రైతులకు శుభవార్త

24 Jul, 2016 19:54 IST|Sakshi
రైతులకు శుభవార్త

కడప అగ్రికల్చర్‌ :
జిల్లాలో పంట రుణాలను తిరిగి చెల్లించలేని రైతులకు కేంద్ర ప్రభుత్వం బీమా చేసుకునేందుకు వీలు కల్పించింది. ఇందులో భాగంగా వేరుశనగ పంట సాగు చేసిన, వారం రోజుల్లో వేరుశనగ సాగు చేసుకునే రైతులకు వాతావరణ బీమా చెల్లించుకునేందుకు ఈ నెల 31 వరకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు వచ్చినట్లు జిల్లా వ్యవసాయశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ జ్ఞానశేఖర్, జిల్లా లీడ్‌ బ్యాంకు చీఫ్‌ మేనేజర్‌ లేవాకు రఘునాథరెడ్డి, ఏపీజీబి సీనియర్‌ మేనేజర్‌ వీరారెడ్డి తెలిపారు. ఆదివారం సాయంత్రం కడప నగరంలోని కడప డివిజన్‌ వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రధాని ఫసల్‌ బీమా యోజనపై రైతుల్లో చైతన్యం తీసుకువచ్చి ఈ నెల 31 వరకు పంట రుణాలు తీసుకుని, తిరిగి చెల్లించలేని వారికి ఓ అవకాశం కల్పించారని అన్నారు. జిల్లాలో మొత్తం ఖరీఫ్‌లో వివిధ పంటలు సాగు చేసే రైతులు 2.50 లక్షల మంది ఉన్నారని, వారిలో 70 వేల మంది వేరుశనగ పంటకు వాతావరణ బీమా చేసుకున్నారని అన్నారు.

వీర ందరూ బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారేనని తెలిపారు. అయితే బ్యాంకుల్లో రుణాలు తీసుకోకుండా కేవలం వాతావరణ బీమా ప్రీమియం చెల్లించిన వారు 319 మంది, ప్రధాని ఫసల్‌ బీమా ప్రీమియం చెల్లించిన వారు 27 మంది మాత్రమే ఉన్నారని తెలిపారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారికి ఈ నెల 15తో ముగిసిందన్నారు. కేవలం 15–20 శాతం మంది బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించలేకపోయారని, వారందరు తాము రుణాలు తిరిగి చెల్లించలేమని, వేరుశనగ పంట సాగు చేశామని, వారం రోజుల్లో సాగు చేయబోయేబోతున్నామని ఒక లెటర్‌ను రాసుకుని అటు వ్యవసాయాధికారికి, బ్యాంకు వారికి ఒకటి రాసిస్తే తప్పకుండా బీమా ప్రీమియం చెల్లిస్తారని అన్నారు. ఈ అవకాశం ఈ నెల 31 వరకు ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని
సద్వినియోగం చేసుకోవాలని ఆయా రైతులను కోరుతున్నామని వారు వివరించారు.

 

>
మరిన్ని వార్తలు