అవినీతి కూపంలో నగరపాలక సంస్థ

29 Jan, 2017 23:58 IST|Sakshi
అవినీతి కూపంలో నగరపాలక సంస్థ

– మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌ రెడ్డి
– జనబలం కార్యాలయం ప్రారంభం


అనంతపురం న్యూసిటీ : నగరపాలక సంస్థ అవినీతి కూపమయిందని మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌ రెడ్డి విమర్శించారు. ఆదివారం స్థానిక శారదానగర్‌లో జనబలం నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి, మేయర్‌ స్వరూప ప్రజా సమస్యలను గాలికొదిలేసి ధనార్జనే ధ్యేయంగా ముందుకెళ్తున్నారన్నారు. నగరపాలక సంస్థ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విచ్చలవిడిగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు.

యువత ఇటువంటి అవినీతిపరులను ఎండగట్టాలన్నారు. వారు చేస్తున్న అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. టీడీపీ నేత జయరాంనాయుడు మాట్లాడుతూ అధికార పార్టీ తన భార్య హరిత ప్రాతినిధ్యం వహిస్తున్న 48వ డివిజన్‌లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని ఆరోపించారు. ఎమ్మెల్యేకు తొత్తులుగా ఉన్న వారికి పనులు కేటాయిస్తున్నారని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. అనంత నగరాభివృద్ధి వేదిక వ్యవస్థాపకుడు కోగటం విజయభాస్కర్‌ రెడ్డి మాట్లాడుతూ అధికారాన్ని అడ్డంపెట్టుకుని కోట్లు దోచుకోవడం సరికాదన్నారు. జనబలం రాష్ట్ర అధ్యక్షుడు బీ బాబాఫకృద్దీన్‌ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటాలు చేస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ ఫ్లోర్‌ లీడర్‌ జానకి, కార్పొరేటర్లు సరోజమ్మ, ఉమామహేశ్వర్, దుర్గేష్, కాంగ్రెస్‌ పార్టీ నగరాధ్యక్షులు దాదా గాంధీ, జనబలం జిల్లా అధ్యక్షులు సాదిక్,  ఎంఎస్‌ఎస్‌ సంఘం అధ్యక్షులు సాదిక్, ఎంఎండీ ఇమామ్, జీతేష్‌చౌదరి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు