అనుమానంతో భార్యను హత్యచేసిన భర్త

5 Aug, 2016 10:26 IST|Sakshi
అనుమానంతో భార్యను హత్యచేసిన భర్త
తెనాలిరూరల్‌ (గుంటూరు): అనుమానంతో భర్త చిత్ర హింసలు పెడుతున్నా సహించింది. వేధింపులు హెచ్చు మీరడంతో కుటుంబ పెద్దలకు చెప్పుకుంది. గతంలో ఓ సారి పోలీస్‌స్టేషను వరకు వెళ్లినా, పెద్దలు రాజీ చేసి పంపారు. అయినా వేధింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. భర్త అస్తమానం ఫోన్లు మాట్లాడుతుండడంతో ప్రశ్నించింది, దీంతో వేధింపులు తారాస్థాయికి చేరాయి. రెండున్నరేళ్లుగా భరిస్తూ వచ్చిన ఆమె చివరకు అతని చేతిలో బలైంది. పట్టణ జయప్రకాష్‌ నగర్‌లో గురువారం సాయంత్రం భార్యను పచ్చడి బండతో మోది భర్త కిరాతకంగా హత్య చేశాడని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
 
విజయవాడకు చెందిన దాది లక్ష్మిదుర్గ (30)కు తొమ్మిదేళ్ల క్రితం పట్టణంలో టైల్స్, గ్రానైట్‌ మేస్త్రిగా పని చేసే వేముల వెంకటకృష్ణతో వివాహమైంది. వీరికి ఇరువురు సంతానం. కుమారుడు మహేష్‌ రెండో తరగతి, కుమార్తె భువన ఒకటోతరగతి. గురువారం పిల్లలు స్కూలుకు వెళ్లారు. భార్యభర్తలిరువురు ఉదయం ఇంటి నుంచి వెళ్లి సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చారు. వచ్చిన కొద్ది సేపటికి ఇరువురు వాదులాడుతున్నారు. వెంకటకృష్ణ దాడి చేస్తుండడంతో కేకలు పెట్టింది. చివరకు గదిలోనే ఉన్న పచ్చడిబంతో మోదడంతో లక్ష్మిదుర్గ అక్కడికక్కడే బలైంది. ఘటన జరిగిన గది భయానకంగా ఉండడంతో, సాయంత్రం స్కూలు నుంచి వచ్చిన పిల్లలను బంధువులు సుల్తానాబాద్‌లోని వారి బాబాయి ఇంటికి పంపేశారు. సమాచారం అందుకున్న సీఐలు బి. కళ్యాణ్‌రజు, బి.శ్రీనివసారావు, ఎ.అశోక్‌కుమార్, యు.రవిచంద్ర, టూ టౌన్‌ ఎస్‌ఐలు జె. క్రాంతికిరణ్, కె. భాస్కరరావు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
రెండేళ్లకుపైగా గొడవలు..
వెంకటకష్ణ, లక్ష్మిదుర్గ తరచూ వాదులాడుకునే వారని స్థానికులు చెబుతున్నారు. రెండేళ్లకు పైగా తరచూ ఇరువురూ ఘర్షణ పడుతుండే వారని, పెద్దలు సర్ధిచెప్పేవారని తెలిపారు. రెండేళ్ల క్రితం భర్త వేధింపులపై టూ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో లక్ష్మిదుర్గ ఫిర్యాదు చేసిందని, అయితే పెద్దలు సర్ధిచెప్పడంతో పిటిషన్‌ను వాపసు తీసుకుందని బంధువులు చెబుతున్నారు. భర్త అదేపనిగా ఫోన్లు మాట్లాడుతుండడాన్ని ప్రశ్నించేదని, అదే విధంగా అమె ప్రవర్తనపై అనుమానంతో వేధిస్తుండేవాడని చెబుతున్నారు. తమ కుమార్తెను రెండేళ్లకు పైగా చిత్రహింసలు పెడుతున్నాడని, పెద్దల సమక్షంలో రాజీ కుదిరేదని తల్లి సైదమ్మ తెలిపింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది.  
మరిన్ని వార్తలు