‘హరీ’త హారం.. ఎంత నిర్లక్ష్యం..!

26 Jul, 2016 19:27 IST|Sakshi
‘హరీ’త హారం.. ఎంత నిర్లక్ష్యం..!
  • నీళ్లు అందక వాడిపోతున్న వైనం
  • కానరాని సామాజిక భాగస్వామ్యం
  • నిర్వహణ విస్మరించిన అధికారగణం
  •  సిరిసిల్ల : ‘హాలో సార్‌.. నమస్తే.. ఎక్కడున్నారు?.. నేను మీ ఆఫీస్‌కు వచ్చా’ అనడిగితే.. ‘ ‘ఆ.. నేను హరితహారంలో బిజీగా ఉన్నా.. మొక్కలు నాటుతున్నా.. అందరితోనూ నాటిస్తున్నా’నంటూ అధికారులు సమాధానం చెబుతున్నారు.
    లక్షల మొక్కలు నాటాలనే సదుద్దేశంతో అధికారులేకాదు.. ప్రజాప్రతినిధులు, అన్నివర్గాలూ హరితహారం విజయవంతం కోసం శ్రమిస్తున్నారు. కానీ నాటిన మొక్కల నిర్వహణ విస్మరిస్తున్నారు. ఫలితంగా అవన్నీ నామరూపాలు లేకుండా పోతున్నాయి. ఓ వైపు అధికారులు మొక్కలు నాటుకుంటూ వస్తుంటే.. మరోవైపు నాటిన మొక్కలు నీళ్లుఅందక వాడిపోతున్నాయి. వాటికి రక్షణ లేక పోవడంతో ఈ దుస్థితి ఏర్పడింది. సిరిసిల్ల కళాశాల మైదానంలో ఇటీవల అధికారులు మొక్కలు నాటారు. వాటికి ట్రీగార్డులు ఏర్పాటు చేయలేదు. దీంతో పశువులు మేసేశాయి. పందులు పీకేశాయి. సిరిసిల్ల ప్రాంతంలో సుమారు 40లక్షల మొక్కలు నాటాలని అధికారులు లక్ష్యం నిర్దేశించుకున్నారు. సంరక్షణపై ప్రణాళికాబద్ధంగా వ్యవహరించకపోవడంతో వాడిపోయి నేల కూలుతున్నాయి. స్థానిక ప్రభుత్వ కళాశాల మైదానంలోని మొక్కలే ఇందుకు ఉదాహరణ. హరితహారం ద్వారా మొక్కలు నాటుతున్నా.. రక్షణ లేక అవి బతకలేక ‘హరీ’మంటున్నాయి. సిరిసిల్ల రెవెన్యూ, ఫారెస్ట్, మున్సిపల్, ఇరిగేషన్, మండల పరిషత్, ఐసీడీఎస్, విద్యా, వైద్యం, సామాజిక వనాలు, ఆర్టీసీ, కెమిస్ట్‌ అండ్‌ డ్రగ్గిస్ట్, పంచాయతీరాజ్‌.. ఇలా అన్ని శాఖలు ఎవరికి వారు హరితహారాన్ని పెద్ద ఎత్తున చేపడుతుండగా.. మొక్కలను బతికించేందుకు చర్యలు తీసుకోకపోవడంతో హరితహారం లక్ష్యం నెరవేరడం లేదు. ఇప్పటికైనా అధికారులు నాటిన మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
     
     
     
మరిన్ని వార్తలు