కలప దందా.. కాసుల వరద..!

22 Sep, 2016 23:01 IST|Sakshi
కలప దందా.. కాసుల వరద..!
  • ఇక్కడ దుంగకు రూ.వెయ్యి.. అక్కడ ఫీట్‌కు రూ.1,200
  • ఈ అక్రమ బిజినెస్‌తో స్మగ్లర్లకు పైసలే పైసలు
  • ‘మామూలు’గా తీసుకుంటున్న అధికారులు
  • జన్నారం : అడవిలో ఉంటున్న కొందరు గిరిజనులను మచ్చిక చేసుకుని.. ఆ ప్రాంతం అటవీ సిబ్బందికి ఎంతో కొంత ముట్టజెప్పుతూ ఇక్కడి నుంచి తీసుకుపోయే కలప దుంగలకు మూడంతలు సంపాదిస్తున్నారు స్మగ్లర్లు. ఇలా తమ బిజినెస్‌ను గుట్టు చప్పుడు కాకుండా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. డివిజన్‌లోని జన్నారం, తాళ్లపేట్‌ అటవీ రేంజ్‌లలో ఈ బిజినెస్‌ ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల ద్వారా బయట పడిన విషయాలు ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి. ఉన్నతాధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నా కిందిస్థాయి అధికారుల సహకారం స్మగ్లర్లకు వరంగా మారింది.
    స్మగ్లింగ్‌ జరుగుతోందిలా...
    జన్నారం, తాళ్లపేట్, ఇంధన్‌పల్లి రేంజ్‌ల పరిధిలోని పలు అటవీ ప్రాంతాల నుంచి కొందరు గిరిజనులు దుంగలు కొట్టి, వాటిని జన్నారం మండలానికి చెందిన కొందరు జట్టుగా ఏర్పాటు చేసుకున్నారు. వారు గిరిజనుల వద్ద నుంచి రూ.1000 కి ఒక టేకు దుంగ(సైజు 10–6, సుమారుగా 3 ఫీట్లు) కొనుగోలు చేసి, గుట్టుచప్పుడు కాకుండా గోదావరి వరకు ఎడ్లబండి లేదా, సైకిళ్లపై తరలిస్తారు. అక్కడ మరో వ్యక్తి కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉంటారు. అక్కడి నుంచి కలపను ఆ వ్యక్తి ఫీటుకు రూ.1,200 నుంచి రూ.1,800 చొప్పున కొనుగోలు చేస్తారు. అంటే రూ.వెయ్యితో కొనుగోలు చేసిన దుంగకు రూ.3 వేల నుంచి రూ.5,400 వరకు వస్తున్నాయి. ఇలాంటి వ్యాపారం ఏదీ ఉండదని, స్మగ్లర్లు ఈ రూటును ఎంచుకున్నట్లు తెలుస్తుంది. ఇందులో సంబంధిత ప్రాంత బీట్‌ అధికారికి నెలకు కొంత చొప్పున మాట్లాడుకుని నెలనెలా చెల్లిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఇటీవల ఓ అధికారి నిర్మించుకున్న ఇంటికి కూడా కలప ఇక్కడి నుంచే స్మగ్లర్లు తరలించినట్లు ప్రచారం జరుగుతోంది.
    రాజకీయ జోక్యం
    కలప పట్టుకున్న రెండో రోజు నుంచి రాజకీయ జోక్యం కల్పించుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది. రాజకీయ నాయకులు ఆయన మా పార్టీకి చెందినవాడు. స్మగ్లర్‌ కాదు.. కేసులు లేకుండా చేయాలని అటవి అధికారులకు ఒత్తిడి తెస్తున్నట్లు ఓ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. పట్టుకున్న వారిని వదిలేస్తే ఇక పట్టుకోవడం ఎందుకని కూడా అటవీ శాఖ అధికారులంటున్నారు. రాజకీయ నాయకులు జోక్యం చేసుకోకుండా సహకరించాలని కోరుతున్నారు.
    కేసులు నమోదు చేస్తాం
    స్మగ్లింగ్‌కు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేస్తాం. ఇటీవల కలప పట్టుకున్న ఘటనలో ఆరుగురిపై కేసు నమోదు చేశాం. మాకు పోలీసుల సహకారం ఉన్నందున స్మగ్లర్లు తప్పించుకునే అవకాశం లేదు. ఎంతటివారైన చర్యలు తప్పవు. పెట్రోలింగ్‌ ద్వారా రాత్రి అడవిలో తిరుగుతున్నాం.
    – షౌకత్‌హుస్సేన్, రేంజ్‌ అధికారి
మరిన్ని వార్తలు