విహంగ వీక్షణం

24 Feb, 2016 02:43 IST|Sakshi
విహంగ వీక్షణం

నల్లవాగు, గట్టులింగంపల్లి పరిసరాలపై మంత్రి హరీశ్‌రావు ఏరియల్ వ్యూ
తాగు,సాగునీటి సమస్య పరిష్కారానికి అధికారులతో చర్చలు


నారాయణఖేడ్/కల్హేర్/మనూరు: గట్టులింగంపల్లి, నల్లవాగు ప్రాజెక్టులను రాష్ర్ట భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు మంగళవారం ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. ఎంపీ బీబీ పాటిల్, జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రాస్, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో కలిసి మంత్రి ఉదయం 10 గంటల కు హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ నుం చి నారాయణఖేడ్ వచ్చారు. తొలుత సింగూరు ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం మనూరు మండలంలోని గట్టులింగంపల్లి చెరువును, కల్హేర్ మండలంలోని నల్లవాగు ప్రాజెక్టును హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. సింగూరు ప్రాజెక్టులోకి గోదావరి నీళ్ల మళ్లింపు, గట్టులింగంపల్లి ప్రాజెక్టులోకి సింగూరు నీరు మళ్లించే విషయమై సాధ్యాసాధ్యాలను అంచనా వేశారు. నల్లవాగు నీటిని సాగు, తాగునీటి అవసరాలకు సరఫరా చేసే విషయమై ఈ సర్వే చేపట్టారు. నల్లవాగు ప్రాజెక్టు పరిసరాలను ఆయన సుల్తానాబాద్, గోసాయిపల్లి, అంతర్‌గాం, కంగ్టి మండలం నాగన్‌పల్లి, పోట్‌పల్లి, నిజామాబాద్ జిల్లా తిమ్మనగర్ వరకు పర్యటించి విహంగ వీక్షణం చేశారు. సమస్య పరిష్కారానికి మంత్రి అధికారుల సలహా సూచనలు స్వీకరించారు. అనంతరం మంత్రి గంగాపూ ర్‌లో మిషన్ కాకతీయ 2వ ఫేజ్ పనులను ప్రారంభించారు. సాయంత్రం 4కి తిరిగి హెలికాప్టర్ ద్వారా మంత్రి వరంగల్ జిల్లా జనగామకు వెళ్లారు.

 చర్చనీయాంశమైన ‘సాక్షి’ కథనాలు
గట్టులింగంపల్లి చెరువు గురించి మంగళవారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమై న ‘గట్టు కదిలిక’, మంత్రి ఏరియల్ సర్వే కు రానున్నారనే విషయాలను మండల ప్రజలు ఆసక్తిగా చదివారు. ఈ చెరువు ప్రాజెక్టు రూపుదాలిస్తే మనూరు మండలానికి మంచి రోజులు వస్తాయని ప్రజ లు చర్చించుకోవడం కనిపించింది. మం త్రి పర్యటను ఆసక్తిగా తిలకించారు.

 ‘ఖేడ్’ దుఃఖం తీరుస్తా.. నీటి సమస్యను పరిష్కరిస్తా..
జిల్లాకు రూ.10 కోట్లు వస్తే.. ఖేడ్‌కే రూ.1.80 కోట్లు
చిమ్నీమాయి కొడుకు పెళ్లికి వెళ్దాం మంత్రి హరీశ్‌రావు

నారాయణఖేడ్: ‘నారాయణఖేడ్ ని యోజకవర్గ ప్రజలకు శిరస్సు వంచి, హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నా.. ఎంత చేసినా మీ రుణం తీర్చుకోలేను.. నా శక్తినంతా ఉపయోగించి ఖేడ్ నియోజకవర్గ ప్రజల దుఃఖం దూరం చేస్తా.. ఖేడ్‌ను దత్తత తీసుకుంటానని చెప్పాను.. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నా..’ అని భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఉద్వేగంతో అన్నారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యేగా భూపాల్‌రెడ్డి ఎన్నికైన సందర్భంగా స్థానిక రహమాన్ ఫంక్షన్‌హాలులో మంగళవారం అభినందన సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ ప్రేమాభిమానాలతో పనిచేసి ప్రజల ఆదరాభిమానాలను పొందుదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారను. నియోజకవర్గంలో ప్రధానంగా తాగునీటి సమస్యను తీర్చాల్సి ఉందన్నారు. నీళ్ల కోసం గోస పడుతున్న సర్దార్ తండాలోని చిమ్నీమాయి వంటి వారి సమస్యలను పరిష్కరిద్దామని, చిమ్నీమాయి కొడుకు పెళ్లికి కూడా వెళ్దామని మంత్రి అన్నారు. నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెడతానని మంత్రి అన్నారు. జిల్లాకు తాగునీటి కోసం రూ.10.80 కోట్లు రాగా తన సిద్దిపేకు కేవలం రూ.50 లక్షలు మాత్రమే తీసుకొని నారాయణఖేడ్‌కు రూ.1.80 కోట్లు ఇచ్చినట్లు తెలి పారు. ప్రాంతంలో గురుకులాలను ఏర్పాటుచేసి ఈ ప్రాంత విద్యార్థులు ఇక్కడే ఉండి చదువుకునేలా చూస్తానని మంత్రి హరీష్‌రావు అన్నారు.

 ఖేడ్‌లో కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ షురూ
ఈ చిత్రంలో కనిపిస్తున్నది నారాయణఖేడ్‌లోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం. బెడ్‌రూం, డైనింగ్ హాల్ ఇతర ఆధునిక సాంకేతిక హంగులతో దీన్ని రూపొందించారు. మంగళవారం మంత్రి హరీశ్‌రావు దీన్ని ప్రారంభించారు. ప్రతి 15 రోజులకోసారి జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రాస్ ఈ క్యాంపు ఆఫీస్‌లోనే బస చేస్తారు. రోజంతా ఇక్కడే గడిపి ఖేడ్ అభివృద్ధి పనులను సమీక్షిస్తారు. మరోపక్క మంత్రి హరీశ్‌రావు సైతం వీలైతే 15 రోజులకు లేదా నెలకోసారి వస్తానని ప్రకటించారు. ఏళ్లకేళ్లుగా అభివృద్ధి జాడలేక నెర్రెలు బాసిన నారాయణఖేడ్ ఇప్పుడిప్పుడే కొత్తరూపు దాల్చుతోంది. నీళ్లు.. బళ్లు.. రోడ్లు.. భవనాలు ఇలా ప్రతి పనికి లెక్కగట్టి అధికారులు నిధులిస్తున్నారు. ఇప్పటికే దాదాపు రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులు వివిధ దశల్లో ఉన్నాయి.                         - సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి

మరిన్ని వార్తలు