నిరంతరం పచ్చిగడ్డి

11 Nov, 2016 01:16 IST|Sakshi
నిరంతరం పచ్చిగడ్డి

అనంతపురం అగ్రికల్చర్‌ : అజొల్లా, హైడ్రోఫోనిక్‌ పద్ధతుల ద్వారా ఏడాది పొడవునా  పచ్చిగడ్డి తీసుకోవచ్చని పశుసంవర్ధకశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వి.రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ తెలిపారు. పశుశాఖ ద్వారా ఈ ఏడాది 90 శాతం రాయితీతో అజొల్లా, 75 శాతం రాయితీతో హైడ్రోఫోనిక్‌ యూనిట్లు మంజూరు చేస్తామన్నారు. అవసరమైన రైతులు పశుశాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు.  

అజొల్లా
రోజుకు నాలుగు కిలోల అజొల్లా ఉత్పత్తి చేయుటకు 2.50 ‘‘ 1.5 మీటర్ల సైజులో ఒక తొట్టి తయారు చేసుకుని ఒకటి నుంచి ఒకటిన్నర కిలోల తాజా మదర్‌ కల్చర్‌ అజొల్లా బెడ్‌పై సమానంగా పడేలా చల్లాలి. జాగ్రత్తలు పాటించి 8వ రోజు నుంచి ప్రతిరోజూ ఒక్కో తొట్టి నుంచి కిలో అజొల్లా గడ్డి తీసుకోవచ్చు. అజొల్లాను సూటిగా సూర్యకాంతి పడని, మరీ ఎక్కువ నీడ పడని ప్రదేశంలో పెంచాలి. ఎండబెట్టిన అజొల్లా పొదిలో 25–35 శాతం మాంసపు కృత్తులు, 10–15 శాతం ఖనిజ లవణాలు, 7–10 శాతం అమినో ఆమ్లాలు, కెరోటిన్, బీ–12 విటమిన్లు ఉంటాయి. ఇందులో లిగ్నైట్‌ తక్కువగా ఉండటంతో పశువులు తేలికగా జీర్ణం చేసుకుంటాయి. రోజూ 1.5 నుంచి 2 కిలోల అజొల్లాను పశువుకు తినిపించవచ్చు. ఫలితంగా పాల డిగుబడి 15 నుంచి 20 శాతం పెరుగుతుంది. దాణాలో వేరుశనగ పిండికి బదులుగా అదే పరిమాణంలో అజొల్లాను వాడవచ్చు.  

హైడ్రోఫోనిక్‌ గడ్డి
బార్లీ, సజ్జ, మొక్కజొన్న, జొన్న వంటి విత్తనాలతో మొలకగడ్డి తయారు చేసుకోవచ్చు. మన ప్రాంతానికి మొక్కజొన్నతోనే లాభదాయకం. అధిక దిగుబడికి నాణ్యమైన విత్తనాల ఎంపిక ఎంతో అవసరం. ప్లాస్టిక్‌ ట్రేలలో కొన్ని పద్ధతులు పాటించి పెంచితే 8 రోజుల్లో కిలో విత్తనం నుంచి 12–15 కిలోల పచ్చి మేత పొందవచ్చు. ఈ గడ్డిలో  17.2 శాతం ప్రోటీన్లు, 25.4 శాతం పీచు పదార్థం, 84.8 శాతం నీరు ఉన్నట్లుగా ప్రయోగాల్లో రుజువైంది. అలాగే దాణాలో ఉన్న విధంగా విటమిన్లు ఏ, ఈ, లవణాలు, క్యాల్షియం, భాస్వరం ఇతరత్రా పోషక పదార్థాలు ఉన్నట్లుగా తేలింది. మొలకగడ్డిని 9వ రోజు వేర్లతో సహా పశువుకు పెట్టాలి. ఒక్క పశువుకు 15–20 కిలోల గడ్డి పెట్టవచ్చు. నీరు, భూమి, కరెంటు ఖర్చు తక్కువతోనే ఇంటి వద్ద పెంచవచ్చు. పైగా పాల ఉత్పత్తి 15–20 శాతం పెరుగుతుంది. పశువులు సకాలంలో ఎదకు వచ్చి చూలు కడతాయి. వ్యాధి నిరోధకశక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటాయి. 

మరిన్ని వార్తలు