హంద్రీ-నీవా నీటి కోసం ఉద్యమిస్తాం

21 Feb, 2016 06:40 IST|Sakshi
హంద్రీ-నీవా నీటి కోసం ఉద్యమిస్తాం

‘రైతుల జల జాగరణ’లో వక్తల పిలుపు
శివరాత్రిని తలపించిన కార్యక్రమం
పెద్దసంఖ్యలో రైతుల హాజరు

 
అనంతపురం/ఉరవకొండ : ‘కృష్ణా జలాలు హంద్రీ-నీవా కాలువ ద్వారా జీడిపల్లి రిజర్వాయర్‌కు చేరుతున్నాయి. మన కళ్ల ముందే కాలువలో  పారుతున్నా.. పొలాలకు మాత్రం రావడం లేదు. పంటలు  నిలువునా ఎండిపోతున్నాయి. ఇలానే చేతులు కట్టుకుని కూర్చుంటే లాభం లేదు. ప్రభుత్వం మెడలు వంచైనా హంద్రీ-నీవా నీళ్లు సాధించుకోవాల్సిందే’నని వక్తలు పిలుపునిచ్చారు. ఉరవకొండ నియోజకవర్గ పొలాలకు ఈ ఏడాదైనా హంద్రీ-నీవా నీరివ్వాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి నాయకత్వంలో హంద్రీ-నీవా ఆయకట్టు సాధన సమితి ఆధ్వర్యంలో  వజ్రకరూరు మండలం పొట్టిపాడు వద్ద శనివారం సాయంత్రం ‘రైతుల జల జాగరణ’కు శ్రీకారం చుట్టారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ముగుస్తుంది. నియోజకవర్గవ్యాప్తంగా వేలాదిమంది రైతులు తరలివచ్చారు. రాత్రంతా శివరాత్రి పండుగలా జాగరణ చేశారు. వామపక్ష పార్టీల నేతలతో పాటు పలువురు తరలివచ్చి మద్దతు తెలిపారు. హంద్రీ-నీవా ద్వారా జిల్లాలోని ఆయకట్టుకు నీరివ్వకపోతే ప్రభుత్వానికి పాడె కడతామని హెచ్చరించారు.

 80 ఎకరాలకు నీరివ్వాలి
హంద్రీ-నీవా డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్(డీపీఆర్)లో ఉన్నట్లుగా ఉరవకొండ నియోజకర్గంలో పొలాలకు నీరిచ్చే అన్ని డిస్ట్రిబ్యూటరీలు, పిల్లకాలువలు పూర్తి చేయాలి. ఈ ఏడాది 80 వేల ఎకరాలకు నీరివ్వాలి. లేదంటే కడుపులు మండుతున్న రైతాంగంతో కలిసి పెద్దఎత్తున  ఉద్యమిస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న మోసాలను ప్రజలు గమనిస్తున్నారు. పార్టీలకతీతంగా అందర్నీ కలుపుకుని ఉద్యమిస్తాం.      - విశ్వేశ్వరరెడ్డి ఎమ్మెల్యే


ప్రజల్ని నిలువునా మోసగిస్తున్నారు
 జిల్లా ప్రజలు టీడీపీని నమ్మి ఓట్లువేశారు. 12మంది ఎమ్మెల్యేలతో పాటు ఇద్దరు ఎంపీలను గెలిపించారు. ఇలాంటి ప్రజలను ముఖ్యమంత్రి నిలువునా మోసం చేస్తున్నారు. హంద్రీ-నీవా మొదటిదశ పూర్తి చేస్తే లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతుంది.  వైఎస్ హయాంలో 95 శాతం పనులు పూర్తయ్యాయి. తక్కిన  5 శాతం పనులు పూర్తి చేయకుండా చంద్రబాబు గాలిమాటలు చెబుతున్నారు. తీరుమార్చుకోకపోతే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదు.  - అనంత వెంకటరామిరెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ర్ట  ప్రధానకార్యదర్శి

 హంద్రీ-నీవా కోసం ఐక్య పోరాటం
రాయలసీమ ప్రాంత వాసుల కష్టాలు తీర్చడానికి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హంద్రీ-నీవాకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన హయాంలో రూ. 6 వేలు కోట్లు కేటాయించారు. మిగిలిన పనులు పూర్తి చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం   తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. చంద్రబాబు పాదయాత్ర సమయంలో హంద్రీ-నీవాను పూర్తి చేసి సాగు,తాగు నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. బడ్జెట్‌లో మాత్రం కేవలం రూ.100 కోట్లు విదిల్చారు.  ఈ నిధులు కరెంటు బిల్లులు, కాంట్రాక్టర్ల బకాయిలకే సరిపోయాయి.  - అత్తార్ చాంద్‌బాషా, కదిరి ఎమ్మెల్యే

 అబద్ధాల కోరు చంద్రబాబు
 అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి  చంద్రబాబు గద్దెనెక్కారు. ఇప్పుడు జన్మభూమి కమిటీల పేరుతో దోపిడీ ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీళ్లు అందిస్తామంటూ ప్రభుత్వం చెబుతోంది.అయితే నీళ్లు ఎలా ఇస్తారో ప్రజలకు వివరించాలి. టీడీపీ హయాంలో 150 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కనీసం ఆ రైతుల కుటుంబాలను పరామర్శించలేదు.
 - కాపు రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే

 నీటిని తరలించుకుపోతే ఊరుకోం
హంద్రీ-నీవా ద్వారా జిల్లాలోని ఆయకట్టుకు అందాల్సిన నీటిని తన సొంత నియోజకవర్గానికి చంద్రబాబు తరలించుకుపోతే చూస్తూ ఊరుకోం. ప్రభుత్వం రాజకీయాలకు పోకుండా జిల్లా కరువు పరిస్థితులను దృిష్టిలో ఉంచుకుని ఆయకట్టుకు నీరివ్వాలి.  - జగీదష్, సీపీఐ జిల్లా కార్యదర్శి

 సీమపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు
 పెండింగ్ పనులు పూర్తి చేస్తే  హంద్రీ-నీవా ద్వారా 3.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. కానీ చంద్రబాబుకు రాయలసీమ అభివృద్ధిపై  చిత్తశుద్ధి లేదు. రానున్న బడ్జెట్ సమావేశాల్లో జిల్లాకు చెందిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడి తెచ్చి హంద్రీ-నీవాకు నిధులు సాధించాలి. - గురునాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే

 లోటు బడ్జెట్ అంటూ దుబారా
 రాష్ర్టం లోటు బడ్జెట్ లో ఉందంటూ పదేపదే ప్రజలను మోసగిస్తున్నారు. శంకుస్థాపనలు, విదేశీ పర్యనలకు కోట్లాది రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు. టీడీపీ అధికారం చేపట్టిన తర్వాత 13 కిలోమీటర్లు మాత్రమే హంద్రీ-నీవా కాలువను తవ్వించారు. - రాంభూపాల్, సీపీఎం జిల్లా కార్యదర్శి

 బాబు మాటలు నీటిమూటలే
 చంద్రబాబు హామీలన్నీ నీటిమూటలే. రైతు, డ్వాక్రా రుణమాఫీతో పాటు ఇంటికోఉద్యోగం లాంటి హామీలు నెరవేర్చలేదు.  సాగునీటి ప్రాజెక్టులకు అత్యధిక నిధులు కేటాయించిన ఘనత వైఎస్‌కే దక్కుతుంది.     - పెద్దన్న, సీపీఐ(ఎంల్) నేత

మరిన్ని వార్తలు