వాంతి కోసం తల బయట పెడితే..

16 Jun, 2016 08:10 IST|Sakshi
వాంతి కోసం తల బయట పెడితే..

చేయి తెగి పడింది తలకూ గాయాలు

నూజివీడు : ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న బాలిక  కిటికీలో నుంచి వాంతి చేసుకుంటుండగా ఎదురుగా వస్తున్న లారీ తగిలి తీవ్రంగా గాయపడిన ఘటన బుధవారం వెంకట్రాదిపురంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం చౌడవరానికి చెందిన సజ్జా నాగసౌందర్య(12) వాళ్ల అమ్మతో కలిసి ఇటీవల బంధువుల ఇంటికి వచ్చారు. తిరిగి వారి గ్రామం వెళ్లేందుకు నూజివీడులో  సత్తుపల్లి బస్సు ఎక్కారు. బస్సు వెంకటాద్రిపురం వెళ్లే సరికి బాలికకు వాంతులు అవుతుండటంతో బస్సులో వెనుకభాగంలోని సీట్లో కూర్చుని కుడివైపు కిటికీలోంచి తల పెట్టి వాంతి చేసుకుంటోంది. ఇంతలో హఠాత్తుగా లారీ దూసుకురావడంతో తగలడంతో బాలిక కుడి మోచేయి తెగి పడింది. తలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బస్సును నిలిపివేసి 108 వాహనంలో బాలికను నూజివీడు ప్రభుత్వాస్పత్రికి తరలించి అక్కడ ప్రథమచికిత్స నిర్వహించారు. ఆ తరువాత తెగిపడిన చేతితోపాటు బాలికను  విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.


పోలీసుల అదుపులో లారీ డ్రైవర్
ప్రమాదం జరిగిన వెంటనే లారీని ఆపకుండా వెళ్లిపోతున్న డ్రైవర్‌ను బస్సు డ్రైవర్ వెంబడించి నూజివీడు మండలం అన్నవరం వద్ద అడ్డుకున్నాడు. అనంతరం పోలీసుస్టేషన్‌కు సమాచారం అందించారు. నందిగామ ప్రాంతానికి చెందిన లారీ మహారాష్ట్ర నుంచి ముదినేపల్లికి లోడుతో వెళ్తోంది. లారీడ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. రూరల్ పోలీస్‌స్టేషన్ ఏఎస్‌ఐ శాగం రాధాకృష్ణారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీని, బస్సును స్టేషన్‌కు తరలించారు.

 

మరిన్ని వార్తలు