నేను చెప్పిన వారికి ఇవ్వాల్సిందే!

16 Oct, 2016 00:52 IST|Sakshi
– జెన్‌కో థర్మల్‌ ప్లాంటు సబ్‌ కాంట్రాక్టులపై మంత్రి ఒత్తిళ్లు
– లేనిపక్షంలో పనులు ప్రారంభం కానివ్వనని హెచ్చరికలు
 
సాక్షి ప్రతినిధి, కర్నూలు: 
నేను చెప్పిన వారికే పనులు ఇవ్వాలి. ఇందుకు భిన్నంగా మీ ఇష్టానుసారం చేస్తామంటే ఇక్కడ కుదరదు. నేను చెప్పిన వారికి సబ్‌ కాంట్రాక్టులు ఇవ్వకపోతే మీరు పనులెలా చేస్తారో అదీ చూస్తాను.. ఇదేదో ఒక ప్రైవేటు వ్యక్తి చేస్తున్న బెదిరింపులు కాదు. స్వయంగా రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న అధికార పార్టీకి చెందిన మంత్రి ఒక ప్రైవేటు సంస్థ ప్రతినిధులను పిలిచి మరీ చేస్తున్న హెచ్చరికలు. విజయవాడకు సమీపంలో ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ(ఏపీజెన్‌కో) కొత్తగా 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నార్ల తాతారావు థర్మల్‌ పవర్‌ స్టేషన్‌(ఎన్‌టీటీపీఎస్‌) పనులను చేపడుతోంది. ఇందుకు సంబంధించి బాయిలర్, టర్బైన్, జనరేటర్‌(బీటీజీ) పనులను ప్రభుత్వరంగ సంస్థ బీహెచ్‌ఈఎల్‌ దక్కించుకుంది. ఇక మిగిలిన బ్యాలెన్స్‌ ఆఫ్‌ ప్లాంటు(బీవోటీ) పనులను ప్రైవేటు సంస్థ బీజీఆర్‌ ఎనర్జీ దక్కించుకుంది. వాస్తవానికి ఈ పనుల అప్పగింతపై అనేక ఆరోపణలు వినిపించాయి. వాస్తవ ధర కంటే అధిక ధరకు పనులు కట్టబెట్టారనే విమర్శలు ఉన్నాయి. అయితే, ఈ పనులను దక్కించుకున్న సదరు ప్రైవేటు సంస్థకు అధికారపార్టీకి చెందిన మంత్రి నుంచి ఒత్తిళ్లు ప్రారంభమయ్యాయి. తనకు తెలియకుండా సబ్‌ కాంట్రాక్టులు మీరే అప్పగిస్తామంటే కుదరదని హెచ్చరిస్తున్నారు. 
 
అంతా మీ ఇష్టమేనా?
వాస్తవానికి 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ ప్లాంటు పనులు ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, అనేక రకాల ఆరోపణలు.. ఉన్నతాధికారుల మధ్య నెలకొన్న వివాదాలతో పనుల అప్పగింత ఆలస్యమయ్యింది. తీరా పనులు అప్పగించిన తర్వాత ఇప్పుడు అధికార పార్టీ మంత్రి పనుల ప్రారంభానికి మోకాలడ్డుతున్నారు. పనులకు సంబంధించి సాయిల్‌ టెస్టుతో పాటు డ్రాయింగ్‌ పనులను పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో బీవోటీలో భాగమైన చుట్టూ ప్రహరీగోడ, యాష్‌ పాండ్‌ తదితర కొన్ని పనులను సదరు ప్రైవేటు సంస్థ ఇప్పటికే ఇతర కంపెనీలకు అప్పగించింది. అయితే, తనకు తెలియకుండా మీకు మీరుగానే పనులను సబ్‌ కాంట్రాక్టర్లకు అప్పగిస్తే ఎలా అని మంత్రి బెదిరింపులు ప్రారంభమయ్యాయి. తాను చెప్పిన వారికే సబ్‌కాంట్రాక్టు పనులు అప్పగించాలని ఒత్తిళ్లు తెస్తున్నారు. ఇందుకు భిన్నంగా జరిగితే పనులు చేయలేరని హెచ్చరికలు కూడా జారీచేశారు.
 
సీఎంకు ఫిర్యాదు చేద్దామా?
వాస్తవానికి సదరు మంత్రి ఒత్తిళ్ల గురించి ఇప్పటికే జెన్‌కో ఉన్నతాధికారులకు ప్రైవేటు సంస్థ ఫిర్యాదు చేసింది. అయితే, అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి దృష్టికి మొత్తం వ్యవహారం తీసుకెళదామా? వద్దా అని సదరు సంస్థ ఆలోచిస్తోంది. తీరా సీఎం దృష్టికి తీసుకెళ్లిన తర్వాత కూడా ఏమీ చేయలేకపోతే అనవసరంగా మంత్రి దృష్టిలో నిష్టూరం కావాల్సి వస్తుందని కంపెనీ ప్రతినిధులు భయాందోళన చెందుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మంత్రిని సీఎం కట్టడి చేసే అవకాశం లేదని కూడా సమాచారం. మొత్తం మీద అసలు కాంట్రాక్టులో ధరలు పెంచి ముఖ్యనేతలు వాటాలు పంచుకుంటుంటే... సబ్‌ కాంట్రాక్టులో మంత్రులు వాటాలు దండుకునేందుకు సిద్ధమయ్యారన్నమాట.  
 
 
మరిన్ని వార్తలు