ఏయూ పీఠంపై పల్నాటి బిడ్డ

19 Jul, 2016 18:36 IST|Sakshi
ఏయూ పీఠంపై పల్నాటి బిడ్డ
గుంటూరు జిల్లా వాసిని వరించిన ఆంధ్రా యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ పదవి
పేదరికం నుంచి ఉన్నత శిఖరానికి నాగేశ్వరరావు ప్రస్థానం 
గురజాల మండలం జంగమహేశ్వరపురం స్వస్థలం
 
 
తలదాచుకోవడానికి సొంత గూడు లేక.. చదువుకోవడానికి డబ్బుల్లేక.తింటానికి సరైన తిండిలేక ఇలా బాల్యంలో పేదరికం విసిరిన సవాళ్లను చిరునవ్వుతో స్వీకరించారు. అక్షరాన్ని ఆయుధంగా మలుచుకుని మేథోశక్తిని మధించారు..ప్రతి తరగతి గదిలో ఉత్తమ ఫలితాలతో గర్జించి..ప్రభుత్వం అందించే స్కాలర్‌షిప్‌లను తమ వాకిట ముంగిటకు నడిపించారు. వాటినే ఆసరాగా చేసుకుని ఉన్నత విద్యా శిఖరాల వైపు అడుగులు వేశారు. ఓనమాలు దిద్దిన యూనివర్సిటీలో అగ్ర పీఠం తనను వెతుక్కుంటూ వచ్చేలా విజయనాదం చేశారు. జన్మనిచ్చిన పల్నాట గడ్డకు వన్నె తెచ్చి..మట్టిలో మాణిక్యంగా మెరిసిపోతున్నారు ఆంధ్రా వర్సిటీ వైస్‌ చాన్సలర్‌ నాగేశ్వరరావు.
 
 
సాక్షి, గుంటూరు: కష్టపడి చదివితే ఎంతటి లక్ష్యాన్నైనా చేరుకోవచ్చు అనడానికి ఆంధ్రా యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌గా నియమితులైన గొల్లపల్లి నాగేశ్వరరావు ఉదాహరణ. తండ్రి ఆర్థిక పరిస్థితిని సైతం లెక్క చేయకుండా స్కాలర్‌ప్‌లతో చదువుకుని అత్యున్నత స్థాయికి ఎదిగారు. నేడు చదువుకున్న యూనివర్సిటీలోనే అగ్ర పీఠాన్ని అధిరోహించారు. ఈయన స్వస్థలం గుంటూరు జిల్లాలోని గురజాల మండలం జంగమహేశ్వరపురం. 
 
 గొల్లపల్లి నర్సయ్య, అనసూయమ్మ దంపతుల రెండో సంతానం నాగేశ్వరరావు. తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాళ్లు. వీరికి సొంత ఇల్లు కూడా లేదు. నాగేశ్వరరావుకు చిన్నతనం నుంచే చదువుపై ఉన్న మక్కువను గుర్తించిన తల్లిదండ్రులు మాచవరం మండలం గంగిరెడ్డిపాలెంలోని అమ్మమ్మ వాళ్ల ఇంటి వద్ద ఉంచారు. అక్కడే ఒకటి నుంచి ఐదు వరకు ప్రభుత్వ పాఠశాల్లో చదివించారు. అనంతరం రెంటచింతలలోని వైఆర్‌ఎస్‌ పాఠశాలలో పదో తరగతి వరకు స్కాలర్‌షిప్‌పై చదువుకున్నారు. మాచర్లలోని ఎస్‌కేబీఆర్‌ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. ఉన్నత చదువుల కోసం విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మెరిట్‌ స్కాలర్‌షిప్‌ సాయంతో 1979లో ఇన్‌ ఆర్గానిక్‌  కెమిస్ట్రీలో పీజీ పూర్తి చేసి 1981– 84 మధ్యలో ఎంఫిల్‌ చదివారు. 1985 నుంచి 89 వరకు పీహెచ్‌డీ చదివి 1990లో ఆంధ్రా యూనివర్సిటీలో అసిస్టెంటŒæప్రొఫెసర్‌గా ఉద్యోగం పొందారు.
కుటుంబ నేపథ్యం..
గొల్లపల్లి నాగేశ్వరరావు 1986లో పీహెచ్‌డీ చేస్తుండగానే బొల్లాపల్లి మండలం రెడ్డిపాలేనికి చెందిన రాజారపు జ్ఞానయ్య మాస్టారు కుమార్తె విజయకుమారిని వివాహం చేసుకున్నారు. ఆమె ఇంగ్లిషు టీచర్‌ కావడంతో ఆ ఇల్లు చదువులకు నిలయంగా మారింది. నాగేశ్వరరావుకు అర్చన, నవ్య అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారికి వివాహాలు చేసి కుటుంబ బాధ్యతలు నెరవేర్చుకున్నారు. 
వెనుతిరగకుండా ముందుకు సాగుతూ ... 
ఇక అక్కడి నుంచి నాగేశ్వరరావు ప్రస్థానం వెనక్కు చూడాల్సిన పని లేకుండా సాగింది. 2000 సంవత్సరంలో ఆంధ్రా యూనివర్సిటీ ఉత్తమ పరిశోధకునిగా అవార్డు అందుకున్నారు. 2008లో డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ఉత్తమ విద్యావేత్త అవార్డును పొందారు. 2014లో రాష్ట్రస్థాయి ఉత్తమ ఆచార్య అవార్డు అందుకున్నారు. ఏయూలో చీఫ్‌ వార్డెన్‌గా, అసిస్టెంట్‌ ప్రిన్సిపాల్‌గా, క్యాంపస్‌ ప్రవేశాల విభాగం అసోసియేట్‌ డైరెక్టర్‌గా, స్కూల్‌æఆఫ్‌ కెమిస్ట్రీ డైరెక్టర్‌గా, ఏపీ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ ఫెలోగా, సైన్స్‌ కళాశాల ప్రాంగణ నియామకాల అధికారిగా పని చేశారు. ఇన్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ డిపార్టుమెంట్‌ హెచ్‌ఓడీ పదవిలో ఉండగా ఆదివారం ఆంధ్రా యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ఉన్నత పీఠం వరించింది. దీంతో జంగమేశ్వరపురం, గంగిరెడ్డిపాలెం, రెంటచింతల, మాచర్లలోని ఆయన బంధువులు, స్నేహితులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు.  
చిన్నతనం నుంచే నాగేశ్వరరావుకు చదువంటే ఇష్టం..
నాగేశ్వరరావుకు చిన్నతనం నుంచే చదువుకోవాలనే మక్కువ ఎక్కువగా ఉండేది. అయితే మా బాబాయి ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో గంగిరెడ్డిపాలెంలోని వాళ్ల అమ్మమ్మ ఇంటి వద్దే ఐదో తరగతి వరకు చదువుకున్నాడు. డిగ్రీ వరకు చదివి ఏదో ఉద్యోగం చేస్తాడనుకున్నాను. ఇంతటి స్థాయికి ఎదుగుతాడని ఊహించలేదు. మాకెంతో ఆనందంగా ఉంది. 
–  నాగేశ్వరరావు, అన్న, జంగమహేశ్వరపురం
 
మరిన్ని వార్తలు