్‌ చెల్లింపులు
  • ఆ మూడు రోజుల్లోనే మూడుముళ్లకు మొగ్గుచూపుతున్న జంటలు
  • ఆగస్టులో మంచి ముహూర్తాలు
  •  

     

    అనంతపురం కల్చరల్‌:

    జిల్లా వ్యాప్తంగా పెళ్లి సందడి కనపడుతోంది. సాధారణంగా శ్రావణ మాసం పెళ్లిళ్లకు శుభప్రదమైనదిగా భావిస్తారు. ఈ మాసంలో చాలా ముహూర్తాలున్నా ఆగస్టు 09. 12, 17  తేదీల్లోనే ఎక్కువగా వివాహాలు నిశ్చయమైనాయి. ఇవన్నీ కూడా అత్యంత మంచి ముహూర్తాలు కావడంతో వేలాది జంటలు ఒకటి కానున్నాయి.  ఇప్పటికే  ఈనెల 2న మంచి ముహూర్తం వెళ్లిపోయింది. ఇక రానున్న మంచి ముహూర్తాల్లోనే వివాహాలతో పాటు గృహ ప్రవేశాలు, అన్నప్రాసనలు, నామకరణోత్సవాలు, అక్షరభ్యాసాలు వంటి శుభకార్యాలు జరుగుతున్నాయి. దీంతో జిల్లాలోని కళ్యాణ మంటపాలు, ఫంక్షన్‌ హాళ్లు , దేవాలయాలు, విద్యా సంస్థలు, ఆఖరుకు కళాసంస్థలు కూడా వివాహాలకు వేదికలుగా మారాయి. ఇప్పటికే జిల్లాలోని అన్ని ఫంక్షన్‌ హాళ్లు, ఆలయాలలోని కల్యాణ వేదికలు మందుగానే రిజర్వు అయినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. పెన్నహోబిలం, రాప్తాడులోని పండమేటి వేంకటేశ్వరాలయం వంటి ఆలయాల్లోని కల్యాణమంటపాలున్న  చోట్ల ఒకేరోజు రెండు, మూడు కంటే ఎక్కువ వివాహాలు జరుగుతున్నాయి.

     

    పెరిగిన డిమాండ్‌

    పెళ్లిళ్లలన్నీ ఒకటి రెండు ముహూర్తాల్లోనే ఎక్కువగా ఉండడంతో పురోహితులు, భజంత్రీలు, సప్లయర్స్, క్యాటరింగ్‌ తదితర వాటికీ  విపరీతమైన డిమాండు ఏర్పడింది. అలాగే పూల దుకాణాలు, గిఫ్ట్‌ షాపులు కూడా జనంతో రద్దీగా మారుతున్నాయి. ఆలయాల్లోని గదులు బంధుమిత్రులకు సరిపోకపోవడంతో  సమీప ప్రాంతాల్లోని లాడ్జిలను బుక్‌ చేస్తున్నారు. ఈనేథ్యంలో జిల్లాలోని అన్ని ప్రధాన పట్టణాలలోని లాడ్జిలు రిజర్వ్‌ అయిపోవడమే కాకుండా వాటి అద్దెలు కూడా పెరిగినట్టు వ«ధూవరుల తల్లిదండ్రులు చెబుతున్నారు. పెరిగిన డిమాండ్ నేపథ్యంలో కల్యాణ మంటపాలకు లక్షలాది రూపాయలు అద్దె వసూలు చేస్తుండడంతో ఆర్థిక స్థోమత అంతంతమాత్రంగానే ఉన్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో కేవలం రూ.6 వేలకే కల్యాణమంటపం అద్దెకు దొరుకుతుండడంతో అందరూ అక్కడికి పరుగు తీస్తున్నారు. అందువల్లే  ఇక్కడ ఆర్నెళ్లు ముందుగానే కల్యాణ మంటపం రిజర్వు అవుతోంది.

     

    సమయం చాలడం లేదు

    శ్రావణమాసంలో శుభకార్యాలు ఎక్కువగా ఉంటాయని అందరికీ తెలిసిందే. అయినా ఈసారి బలమైన ముహూర్తాలు కేవలం రెండు మూడు మాత్రమే ఉన్నాయి. మళ్లీ అక్టోబర్‌ నెలలోకూడా ఒకటి రెండు ముహూర్తాలు మాత్రమే బాగున్నాయి.  తర్వాత వరుస ముహూర్తాలు కావాలంటే  నవంబర్‌ 23 నుండి 30 వరకు ఆగాల్సిందే. దాంతో ఈ శ్రావణంలో సమయం అసలు చాలడం లేదు. వివాహాలంటే అదరాబదరా చేయించలేం..కొందరు  విధి లేక ఒకేరోజు రెండు మూడు శుభకార్యాలు చేయిస్తున్నారు.  

    –కరణం వాసుదేవరావు, పురోహితులు, రాప్తాడు.

     

    ఆరు నెలల ముందే బుక్‌ అయిపోయాయి

    ఈ సారి ముహూర్తాలు అధికంగా ఉన్నాయి. మంచి ముహూర్తాలున్న రోజుల్లో ఆరు నెలలకు ముందుగానే బుక్‌ చేసుకున్నారు. కనీసం మూడు నెలల కిందటే చెబితే తప్ప అద్దెకివ్వలేని స్థితి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా ఇదే నెలలో ఎక్కువగా జరుగుతున్నాయి.

    –మోహనయ్య, మేనేజర్, టీటీడీ కల్యాణమండపం

మరిన్ని వార్తలు