‘తెలంగాణ’ను ఐటీ హబ్‌గా మారుస్తాం | Sakshi
Sakshi News home page

‘తెలంగాణ’ను ఐటీ హబ్‌గా మారుస్తాం

Published Sun, Feb 21 2016 4:21 AM

‘తెలంగాణ’ను ఐటీ హబ్‌గా మారుస్తాం

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
బిట్స్‌లో లాంఛనంగా ఫేజ్ టూ భవనానికి భూమిపూజ

 శామీర్‌పేట్: తెలంగాణ రాష్ట్రాన్ని ఐటీ హబ్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట్ మండలం బిట్స్‌పిలానీ హైదరాబాద్ క్యాంపస్‌లో రెండో దశ భవన నిర్మాణ  పనులకు శనివారం మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు పెద్దపీట వేస్తోందని, విద్యారంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని తెలిపారు. బిట్స్‌పిలానీ హైదరాబాద్ క్యాంపస్ దేశంలోనే అతిపెద్ద విద్యా సంస్థగా ఎదగాలని ఆశించారు. ఇక్కడ చదివే విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకుని తెలంగాణ రాష్ట్రానికి మంచిపేరు తీసుకురావాలన్నారు.

బిట్స్ చైర్మన్ కుమార మంగళం బిర్లా ఆశయ సాధనకు కృషి చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.  బిట్స్ డెరైక్టర్ వీఎస్ రావు మాట్లాడుతూ బిట్స్ పిలానీలో నూతనంగా 10 లక్షల చదరపు అడుగులతో సుమారు రూ.370 కోట్లతో ఈ నిర్మాణాలు చేపడుతున్నామని, 2018 డిసెంబర్ నాటికి వీటిని పూర్తి చేస్తామని తెలిపారు. ప్రస్తుతం బిట్స్‌లో 3,200 మంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో విద్యాభ్యాసం చేస్తున్నారని, ఈ భవన నిర్మాణం పూర్తయితే మరో 2,100 మంది విద్యార్థులు అదనంగా చదివే వీలుంటుందన్నారు. 2025 నాటికి ఇక్కడి క్యాంపస్‌లో 10 వే ల మంది విద్యార్థులు విద్యను అభ్యసించేలా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఐటీశాఖ మంత్రి కేటీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ ఐటీ హబ్‌గా మారడం ఖాయమని వీఎస్.రావు కొనియాడారు.

అనంతరం నూతన భవనం నిర్మాణాల వివరాలను మంత్రి కేటీఆర్‌కు బిట్స్ డెరైక్టర్ వీఎస్ రావు వివరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ క్యాంపస్‌లో కలియదిరిగారు. తరువాత రాష్ట్రంలో పర్యావరణం, వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఏర్పాటు చేసిన అవగాహన సైకిల్ ర్యాలీని మంత్రి కేటీఆర్ గన్ పేల్చి ప్రారంభించారు. కార్యక్రమంలో బిట్స్ సెక్రటరీ జేఎస్ రంజన్, మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, ఎంపీపీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, టీఆర్‌ఎస్ వివిధ మండలాల అధ్యక్షులు విష్ణుగౌడ్, భాస్కర్, ఎంపీటీసీ సభ్యుడు జహంగీర్,  టీఆర్‌ఎస్ నేత శ్రీనివాస్‌గౌడ్, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement