ఇంటర్‌ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు 

1 Dec, 2023 03:10 IST|Sakshi

5వ తేదీ వరకు అవకాశం 

ఆలస్య రుసుంతో 15 వరకు చాన్స్‌ 

సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఇంటర్‌ మొదటి, రెండో ఏడాది జనరల్, ఒకేషనల్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపునకు ఇంటర్‌ విద్యా మండలి గడువు పొడిగించింది. వాస్తవానికి ఆలస్య రుసుం లేకుండా ఫీజు చెల్లించేందుకు నవంబర్‌ 30తో గడువు ముగిసింది. అయితే, ఈ గడువును మరో ఐదురోజులు పొడిగిస్తూ గురువారం ఇంటర్మీడియట్‌ విద్యా మండలి కార్యదర్శి సౌరభ్‌గౌర్‌ ఉత్తర్వులిచ్చారు.

రెగ్యులర్, ప్రైవేటు విద్యార్థులు ఆలస్య రుసుం లేకుండా డిసెంబర్‌ 5 వరకు, రూ.1000 ఆలస్య రుసుంతో 15  వరకు చెల్లింపునకు అవకాశం కల్పించినట్టు ప్రకటించారు. మొదటి/ రెండో సంవత్సరం థియరీ పరీక్షలకు రూ.550, రెండో ఏడాది జనరల్, ఒకేషనల్‌ ప్రాక్టికల్స్‌కు రూ.250, బ్రిడ్జి కోర్సులకు రూ.150 చెల్లించాలి. ఇంటర్‌ రెండేళ్ల థియరీ పరీక్షలకు రూ.1100, ఒకేషనల్‌ రెండేళ్ల ప్రాక్టికల్స్‌కు రూ.500, ఒకేషనల్‌ బ్రిడ్జి కోర్సుకు రూ.300 చెల్లించాలి. ఇప్పటికే ఇంటర్‌  పాసై ఇంప్రూవ్‌మెంట్‌ రాసేవారు రెండేళ్లకు ఆర్ట్స్‌ కోర్సులకు రూ.1240, సైన్స్‌ కోర్సులకు రూ.1440 ఆయా కళాశాలల్లో చెల్లించాలి.   

మరిన్ని వార్తలు