భారత జాతీయతకే తీరని అవమానం..సిగ్గుగా ఉంది: ప్రియాంక గాంధీ ధ్వజం

28 Oct, 2023 14:38 IST|Sakshi

ఇజ్రాయెల్-హమాస్ వివాదంపై ఐక్యరాజ్యసమితి తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ గైర్హాజరు కావడంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి  ప్రియాంక గాంధీ వాద్రా  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  సత్యం, అహింస అనే ధర్మాలకు ప్రతీక అయిన భారత దేశం దీనికి దూరంగా ఉండటం సిగ్గు చేటు అంటూ మోదీ సర్కార్‌పై ధ్వజమెత్తారు.  ఈ మేరకు ఆమె శనివారం ట్విటర్‌ ద్వారా ఒక ప్రకటనను  పోస్ట్‌ చేశారు. 

అహింస, సత్యం అనే సిద్దాంతాల పునాదుల మీదే మన దేశం ఆవిష్కృతమైంది. ఈ సిద్ధాంతాల కోసమే స్వాతంత్ర్య సమరయోధులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. దేశానికి స్వేచ్ఛని ప్రసాదించారు. మన జాతీయతకు నిదర్శనమైన ఈ సూత్రాలకోసం జీవితమంతా నిలబడిన దేశానికి భిన్నంగా మోదీ సర్కార్‌ వ్యవహరించిందంటూ ట్వీట్‌ చేశారు.  పాలస్తీనాలో వేలాది మంది పురుషులు మహిళలు, పిల్లలను హత మార్చడాన్ని మౌనంగా చూస్తూ  ఉండటం భారత దేశ మూల సూత్రాలకే విరుద్ధమని మండిపడ్డారు. కంటికి కన్ను అనే  విధానం  మొత్తం ప్రపంచాన్ని అంధత్వంలోని నెట్టేస్తుందన్న గాంధీజీ కోట్‌ను తన ప్రకటనకు  ప్రియాంక జోడించారు.

కాగా ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో గాజా స్ట్రిప్‌లో బాధితులకు ఎలాంటి అవరోధం లేకుండా సహాయ కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశ్యంతో ఐక్యరాజ్యసమితిలో ప్రతిపాదించిన ‘మానవతావాద సంధి’ తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై ఆకస్మిక దాడి చేసిన  ఉగ్రవాద సంస్థ హమాస్ పేరును ఈ తీర్మానంలో ప్రస్తావించకపోవడమే ఇందుకు కారణమని భారత్ స్పష్టం చేసింది. 

ఇజ్రాయెల్-హమాస్ నేపథ్యంలో గాజా స్ట్రిప్‌లో ఎలాంటి అవరోధాలు లేకుండా సహాయ కార్యక్రమాలకు అవకాశం ఇవ్వాలని కోరుతూ జోర్డాన్ ఈ తీర్మానాన్ని ప్రవేశ పెట్టింది. గాజా స్ట్రిప్‌కు సహాయం అందించాలని ,పౌరులకు రక్షణ కల్పించాలని కూడా తీర్మానం డిమాండ్ చేసింది. పౌరుల రక్షణ. చట్టపరమైన, మానవతా బాధ్యతలకు సమర్థన’ అనే పేరిట ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి  బంగ్లాదేశ్, మాల్దీవులు, పాకిస్థాన్, రష్యా, దక్షిణాఫ్రికాతో సహా 40కిపైగా దేశాలు మద్ధతుగా నిలిచాయి. అనుకూలంగా 120 దేశాలు, వ్యతిరేకంగా 14 దేశాలు ఓటువేశాయి. 45 దేశాలు ఓటింగ్‌లో పాల్గొనలేదు. భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, జపాన్, ఉక్రెయిన్, యూకేతోపాటు పలు దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు