ఊళ్లు.. కన్నీళ్లు..

24 Jul, 2016 19:45 IST|Sakshi
ఊళ్లు.. కన్నీళ్లు..
  •  కనుమరుగు కానున్న  ఉద్దండ్రాయునిపాలెం, లింగాయపాలెం గ్రామాలు
  •  నిలువ నీడలేకుండా చేసేందుకు సర్కారు యత్నం
  •  విలవిలలాడుతున్న పల్లె ప్రజలు
  •  
    పల్లెకు పచ్చని చీరకట్టి ప్రతి వాకిట సిరులు కురిపించే పంట పొలాలు.. కార్పొరేట్‌ ఉక్కు పాదాల కింద నలిగిపోబోతున్నాయి.. ఇరుగు పొరుగు ఆప్యాయ పలకరింపులు, అనుబంధాలు.. పెట్టుబడిదారీ విధాన  రాబందుల రెక్కల కింద ముక్కలు కాబోతున్నాయి.. అమ్మ ఒడిలాంటి కమ్మనైన సొంత ఊరి మట్టి వాసనలు.. ఫ్యాక్టరీల పొగ గొట్టాల కాలుష్య భూతంతో కలుషితం కాబోతున్నాయి.. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఉద్దండ్రాయునిపాలెం, లింగాయపాలెం గ్రామాల నోట్లో మట్టి కొట్టి.. అక్కడి ప్రజల జీవనాన్ని ఫ్యాక్టరీల పునాదుల్లో సమాధి చేయబోతున్నాయి.
     
    సాక్షి, అమరావతి/ తుళ్లూరు రూరల్‌: ప్రభుత్వం కన్నతల్లి లాంటి ఊరును దూరం చేస్తోంది. తుళ్లూరు మండలం ఉద్దండ్రాయునిపాలెం, లింగాయపాలెం గ్రామాలు త్వరలోనే కనుమరుగు కానున్నాయి. అభివృద్ధి పేరుతో పచ్చని పల్లెలను నేలమట్టం చేసేందుకు సర్కారు రంగం సిద్ధం చేసింది. విషయం తెలుసుకున్న గ్రామాల ప్రజలు తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో అర్థంగాక ఆందోళన చెందుతున్నారు. స్విస్‌ చాలెంజ్‌ విధానంలో భాగంగా టీడీపీ ప్రభుత్వం స్టార్టప్‌ ఏరియాలను గుర్తించింది. కృష్ణానది ఒడ్డు నుంచి లింగాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం పరిసర ప్రాంతాలను మూడు ఉమ్మడి ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని నిర్ణయించింది. 
    రెండు గ్రామాలతో ఆ ప్రాంతంలోని ఆలయాలు, ప్రార్థన మందిరాలు, చెట్లు మొత్తం 1,691 ఎకరాల విస్తీర్ణాన్ని చదునుచేసి ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టాలని సంకల్పించింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు.
     
    మొన్న భూములు.. నేడు నివాసాలు
    రాజధాని వస్తే భూముల ధరలు పెరిగి బతుకులు బాగుపడుతాయని భావించిన గ్రామస్తులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. బహుళ పంటలు పండే భూములను సమీకరణ పేరుతో ప్రభుత్వం లాక్కుంది. రాజధాని నిర్మాణంలో భాగంగా వివిధ కంపెనీలు వస్తే బాగుపడుతారని పొంతనలేని హామీలు ఇచ్చి ఈ రెండు గ్రామాల్లో 3,035.32 ఎకరాలు ప్రభుత్వ, ప్రైవేటు భూములను స్వాధీనం చేసుకుంది. పది మందికి అన్నంపెట్టే రైతుకు భూములను దూరం చేసింది. అంతటితో ఆగని ప్రభుత్వం ఏకంగా ‘గూడు’ను కూడా కూల్చేందుకు సిద్ధమవుతోంది. ఏళ్ల క్రితం పూర్వీకులు నిర్మించిన గ్రామాన్ని, అందులోని 792 నివాసాలను కూలదోయడానికి నిర్ణయించింది. ఇప్పటికే పనుల్లేక స్థానికులు చాలా మంది వలసబాట పట్టారు. సొంత ఊరిని నమ్ముకుని కాలం బతుకుతున్న ప్రజలను ఊరికి దూరంగా పంపేయనుంది. ఊరిని వదులుకోలేక పల్లెవాసులు మౌనంగా రోదిస్తున్నారు. అవసరమైతే ఆయుధంగా మారి పోరాటం చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు.
>
మరిన్ని వార్తలు