టెండర్ల కిక్కు

30 Mar, 2017 23:45 IST|Sakshi
టెండర్ల కిక్కు

 – కిక్కిరిసిన సూపరింటెండెంట్‌ కార్యాలయం
– నేడు విద్యుత్‌ కళాభారతిలో లాటరీ ద్వారా టెండర్ల  ఖరారు
– అమల్లో 144 సెక‌్షన్‌

అనంతపురం సెంట్రల్‌ : మద్యం షాపుల కోసం టెండర్‌దారులు ఎగబడ్డారు. దరఖాస్తు చేసుకోవడానికి గురువారం చివరిరోజు కావడంతో విద్యుత్‌నగర్‌ సర్కిల్‌లోని ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయం కిటకిటలాడింది. వేలాది మంది టెండర్‌దారులు వచ్చి దరఖాస్తులను సరిచూసుకున్నారు. జిల్లాలో 246 మద్యం దుకాణాలకు రెండేళ్లకు సంబంధించి టెండర్‌ ఆహ్వానించిన విషయం విదితమే.  గురువారం రాత్రి‡ 8 గంటల వరకూ ఆన్‌లైన్‌ ద్వారా టెండర్లు స్వీకరణ, వెరిఫికేషన్‌కు గడువు విధించారు.  ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్టభద్రత కల్పించారు. గురు, శుక్రవారాల్లో 144 సెక‌్షన్‌లో అమల్లో ఉంటుందని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు.

246 షాపులకు 6,962 మంది దరఖాస్తు
తొలి రెండు రోజులు పెద్దగా ఆసక్తి చూపని టెండర్‌దారులు చివరి రెండు రోజులు అనూహ్యరీతిలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు రుసుం కింద గురువారం నాటికి రూ.40 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో మొత్తం 246 షాపులకు ఆన్‌లైన్‌ ద్వారా టెండర్‌ దరఖాస్తులు ఆహ్వానించారు. వీటికోసం 6,962 మంది దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో ప్రతి మద్యం షాపునకు దరఖాస్తులు వచ్చాయి. గురువారం రాత్రి 9 గంటల వరకూ 5,650 మంది వెరిఫికేషన్‌ కూడా చేయించుకున్నారు. మిగిలిన వారికి రాత్రి 12 గంటల వరకూ గడువు విధించారు. ఆలోగా వెరిఫికేషన్‌ చేయించుకోని వారి దరఖాస్తులను రద్దు చేస్తామని అధికారులు తెలిపారు.

నేడు లాటరీ
మద్యం దుకాణాలకు వచ్చిన టెండర్లను శుక్రవారం ఖరారు చేయనున్నట్లు ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ అనిల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. . గుత్తిరోడ్డులోని విద్యుత్‌ కళాభారతి ఫంక‌్షన్‌ హాల్లో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి లాటరీ ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్, ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ తదితర ఉన్నతాధికారుల సమక్షంలో టెండర్‌ ప్రక్రియ నిర్వహిస్తామని వివరించారు. ఈ మేరకు కట్టుదిట్టమైన ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.

మరిన్ని వార్తలు