హృదయాలయం

3 May, 2017 23:01 IST|Sakshi
హృదయాలయం
 - జీజీహెచ్‌లో మూడు రోజుల్లో ముగ్గురికి గుండె ఆపరేషన్లు 
 
కర్నూలు (హాస్పిటల్‌): రాష్ట్ర విభజన అనంతరం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల అరుదైన గుండెశస్త్రచికిత్సలకు వేదికైంది. మూడు రోజుల్లో మూడు అరుదైన శస్త్రచికిత్సలు నిర్వహించి ప్రాణం పోశారు. ఇందులో ఒకరు జీవిత ఖైదు పడిన ఖైదీ, మరొకరు బాలింత కూడా ఉండటం విశేషం. ముగ్గురికీ ఎన్‌టీఆర్‌ వైద్యసేవ ద్వారా ఉచితంగా ఆపరేషన్‌ చేశారు. వివరాలను బుధవారం ఆసుపత్రిలోని కార్డియోథొరాసిక్‌ విభాగంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్డియోథొరాసిక్‌ సర్జన్‌ డాక్టర్‌ ప్రభాకర్‌రరెడ్డి వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే ‘ వైఎస్‌ఆర్‌ కడప జిల్లా ముద్దాపురానికి చెందిన ఆర్‌. వెంటకరెడ్డి(72) ఒక కేసు విషయంలో జీవితఖైదును అనుభవిస్తున్నాడు. ఆయనకు కొరనరి ఆర్టరి డిసీస్‌ అనే గుండెజబ్బు ఉండటంతో గుండెనొప్పి, ఆయాసంతో బాధపడేవాడు. ఆయనకు గుండెలో మూడు వాల్వులు బ్లాక్‌ అయ్యాయి. దీనికితోడు గుండె సైతం ఫుట్‌బాల్‌ అంత సైజులో పెరిగింది. సాధారణంగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీకి రాష్ట్ర రాజధానిలోని ఆసుపత్రిలో ఆపరేషన్‌ నిర్వహిస్తారు. ఈ తరుణంలో ఆయనకు జైళ్ల శాఖ నుంచి అనుమతి తీసుకుని కర్నూలులోనే బీటింగ్‌ హార్ట్‌ సర్జరీ నిర్వహించాం.
 
బాలింతకు అరుదైన గుండెజబ్బు
ఎమ్మిగనూరు మండలం గుడేకల్‌ గ్రామానికి చెందిన జి. మాదన్న భార్య సువర్ణ(25)కు ఏడు నెలల పాప ఉంది. బాలింత అయిన ఆమె పాపకు రోజూ పాలివ్వాలి. ఇదే సమయంలో ఆమెకు అరుదైన మైట్రల్‌ స్టెనోసెస్‌ అనే గుండెజబ్బు వచ్చింది. తీవ్రమైన ఆయాసం, దగ్గుతో బాధపడుతున్న ఆమె చికిత్స నిమిత్తం తమ వద్దకు వచ్చింది. గత నెల 29వ తేదీన ఆమెకు క్రాస్‌ క్లాంప్, స్కిన్‌ టు స్కిన్‌ అనే విధానంలో ఆపరేషన్‌ నిర్వహించాం.  
 
రాష్ట్రంలో తొలి గుండెశస్త్రచికిత్స
కోడుమూరుకు చెందిన గిడ్డయ్య(45)కు అయోటిక్‌ స్టెటోసిస్‌ అనే గుండెవ్యాధి ఉంది. ఆయనకు వాల్వ్‌ రీప్లేస్‌మెంట్‌ చేయాలి. ఆయనకు ఛాతి ఎముకలు కట్‌ చేయకుండా ఈ నెల 1వ తేదీన అరోటిక్‌ వాల్వ్‌ రీప్లేస్‌మెంట్‌ చేశాము. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి ఆపరేషన్‌ చేయడం ఇదే మొదటిసారి. ఇలాంటి విదానం వల్ల రోగికి తక్కువగా నొప్పి ఉండి, త్వరగా కోలుకునే అవకాశం ఉంది. నెలరోజుల్లోనే ఆయన వంద కిలోల బరువు కూడా ఎత్తే సామర్థ్యం వస్తుంది. 
 
మరిన్ని వార్తలు