అవినీతి సొమ్ము మార్చేదెలా?

16 Nov, 2016 02:07 IST|Sakshi
అవినీతి సొమ్ము మార్చేదెలా?

అధికార పార్టీ నేతల్లో గుబులు
 
విశాఖపట్నం: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా కోట్లు కూడబెట్టిన అధికార పార్టీ నాయకులకు ఇప్పుడు కంటిపై కునుకు కరువైంది. ఇసుక నుంచి రేషన్‌షాపు డీలర్‌షిప్‌ల వరకు, సీసీ రోడ్ల నుంచి ఇళ్ల క్రమబద్ధీకరణ వరకు ప్రతి పనిలో కిక్‌బ్యాగ్‌లు, పర్సంటేజ్‌లు తీసుకుంటూ సంపాదించిన సొమ్ము ఎక్కడ దాచుకోవాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు. కొందరు హవాలా మార్గంలో మార్చుకునేందుకు చాపకింద నీరులా ప్రయత్నాలు సాగిస్తున్నారు. సిండికేట్‌లో చక్రం తిప్పే ఓ ప్రజాప్రతినిధితో పాటు పోర్టు వ్యాపారాల లావాదేవీల్లో కింగ్‌మేకర్‌గా ఉన్న మరో ప్రజాప్రతినిధి ఈ తరహాలో బ్లాక్‌ను వైట్ చేసుకుంటున్నట్టు గుసగుసలు విన్పిస్తున్నారుు. గ్రామీణ జిల్లా పరిధిలోనూ ఒకరిద్దరు ఎమ్మెల్యేలు హవాలా బ్రోకర్ల ద్వారా ఎక్స్‌చేంజ్ చేసుకుంటున్నారు. గడిచిన వారం రోజుల్లో ఇలా వందల కోట్ల బ్లాక్‌మనీ వైట్‌గా మారినట్టు తెలిసింది. తొలుత ఎక్స్‌చేంజ్‌కు 20 శాతం కమిషన్ తీసుకున్న ఈ బ్రోకర్లు ప్రస్తుతం 30 నుంచి 35 శాతం వరకు తీసుకుంటున్నట్టు చెబుతున్నారు.
 
పన్ను పరిధిలోకి రాకుండా ఉండేందుకు..
చోటామోటా నాయకులు తమకు పరిచయం ఉన్న బ్యాంకు మేనేజర్ల ద్వారా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా మార్చిన సొమ్ము పన్నుల పరిధిలోకి రాకుండా ఉండేందుకు వివిధరూపాల్లో బ్యాంకులో జమైనట్టుగా చూపించి సర్దుబాటు చేస్తున్నారు. మరోవైపు ఏడాది వరకు ఎలాంటి వడ్డీ లేకుండా వ్యాపారస్తులకు అప్పులిస్తున్నారు. తొలి రెండురోజులు జన్‌ధన్ ఖాతాల్లో జమ చేరుుంచినా ఆ డిపాజిట్లపై ఇన్‌కంటాక్స్ నిఘా పెట్టిందన్న వార్తల నేపథ్యంలో కాస్త వెనుకడుగు వేస్తున్నారు. డిసెంబర్ 30 వరకు మార్చుకునే అవకాశం ఉండడంతో ఏదో విధంగా వైట్ చేసుకోవాలన్న తపనతో పరుగులు పెడుతున్నారు.

మరిన్ని వార్తలు