అడ్డుగా భావించి..హతమార్చారు

23 Jun, 2016 13:11 IST|Sakshi
అడ్డుగా భావించి..హతమార్చారు

హైదరాబాద్ వాసీ ఇల్లెందులో దారుణ హత్య
భార్యాభర్త వివాదంలో దూరాడని కిడ్నాప్, ఆపై హతం
సింగరేణి ఆస్పత్రి సమీపంలో పూడ్చిన వైనం
ఆరు రోజుల తర్వాత వెలుగు చూసిన ఘటన

ఇల్లెందు: దంపతుల వివాదంలో జోక్యం చేసుకుంటున్నాడని భావించి హైదరాబాద్ దిల్‌షుక్‌నగర్‌కు చెందిన ఎం.శ్రీహరిరావు (62)ను ఇల్లెందు 24 ఏరియాకు చెందిన ఆటో డ్రైవర్ ఎన్.వెంకటేశ్వర్లు, ఆయన సోదరులు ఆంజనేయులు, రాజేష్, మరో ఆటో డ్రైవర్ నందకిషోర్‌లతో కలిసి హతం చేశాడు. ఈ నెల 17న ఇల్లెందులో కిడ్నాప్ చేసి హతమార్చారు. మృతదేహాన్ని సింగరేణి ఏరియా హాస్పిటల్ వెనుక అటవీ ప్రాంతంలో పూడ్చిపెట్టారు. మృతుడు శ్రీహరిరావు భార్య రమణి భర్త ఆచూకీ లభించడం లేదని ఫిర్యాదు చేయగా పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇల్లెందు సీఐ అల్లం నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం..

భార్య తరఫున జోక్యం చేసుకున్నాడనే..
ఇల్లెందు 24 ఏరియాకు చెందిన ఆటో డ్రైవర్ ఎన్.వెంకటేశ్వర్లు, ప్రశాంతి భార్యాభర్త. వీరిద్దరిదీ ఇల్లెందు ప్రాంతమే. 2004లో వివాహమైంది. ఇద్దరు అబ్బాయిలు సంతానం ఉన్నారు. భార్యాభర్త మధ్య తరచు గొడవలు జరుగుతుండడంతో ఐదేళ్లుగా ఆమె వేరుగా ఉంటోంది. కొంతకాలంగా హైదరాబాద్‌లోని దిల్‌షుక్‌నగర్‌లో ఉంటూ..ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. దిల్‌షుక్‌నగర్‌లోని సాయిబాబా దేవాలయం మేనేజర్ శ్రీహరిరావుతో పరిచ యం ఏర్పడింది.

తన గోడును అతడికి వివరించింది. భర్తతో విడాకుల కోసం కోర్టులో కేసు నడుస్తోంది. ఈ క్రమంలో ఆమె వెంట అతను పలుమార్లు ఇల్లెందుకు వచ్చాడు. ఈ నెల 17న ఇల్లెందు కోర్టులో వాయిదా ఉండగా 14వ తేదీన ప్రశాంతి, 17వ తేదీన శ్రీహరిరావు ఇల్లెందుకు చేరుకున్నారు. పిల్లలను ఎందుకు తీసుకురాలేదని కోర్టు వద్ద ప్రశాంతిని ఆమె భర్త మందలించాడు. ఆమె తరఫున శ్రీహరిరావుకు, భర్త వెంకటేశ్వర్లుకు మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే శ్రీహరిరావుపై కసి పెంచుకొని..సోదరులతో కలిసి కుట్ర పన్నాడు.

పట్టించిన సెల్ సిగ్నల్..
శ్రీహరిరావు ఆచూకీ లేకపోవడంతో.. ఆయన భార్య, కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడి సెల్ సిగ్నల్ చివరగా ఈ నెల 17న ఇల్లెందు ప్రాంతంలో ఉన్నట్లు చూపడంతో..ఇక్కడికి వచ్చి విచారణ చేశారు. కోర్టు వ్యవహారం, భార్యాభర్త గొడవలో జోక్యం చేసుకున్న విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆటో డ్రైవర్ వెంకటేశ్వర్లును అదుపులో తీసుకుని ప్రశ్నించగా..తనతో పాటు సోదరులు ఆంజనేయులు, రాజేష్, ఆటో డ్రైవర్ నందకిషోర్ సహాయంతో హతమార్చినట్లు అంగీకరించాడు. బుధవారం మధ్యాహ్నం తహసీల్దార్ ఎన్‌టీ.ప్రకాశ్ సమక్షంలో మృతదేహాన్ని వెలికి తీసి పంచానామా నిర్వహించారు. సీఐ అల్లం నరేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసు దర్యాప్తులో ఎస్‌ఐలు సతీష్, కొమురెల్లి, ఇబ్రహీంలు సహకరించారు. మృతుడి భార్య రమణి, బందువులు సంఘటనా స్థలాన్ని సందర్శించి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు.

ఆటోలో తరలించి..హతం
ఈ నెల 17వ తేదీన ఓ ఆటోలో శ్రీహరిరావును ఆటో డ్రైవర్ వెంకటేశ్వర్లు బలవంతంగా సింగరేణి హాస్పిటల్ వెనుకవైపు అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. మరికొందరితో కలిసి బలమైన వస్తువుతో అతడి ముఖంపై తీవ్రంగా మోది, గొంతు నులిమారు. తుదిశ్వాసలో ఉన్న క్రమంలో ఓ ఆర్‌ఎంపీకి ఫోన్ చేసి వైద్యం చేయాలని సంప్రదించారు. నిరాకరించడంతో..వారే ప్రథమ చికిత్సకు యత్నించారు. అప్పటికే శ్రీహరిరావు చనిపోవడంతో..సమీపంలోని అటవీప్రాంతంలో మృతదేహాన్ని పాతి పెట్టారు.

మరిన్ని వార్తలు